ప్రపంచబ్యాంకు ర్యాంకులపై విస్మయం | World Bank rankings On Shocked | Sakshi
Sakshi News home page

ప్రపంచబ్యాంకు ర్యాంకులపై విస్మయం

Published Wed, Sep 16 2015 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

World Bank rankings On Shocked

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు తాజాగా ఇచ్చిన ర్యాంకులపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామంటూ, తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పలు దేశాల్లో చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బృందం ఒకవైపు చైనాలో పర్యటిస్తున్న తరుణంలో వెలువడ్డ ఈ ర్యాంకులు సర్వత్రా చర్చనీయంగా మారాయి. పెట్టుబడులకు దేశంలోనే అత్యంత అనువైన ప్రాంతంగా తెలంగాణలో పుష్కలమైన అవకాశాలున్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా దేశంలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు ప్రపంచ బ్యాంకు 13వ ర్యాంకు ఇవ్వడం తెలిసిందే.

దీనికితోడు ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంకు లభించడంతో ప్రభుత్వ వర్గాలు ఇరుకునపడ్డాయి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనువైన వాతావరణముండటమేగాక పారిశ్రామికాభివృద్ధికి పుష్కలమైన వనరులున్నాయని ప్రభుత్వం ధీమాతో ఉంది. అలాంటిది ఏపీ కంటే చాలా తక్కువ ర్యాంకు దక్కడంతో ప్రభుత్వ వర్గాలు విస్తుపోయాయి. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకులపై సామాన్య ప్రజలు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారని ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు అన్నారు.

‘‘ఏ ప్రాతిపదికన ఈ ర్యాంకులిచ్చారో కూడా తెలియదు. ఈ ర్యాంకులను మేం పట్టించుకోం. మా పని మేం చేసుకుంటూ పోతాం. మా పనితీరే మా ర్యాంకింగ్‌ను నిర్ణయిస్తుంది’’ అని మంగళవారం ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రపంచబ్యాంకు ర్యాంకులకు మాటలతో బదులివ్వాల్సిన పని లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ‘‘మా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలు, వాటి ద్వారా జరిగే అభివృద్ధే సరైన సమాధానం చెబుతుందని ఆయన అన్నారు.

‘‘ప్రపంచ బ్యాంకు ర్యాంకులకు ఏయే ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుందో అర్థం కావడం లేదు. గుజరాత్ తర్వాత దేశంలో వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం తెలంగాణే. అభివృద్ధి చెందిన నగరాల్లో దేశంలో ముంబై తర్వాత హైదరాబాదే ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు అనుకూలంగా ఉండేందుకు కల్పిం చిన మౌలిక సదుపాయాలన్నీ ప్రజలకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement