10రోజుల్లో రెండుసార్లు గర్భం దాల్చింది!
10రోజుల్లో రెండుసార్లు గర్భం దాల్చింది!
Published Wed, Nov 16 2016 5:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
బ్రిస్బేన్: బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళకు ఓ మధురానుభూతి.. ఇటీవలికాలంలో కొందరు స్త్రీలు పలు కారణాలవల్ల అమ్మ అనిపించుకోలేకపోతుండగా.. ఓ మహిళ మాత్రం అద్భుతమైన రీతిలో పదిరోజుల్లో వ్యవధిలోనే రెండుసార్లు గర్భవతి అయింది. ఒకేరోజు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. వైద్యరంగంలోనే అరుదైన ఈ ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకుంది.
సూపర్‌ఫెటేషన్ (ఒకేసారి రెండు అండాలు గర్భంలోకి చేరడం) అనే అరుదైన వైద్యపరిస్థితి వల్ల 10 రోజుల వ్యవధిలోనే కేట్ హిల్ రెండుసార్లు గర్భవతి అయింది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ కారణంగా 2006 నుంచి ఆమె హార్మోన్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న క్రమంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.
అదికూడా భర్తతో ఒకేసారి శృంగారంలో పాల్గొన్నప్పటికీ పదిరోజుల్లో ఆమె రెండుసార్లు గర్భవతి కావడం వైద్యులను విస్మయ పరిచింది. వెంటవెంటనే ఆమె విడుదల చేసిన అండాలు భర్త వీర్యంతో రెండుసార్లు ఫలదీకరణం చెందడం వల్ల ఇది సంభవించింది. పురుషుడి వీర్యం పదిరోజులపాటు క్రియాశీలంగా ఉంటుంది. దీంతో ఆమె ఒకేరోజు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఒకేపోలికతో ఉన్న కవలలు కాదు. ఇద్దరి బరువు, పరిమాణం భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి అరుదైన ఘటనలు వైద్యచరిత్రలో ఇప్పటివరకు పది చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
Advertisement