యడ్యూరప్ప.. ఇవెక్కడి ఇడ్లీలప్పా!
బెంగళూరు: కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప తాజాగా ఇడ్లీల వల్ల చిక్కుల్లో పడ్డారు. ఇటీవల తుముకూరు జిల్లాలోని ఓ దళితుడి ఇంట్లో ఆయన బస చేసిన సందర్భంగా హోటల్ నుంచి తెప్పించుకున్న ఇడ్లీలు తిన్నారని వెలుగుచూడటం దుమారం రేపుతోంది. మాజీ సీఎం అయిన యెడ్డీ ఇంకా అంటరానితనాన్ని పాటిస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని మాండ్యా జిల్లాకు చెందిన డీ వెంకటేశ్ పోలీసులను ఆశ్రయించారు.
దళితులను ఆకట్టుకునేందుకు ఇటీవల యడ్యూరప్ప, బీజేపీ సీనియర్ నాయకుడైన కేఎస్ ఈశ్వరప్ప తదితరులు దళితుల ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. అయితే, ఈ సందర్భంగా యడ్యూరప్ప తిన్న ఇడ్లీలలను సమీపంలోని ఓ రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్నవని తర్వాత తేలడం వివాదం రేపింది. ఈ వివాదంలో యడ్యూరప్పను బీజేపీ నేతలు వెనకేసుకొస్తున్నారు. దళితుల అభివృద్ధి కోసం బీజేపీ ఎంతగానో పాటుపడుతున్నదని, ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ కర్ణాటక మీడియా ఇన్‌చార్జి దగ్గే శివప్రకాశ్ మాట్లాడుతూ అవి హోటల్ నుంచి తెప్పించిన ఇడ్లీలేనని అంగీకరించారు. అయితే, యెడ్డీకి ఇడ్లీ, వడ అంటే ఇష్టమని, అందుకే వాటిని తిన్నారని, అంతేకాకుండా దళితుల ఇంట్లో వండిన పులావు కూడా ఆయన రుచి చూశారని ఆయన చెప్పారు. అయితే, దళితుల ఇంట్లో యెడ్డీ భోజనం చేయడం ఒక రాజకీయ జిమ్మిక్కని, దళితుల ఓట్ల కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేయకూడదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.