
ఎదురు చెప్పిందని వేటేశారు
మంత్రితో వాదించారని హరియాణా మహిళా ఐపీఎస్ బదిలీ
చండీగఢ్: హరియాణాలో ఓ మంత్రి మాటకు ఎదురు చెప్పిందన్న కారణంపై మహిళా ఐపీఎస్ అధికారిపై బదిలీ వేటు పడింది. ఫతేహబాద్ జిల్లా ఎస్పీ సంగీతా రాణి కాలియాతోపాటు మరో ఇద్దరు అధికారులను బదిలీ చేస్తున్నట్టు శనివారం ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం ప్రజా ఫిర్యాదులు, సమస్యల పరిష్కార కమిటీ సమావేశం జరిగింది. ఓ ఎన్జీవో, రతియా అనే ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ దృష్టికి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా మంత్రి, ఎస్పీ కాలియా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి చివరకు ఎస్పీని గెటౌట్ అనేవరకు వ్యవహారం వెళ్లింది. మంత్రి మాటకు ఎదురు చెప్పిందన్న కారణంపై కాలియాపై ప్రభుత్వం వేటు వేసింది. మనేసర్‌లోని రిజర్వ్ పోలీసు బెటాలియన్‌కు బదిలీ చేసింది.
మంత్రి అనిల్ విజ్ ఎస్పీని గద్దించిన సంఘటన వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో విపక్ష నేతలు, నెటిజన్లు మంత్రిపై మండిపడుతున్నారు. రెండు నెలల కిందట కూడా పై అధికారి మాట వినలేదని ఇలాగే ఓ మహిళా ఐపీఎస్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. అనిల్ విజ్‌కు నోటి దురుసు ఎక్కువని పేరుంది. మద్యం మాఫియా, డ్రగ్ మాఫియా కార్యకలాపాలపై ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదు చేస్తే మంత్రికి ఎందుకు ఫిర్యాదు చేశారంటూ కాలియా ఎన్జీవో ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారని అనిల్ విజ్ మీడియాతో అన్నారు. మీడియా ముందే ఆ ఎస్పీ ప్రభుత్వాన్ని విమర్శించారని, ప్రభుత్వమే అక్రమ మద్యాన్ని విక్రయిస్తోందంటూ ఆరోపణలు చేశారని తెలిపారు. దీనిపై సీఎం ఖట్టర్ మాట్లాడుతూ.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మంత్రి ప్రవర్తనను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పి.ఎల్.పునియా తప్పుపట్టారు. ఆయనను మంత్రి పదవినుంచి తప్పించాలన్నారు.