నోట్ల రద్దు: కొత్త పంథాలో వెంకన్న
నోట్ల రద్దు: కొత్త పంథాలో వెంకన్న
Published Fri, Dec 2 2016 4:31 PM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM
నల్లకుబేరులకు షాకిస్తూ పెద్దనోట్ల రద్దుచేసిన మోదీ దెబ్బకు దేవుళ్లందరూ అప్గ్రేడ్ అవుతున్నారు. భారత్లోని రిచెస్ట్ ఆలయాలన్నీ నగదు రహిత సిస్టమ్లోకి మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవస్థానంగా పేరుగాంచిన, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా దేవాలయానికి అవసరమైన టెక్నికల్ సపోర్టును టీసీఎస్ అందించనుంది. ఆలయానికి విచ్చేసే సందర్శకులకు అవసరమైన అన్ని రకాల ఈ-సేవలను టీసీఎస్ ద్వారా టీటీడీ అందించనుంది.
టీసీఎస్ సపోర్టుతో ఈ-డొనేషన్లు, ఈ-హుండీ, ఈ-పబ్లికేషన్స్, ఈ-చలాన్, ఈ-దర్శన్, ఈ-వసతి, ఈ-సేవ వంటి సేవలను యాత్రికులను అందిస్తామని ఆలయ అధికారప్రతినిధి చెప్పారు. అంతేకాక కొన్ని సంప్రదాయా సేవల కోసం తర్వాతి తరం టెక్నాలజీతో అప్లికేషన్లు అభివృద్ధి చేయడంలో టీటీడీ మేనేజ్మెంట్ నిమగ్నమై ఉన్నట్టు బోర్డు తెలిపింది. దేవస్థానంలో పారదర్శకత, రోజువారీ కార్యకలాపాలు సులభతరం చేయడానికి ఈ ఒప్పందం సహకరిస్తుందని వెల్లడించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో ఓ భాగంగా ఉన్న టీసీఎస్ సైతం ప్రస్తుతం టీటీడీతో కలిసి పనిచేస్తున్నట్టు పేర్కొంది. యాత్రికులకు మెరుగైన సేవలందించడానికి, కొత్త ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా స్వామి సేవ, దర్శన్, డొనార్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆలయ నిర్వహణ సిస్టమ్ను తాము అందిస్తామని టీసీఎస్ అధికార ప్రతినిధి కూడా చెప్పారు.
నల్లకుబేరులకు షాకిస్తూ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించడంతో, వాటిని ఏం చేసుకోవాలో తెలియక చాలామంది పాతనోట్లను దేవుళ్ల హుండీళ్లో కానుకలుగా సమర్పిస్తున్నారు. దీంతో భారత్లోని ప్రముఖ ఆలయాలన్నీ కాసులతో కళకళలాడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన టెంపుల్గా పేరున్న ఈ ఆలయానికి ఏడాదికి రూ.1,100 కోట్ల డొనేషన్లు వస్తుంటాయి. రోజుకు రూ.3 కోట్ల మేర డొనేషన్లతో హుండీ నిండిపోతుంది. కానీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం హుండీ కలెక్షన్ భారీగా పెరిగింది. గత వారం రోజుకు రూ.4.2 కోట్ల హుండీ కానుకలు నమోదయ్యాయి. ఈ నగదంతా లెక్కలో చూపినదో, లెక్కలో చూపనిదో కనుగొనడం కష్టమని ఆలయ నిర్వహకులు చెప్పారు. దీంతో హోండీలో సమర్పించే డొనేషన్లలో కూడా పారదర్శకత కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాలన్నీ నగదు రహిత సేవలను అందించాలని పన్ను అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement