మా ఆయన యాక్ థూ.. ఆ సైట్లు నిషేధించండి
తన భర్త పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లకు బాగా బానిస అయిపోయాడని, అది తమ వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోందని.. అందువల్ల వాటిని నిషేధించాలని కోరుతూ ఒక మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి అశ్లీల సైట్ల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేలా సుప్రీం ఆదేశించాలని ముంబైకి చెందిన ఆ మహిళ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అతడు బాగా చదువుకున్న వ్యక్తే అయినా, పెద్దవయసు వస్తున్నా ఇలా చేస్తున్నప్పుడు ఇక యువతరం ఇంకెంత పాడవుతుందోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో తన భర్త ఎక్కువసేపు ఆ సైట్లు చూస్తూనే కాలం గడిపేస్తున్నాడని, దానివల్ల అతడి బుర్ర పాడైపోయి తన వైవాహిక జీవితాన్ని కూడా నాశనం చేస్తోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
తనకు పెళ్లయ్యి 30 సంవత్సరాలు అవుతోందని, కానీ గత రెండేళ్ల నుంచే తన భర్త ఈ పోర్నోగ్రఫీ సైట్లకు అలవాటు పడ్డాడని ఆమె కోర్టుకు చెప్పారు. తన భర్త చేస్తున్న పనుల వల్ల తాను, తన పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని, దీనివల్ల తమ సంసారం కూడా ఇబ్బందుల్లోనే ఉందని అన్నారు. తాను సామాజిక కార్యకర్తను కావడంతో ఇలాంటి వాళ్లను చాలామందిని చూస్తున్నానని, అందువల్ల వీటి నిరోధానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లల పోర్నోగ్రఫీకి సంబంధించిన సైట్లన్నింటినీ బ్లాక్ చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రాన్ని గట్టిగా ఆదేశించింది. అలా నిషేధించడం కష్టమని చెప్పడానికి వీల్లేదని, అలా చెబితే తమ ఆశాలను ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది.