భక్తులకు వెసులుబాటు కల్పించామన్న టీటీడీ ఈవో సాంబశివరావు
తిరుపతి అర్బన్: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తిరుపతి, తిరుమలలో నిర్వహించే నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 31వ తేదీ వరకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. దీనిపై సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో బ్యాంక్ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో శ్రీవారి భక్తులకు ఎలాంటి అదనపు చార్జీలు విధించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రధానంగా తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్, శ్రీవారి డాలర్లు, లడ్డూ ప్రసాదాలు కొనుగోళ్లకు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు జరపాలని భక్తులకు సూచించారు.
అలాగే టీటీడీ ప్రచురణలు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల వద్ద కూడా అదనపు చార్జీలు వసూలు చేయవద్దని బ్యాంకర్లను కోరారు. టీటీడీ పరకామణి ద్వారా బ్యాంక్‌లకు చేరుతున్న చిల్లర నాణేలు, చిన్న నోట్లను భక్తులకు చిల్లర ఇచ్చేందుకు అందుబాటులో ఉంచాలని కోరారు. టీటీడీ నిర్వహిస్తున్న ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించే భక్తులకు , ఈ - డొనేషన్ ద్వారా టీటీడీ ట్రస్టులకు విరాళాలు ఇచ్చేవారికి సర్వీసు చార్జీలు టీటీడీ భరిస్తుందని స్పష్టం చేశారు.
31 వరకు అదనపు చార్జీలు ఉండవు
Published Tue, Dec 6 2016 2:13 AM | Last Updated on Sat, Aug 25 2018 7:22 PM
Advertisement
Advertisement