రుణాలపై యువతకు మార్గనిర్దేశం చేయాలి... | youth should be given good guidance upon loans | Sakshi
Sakshi News home page

రుణాలపై యువతకు మార్గనిర్దేశం చేయాలి...

Published Wed, Mar 4 2015 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

రుణాలపై యువతకు మార్గనిర్దేశం చేయాలి...

రుణాలపై యువతకు మార్గనిర్దేశం చేయాలి...

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ

ముంబై: రుణాల చెల్లింపుల విషయంలో మంచి ధోరణులను అవలంభించేలా యువతకు తగిన మార్గనిర్ధేశం(కౌన్సిలింగ్) చేయాల్సిన అవసరం ఉందని  రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ పేర్కొన్నారు. బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ(సీఐసీ)లు దీనికి నడుంబిగించాలన్నారు. మంగళవారమిక్కడ సిబిల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో విద్యా రుణాల విభాగంలో మొండిబకాయిలు భారీగా పెరుగుతుండటాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాధాన్య రంగ రుణాల విభాగంలో రూ.4 లక్షల లోపు విద్యా రుణాల్లో మొండి బకాయిలు గతేడాది మార్చి నాటికి 7.54 శాతానికి ఎగబాకాయన్నారు. సగటు ఎన్‌పీఏలు 4 శాతంతో పోలిస్తే ఈ పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
 
పీఎస్‌బీలు సొంతంగా నిధులను సమీకరించుకోవాలి
 ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లు ప్రభుత్వ మూలధన నిధులపైనే ఆధారపడకుండా రానున్న రోజుల్లో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సొంతంగా నిధులను సమీకరించడంపై దృష్టిపెట్టాలని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ పేర్కొన్నారు. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘భవిష్యత్తులో బ్యాంకులకు మరింత మూలధనం అవసరమవుతుంది. ఈ నిధుల కోసం ఇతర మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వంపైనే ఆధారపడటం సరికాదు’ అని గాంధీ అభిప్రాయపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement