
కుక్క దూరమైందని మహిళ ఆత్మహత్యాయత్నం
ప్రాణంగా పెంచుకున్న కుక్కను భర్త అడవిలో విడిచిపెట్టడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన తమిళనాడులో సంచలనం కలిగించింది.
టీనగర్ (చెన్నై): ప్రాణంగా పెంచుకున్న కుక్కను భర్త అడవిలో విడిచిపెట్టడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన తమిళనాడులో సంచలనం కలిగించింది. నామక్కల్ జిల్లా పరమత్తివేలూరు సుల్తాన్‌పేటకు చెందిన పెరుమాళ్ కూరగాయల వ్యాపారి. ఇతని భార్య శాంతి (35). ఇంట్లో కుక్కను పెంచుతోంది. దీన్ని భర్త వ్యతిరేకించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో కుక్క, పిల్లలను కనింది. దీంతో విసిగిపోయిన పెరుమాళ్ ఒక గోనె సంచిలో పిల్లలతోపాటు తల్లి కుక్కను అడవిలో వదిలిపెట్టాడు. బయటికి వెళ్లిన శాంతి ఇంటికి రాగానే కుక్క లేకపోవడంతో భర్తను ప్రశ్నించింది. వాటిని అడవిలో వదిలినట్టు భర్త చెప్పడంతో ఆమె భర్తతో గొడవపడింది. భర్త బయటికి వెళ్లగానే శాంతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగువారు మంటలార్పి పరమత్తివేలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.