
పట్టపగలే హత్యలు.. సీఎం సీరియస్
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పట్టపగలే కొందరు సాయుధ దుండగులు ఒక నగల దుకాణంలోకి దూసుకెళ్లి అక్కడి వ్యాపారులను కాల్చి చంపారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన వెంటనే రాష్ట్ర డీజీపీని ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే ఈ కేసులో ఇంతవరకు ఎందుకు అరెస్టులు జరగలేదో చూడాలన్నారు. యూపీ అసెంబ్లీలో కూడా ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాష్ట్ర మంత్రి, మథుర ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని పూర్తిగా అదుపులోపకి తెస్తామని, రాష్ట్రంలో నేరగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ అన్నది లభించదని ముఖ్యమంత్రి సభలో అన్నారు.
ముఖాలకు ముసుగులు, హెల్మెట్లు ధరించిన వ్యక్తులు నగలదుకాణంలోకి ప్రవేశించి, ముందుగా సిబ్బందితో గొడవపడ్డారు. షాపులోకి వాళ్లు రాకుండా అడ్డుకోవడంతో సిబ్బందిలో ముగ్గురిని కాల్చి... వాళ్ల మీదుగా లోపలకు ప్రవేశించారు. ఆ సిబ్బందిలో ఇద్దరు మరణించారు. మొత్తం ఆరుగురు సాయుధులు బైకుల మీద దోపిడీకి వచ్చారని, దాదాపు రూ. 4కోట్ల విలువైన బంగారంతో పారిపోయారని పోలీసులు చెప్పారు. జిల్లా సరిహద్దులన్నింటినీ మూసేసి దొంగల కోసం గాలింపు మొదలుపెట్టారు.