
అసహనాన్ని ఎంతమాత్రం అంగీకరించను: మోదీ
లండన్: భారత్‌లో ఏ మూల అసహనపు ఘటనలు చోటుచేసుకున్నా.. వాటిని ప్రభుత్వం ఎంతమాత్రం అంగీకరించబోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి స్వేచ్ఛను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్న మోదీ గురువారం ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరున్‌తో సమావేశమై.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై చర్చించారు. అనంతరం మోదీ, కామెరున్ సంయుక్త విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ శక్తివంతమయ్యేందుకు బ్రిటన్ సహకారం అందించేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. భారత్-బ్రిటన్ సంబంధాలు రోజురోజుకు బలపడుతున్నాయన్నారు. అభివృద్ధి బాటలో కలిసి నడువాలన్నది భారత్-బ్రిటన్ లక్ష్యమని పేర్కొన్నారు. రక్షణరంగంలో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. వచ్చేరోజుల్లో ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత విస్తృతం అవుతాయని తెలిపారు. భారత్‌లో బ్రిటన్ మూడో అతిపెద్ద పెట్టుబడిదారు అని, రానున్న రోజుల్లో బ్రిటన్ పెట్టుబడులు మరింత పెరుగనున్నాయని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్-బ్రిటన్ కలిసి పోరాడుతాయని చెప్పారు. బ్రిటన్‌లో పర్యటించకుండా తనను ఎప్పుడూ అడ్డుకోలేదని, 2003లో కూడా తనకు ఘనస్వాగతం లభించిందని మోదీ గుర్తు చేశారు.