సమస్యలపై ఎవరు నోరు విప్పినా వారి గొంతు నొక్కేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నై : సమస్యలపై ఎవరు నోరు విప్పినా వారి గొంతు నొక్కేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రౌడీల్లా తయారవుతున్నారని మండిపడ్డారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరచాలని కోరుతూ చెన్నైలోని దక్షిణ రైల్వే జీఎం అశోక్ కే అగర్వాల్, రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఎస్ అనంతరామన్‌లతో.. తిరుపతి ఎంపీ వరప్రసాద్‌తో కలిసి రోజా సోమవారం భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అందరితో కలసి చర్చించి, అభిప్రాయాల సేకరణతో రాజధానిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల కడుపు కొట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ నోరు మెదపలేని పరిస్థితి ఉందన్నారు. బలమైన పార్టీగా, ప్రతిపక్ష నేతగా ఉన్న తమ నేత జగన్ మోహన్ రెడ్డిని, పార్టీ వర్గాల్ని అణగదొక్కేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, శాంతి భద్రతల సమస్యలను సృష్టించడమే కాకుండా అధికార పక్షం ఎమ్మెల్యేలు, మంత్రులు రౌడీల్లా తయారవుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు.