
మెదడులో కవల సోదరి
హైదరాబాద్‌కు చెందిన యామినీ కరణం అనే యువతికి అమెరికాలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది.
* ఎముక, వెంట్రుకలు, దంతాల ముద్దగా కవల పిండం
* హైదరాబాద్ యువతి యామినీకి అరుదైన సమస్య
* గర్భంలో ఉండగా మెదడుకు అతుక్కున్న కవల పిండం
* శస్త్రచికిత్స చేసి తొలగించిన అమెరికా వైద్యులు
లాస్ ఏంజెలిస్: హైదరాబాద్‌కు చెందిన యామినీ కరణం అనే యువతికి అమెరికాలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఆమె మెదడులో ఎముకల ముద్దగా మారి పుట్టినప్పటి నుంచీ నరక యాతన పెడుతున్న కవల పిండాన్ని వైద్యులు విజయవంతంగా తొలగించారు. దిగ్భ్రాంతికరమైన ఈ ఉదంతం పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. అదనపు శరీర భాగాలతో వింత శిశువులు జన్మించడం, అప్పుడప్పుడూ అవిభక్త కవలలు పుట్టడం మనకు తెలుసు. కొన్నిసార్లు ఒక శిశువు నడుము దగ్గర సంపూర్ణంగా ఎదగని మరో కవల శిశువు అతుక్కొని ఉండటమూ తెలిసిందే.
అయితే, అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్న యామినీ కరణం(26)ది మరింత దిగ్భ్రాంతికరమైన కథ. తల్లిగర్భంలో పిండదశలో ఉన్నప్పుడు యామినీ తలకు తోటి కవల సోదరి పిండం అతుక్కుపోయింది. క్రమంగా కవల పిండానికి చెందిన ఎముక, వెంట్రుకలు, దంతాలు అన్నీ పెరిగాయి. చివరకు అవన్నీ కలిసి యామినీ మెదడులో ఓ చిన్న ముద్దలా మారిపోయాయి! మరోవైపు తల్లిగర్భంలో సంపూర్ణంగా ఎదిగిన యామినీ సాధారణంగానే జన్మించింది.
దీంతో ఆమె మెదడులో పిండం ఉన్నట్లు వైద్యులు కూడా గుర్తించలేకపోయారు. చిన్నప్పటి నుంచీ అప్పుడప్పుడూ తలనొప్పి, ఇతర సమస్యలతో బాధపడుతూ వస్తున్నా, యామినీ అసలు సమస్యను ఏ వైద్యుడూ కనిపెట్టలేకపోయారు. అయితే, యామినీకి గత సెప్టెంబర్‌లో తీవ్రమైన తలనొప్పి రావడంతో పాటు చదవడం, మాట్లాడటంలోనూ ఇబ్బంది ఏర్పడింది. ఒకదశలో తల నుంచి పాదాల దాకా శరీరం మొత్తం నొప్పి వ్యాపించింది. దీంతో ఆస్పత్రికి చేరిన ఆమెను వైద్యులు పరీక్షించారు. ఆమె మెదడులో పీనియల్ గ్రంధి వద్ద ఓ తిత్తి ఏర్పడిందని, అందువల్లే ఈ సమస్యలు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. చివరికి ఈ ఏడాది మార్చిలో ఆమెకు లాస్ ఏంజెలిస్‌లోని స్కల్‌బేస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రాయర్ షాహినియన్ అనే కీహోల్ సర్జరీ నిపుణుడు శస్త్రచికిత్స చేశారు. తల వెనక నుంచి రంధ్రం చేసి మెదడుకు దెబ్బ తగలకుండా తిత్తిని తీశారు. దానిని వె లికి తీసిన తర్వాతే అది తిత్తి కాదు పిండం అని తెలిసింది. ఒక పిండం ఎదగకుండా మరో పిండానికి అతుక్కుని అందులో కలిసిపోవడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని, దీనిని వైద్యపరిభాషలో ‘టెరటోమా’గా పిలుస్తారని షాహినియన్ వెల్లడించారు. యామినీ ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు.