
వైద్య శాస్త్రంలో అరుదైన సంఘటన
న్యూఢిల్లీ: వైద్య శాస్త్రంలో అరుదైన, వింతైన సంఘటన జరిగింది. అసోంలో జన్మించిన ఓ ఆడ శిశువుకు.. గుండె శరీరంలో కాకుండా ఛాతీపైన ఉంది. దుబ్రి జిల్లా పుట్కిబరి గ్రామంలో గురువారం రాత్రి ఈ పాప జన్మించింది. స్థానిక వైద్యులు సూచన మేరకు తల్లీబిడ్డను తొలుత దుబ్రి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి (జీఎంసీహెచ్) తరలించారు. ఈ వివరాలను కుటుంబ సభ్యులు, వైద్యులు వెల్లడించారు.
జీఎంసీహెచ్ ఐసీయూలో శిశువును పరిశీలనలో ఉంచారు. బెంగళూరులోని ప్రఖ్యాత నారాయణ హృదయాలయ ఆస్పత్రితో జీఎంసీహెచ్‌కు వైద్య సహకార సంబంధాలున్నాయి. జీఎంసీహెచ్ వైద్యులు శిశువుకు శస్త్రచికిత్స విషయంపై బెంగళూరు ప్రఖ్యాత నారాయణ హృదయాలయ వైద్యులతో సంప్రదించారు. ఈ శిశువును ప్రభుత్వ ఖర్చులతో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి సర్జరీ చేయించాలని అసోం వైద్య శాఖ భావిస్తోంది.