ఆక్వాపార్కుకు కొమ్ముకాస్తున్న సర్కారు
‘మొగల్తూరు’ సంఘటనపై ప్రభుత్వాన్ని ఎండగట్టిన జగన్
సాక్షి, అమరావతి: అయిదుగురు యువకులను పొట్టన పెట్టుకున్న మొగల్తూరు ఆనంద ఆక్వాపార్కు వ్యవహారం లో ప్రభుత్వ పక్షపాత వైఖరి, అసత్యాలు బట్టబయలయ్యాయని విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. కర్మాగారం నిర్లక్ష్యమే అయిదుగురి మరణానికి కారణమని తెలిసినా... అంతకు పదిరెట్లు కాలుష్య కారక కర్మాగారం ఏర్పాటుకు ఇదే యాజమాన్యానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ సర్కారును నిలదీశారు. మొగల్తూరు ఆక్వా ప్లాంటు ప్రమాద సంఘటన శుక్రవారం అసెంబ్లీని కుదిపేసింది.
ఈ అంశంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో స్పీకరుకు వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ఆరంభం కాగానే ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు స్పీకరు పోడియంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులు చేసిన నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. మూడుసార్లు వాయిదా అనంతరం ప్రమాద సంఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే...
మంత్రి చెప్పినవి అబద్ధాలే కదా!
ఆనంద ఆక్వా ప్లాంటులో ట్రీట్‌మెంట్ ప్లాంటు ఉందని మంత్రి చెప్పారు. మరి ట్రీట్‌మెంటు ప్లాంటు ఉంటే ఇన్ని రోజులు వ్యర్థాలను ఎందుకు నిల్వ చేశారు? ట్రీట్‌మెంటు ప్లాంటు ఉండి నిజంగా దీనిని ఉపయోగించే ఆలోచన ఉంటే గొంతేరు కాలువకు పైప్‌లైన్ ఎందుకు వేశారు? గొం తేరు కాలువకు ఉన్న పైప్‌లైన్ తీసేయాలనే కదా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చెప్పింది. 2014లో పరిశ్రమ పెడితే 2016లో గొంతేరు కాలువకు ఉన్న పైప్‌లైన్ తొలగిం చాలని పీసీబీ ఆదేశించింది. మరి ఆ రెండేళ్లు వ్యర్థాలు గొంతేరులోకి పంపినట్లే కదా? మంత్రి ప్రకటనలోని ఆరో పేరాలో చెప్పిన కథే ఇది. ఎఫ్లుయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటులో కలెక్షన్ ట్యాంకు, ఏరేషన్ ట్యాంక్, క్లారిఫయర్, స్లడ్జ్‌డ్రయింగ్ బెడ్స్, బఫర్ ట్యాంక్ ఉంటాయని, వీటిలో శుద్ధి చేసిన నీటిని పరిశ్రమ పొరుగునే ఉన్న యాజమాన్యం వారి భూముల్లో మొక్కల పెంపకానికి సేద్యపు నీరుగా వినియోగిస్తున్నారని మంత్రి చెప్పింది అబద్ధమే కదా?
పదిరెట్లు కాలుష్యం వెదజల్లే పరిశ్రమకు ఎలా అనుమతించారు?
ఇక్కడ ఆనంద ఆక్వా పార్కు ప్రమాణాలు పాటించలేదని మంత్రి ప్రకటనలోనే తేటతెల్లమైంది. మరి ఇదే యాజమాన్యానికి తుందుర్రులో గోదావరిలో కలుషిత నీరు కలిసేలా పది రెట్లు కాలుష్యం వెదజల్లే ఆక్వా పరిశ్రమకు ఎలా అనుమతి ఇస్తారు..? ప్రజలు గోదావరి ఆక్వా పార్కు అనుమతించవద్దని ఓవైపు ఆందోళన సాగిస్తుంటే ఉద్యమం చేపట్టిన 37 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని ఏమంటారు? ప్రయివేటు పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటూ ప్రజలను వేధిస్తారా? గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకసార్లు జీరో పొల్యూషన్ పరిశ్రమలు అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు ప్లేటుమార్చి ఆనంద ఆక్వా పరిశ్రమ ఆరెంజి కేటగిరీలో ఉందని అంటున్నారు. పీసీబీ ప్రమాణాల ప్రకారం కాలుష్య స్థాయిని బట్టి రెడ్, ఆరెంజి, గ్రీన్, వైట్ అనే నాలుగు రకాలుంటాయి. ఈ పరిశ్రమవల్ల నీరు కలుషితమవుతోందనేది వాస్తవమని ఆరెంజి అని పేర్కొనడాన్ని బట్టే తేటతెల్లమవుతోంది. పొల్యూషన్ విషయంలో జీరో నుంచి ఆరెంజికి వచ్చింది. అంటే మీ (ప్రభుత్వ) స్టాండులో మార్పు కనిపిస్తోంది.
యాజమాన్య నిర్లక్ష్యం మాటేది?
మంత్రి రెండు పేజీల ప్రకటనలో ఇన్ని తప్పులున్నాయేగానీ, అయిదుగురు మృతి చెందిన సంఘటన వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. నాకు, యాజమాన్యానికి విరోధం లేదు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం. మంత్రిని ముందుగా ఇంగ్లిష్ సరిచేసుకోమనండి. (ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు లేచి వ్యక్తిగత విమర్శలు చేయడంతో) నన్ను తిట్టడానికి గొప్ప స్పీచ్ ఇచ్చారు. మంత్రి కాబట్టి అలా మాట్లాడితే పరువుపోతుందని, తప్పు సవరించుకోవాలని చెప్పాం. అయిదుగురి మరణానికి దారితీసిన కారణాలేమిటి తెలుసుకోవాలనిగానీ, భవిష్యత్తులో ఇలా జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలనిగానీ ప్రభుత్వానికి ఉంటే మెజిస్టీరియల్ విచారణ జరపాలని నిర్ణయిస్తుందా? అయిదుగురు మరణానికి దారితీసిన సంఘటనను ఆర్డీవో స్థాయి మెజిస్టీరియల్ విచారణతో సరిపెడతారా?
పరిశ్రమలు రాకూడదని ఎవరికీ ఉండదు
రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదని ఎవరికీ ఉండదు. పరిశ్రమలు తప్పనిసరిగా రావాల్సిందే. అయితే వాటిని పెట్టాల్సిన చోట పెట్టాలి. కాలుష్య కారక పరిశ్రమలను సముద్రతీరంలో ఏర్పాటుచేస్తే అందరూ ఆహ్వానిస్తారు. గొంతేరు కాలువ పరిసరాల్లో పది వేల మంది నివాసం ఉంటున్నారు. ఆనంద ఆక్వాలో క్లీనింగ్ చేయడానికి వెళ్లిన అయిదుగురు కూ..కా.. అనే మాట కూడా లేకుండా చనిపోయారు. అలాంటి చోట్ల ప్రస్తుత పరిశ్రమ కంటే పదిరెట్లు కాలుష్య కారక పరిశ్రమ పెడితే ఇలాంటి ప్రమాదం జరిగితే ఎన్ని వేల మంది చనిపోతారు?
పైప్‌లైన్ వేసేదెవరు?
చంద్రబాబు జీరో పొల్యూషన్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. నేను ఆర్‌ఓసీ డేటా చూశాను. ఇది ప్రయివే టు కర్మాగారం. దీని నుంచి వచ్చే వ్యర్థపదార్థాలు సము ద్రంలో కలపాలంటే 30 కిలోమీటర్లు పైపు లైన్ వేయాలి. మరి ఈ పైప్‌లైన్ ఏర్పాటుకు ఖర్చును ఎవరు భరిస్తారు? ఒక వేళ ప్రభుత్వమే భరించేట్లయితే ఈ కర్మాగారంపై సర్కారుకు ఎందుకంత శ్రద్ధ? ఒకవేళ కర్మాగారం వారే పైపులైన్ వేస్తారంటే 30 కిలోమీటర్లకు రూ. 40 కోట్లు ఖర్చవుతుంది. ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయ ప్రొఫె సర్ల బృందం అక్కడికి వెళ్లి పరిశీలించింది. తుందుర్రు, బేతపూడి గ్రామాలు సముద్ర మట్టానికన్నా తక్కువ ఎత్తు లో ఉన్నాయని తేల్చింది.
ఈ పరిశ్రమకు రెండు వైపులా పొలాలున్నాయి. మరో రెండు వైపుల ఊర్లు, కాలువలు ఉన్నాయి. మరి ఇలాంటి చోట్ల విష వాయువులు, ప్రమాదకర గ్యాస్ పైప్‌లైన్లకు నిజంగా ఎవరైనా భూములు ఎందుకు ఇస్తారు? రూ.122కోట్ల ఫ్యాక్టరీ ఈ పైపులెన్ వేయడానికి రూ.40 కోట్లు ఖర్చవుతుంది. ఇంత ఖర్చుపెట్టి పైపులైను నిర్మించడం కంటే యాజమాన్యం కర్మాగారాన్నే సముద్ర తీరానికి మార్చుకోవచ్చు కదా.
నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా?
‘‘నా చదువుకు సంబంధించి (ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం లీక్ చేయమని కోరినట్లు) చేసిన అభియోగం నిరూపించలేకపోతే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారా? చెప్పమనండి. చంద్రబాబు నాయుడికి నేను సవాల్ విసురుతున్నా. ఈ అంశంలో నాకూ చంద్రబాబు నాయుడికి సవాల్. మీరే అధికారంలో ఉన్నారు. నీకు ఇష్టమొచ్చినట్లు విచారణ జరిపించుకోండి. దమ్ముంటే రుజువు చేయండి’’ అని జగన్ చాలెంజ్ చేశారు.
ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు తెలుసు
అసెంబ్లీలో శుక్రవారం ప్రతిపక్ష నేత స్థాయి గురించి అచ్చెన్నాయుడు అవాకులు చెవాకులు పేలడంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘ఎవరి స్థాయి ఏమిటో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరేమిటో ప్రజలకు బాగా తెలుసు. నేను మొదటిసారి ఎమ్మెల్యేని కాదు. రెండుసార్లు ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లాను. 5.45 లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచిన రికార్డు నాది. తల కిందపెట్టి కాళ్లు పైకెత్తినా చంద్రబాబుకు ఈ రికార్డు రాదు’’ అని నొక్కి చెప్పారు. (భూమా నాగిరెడ్డి మరణించినప్పుడు... అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించగా...) ‘‘ఎవరి మానవత్వం ఏమిటో ప్రజలకు తెలుసు.
బస్సు ప్రమాదంలో పది మంది చనిపోతే కనీసం పరామర్శించడానికి మనసు రాదు. మీ పార్టీకి 30 ఏళ్లు ఊడిగం చేసిన శోభమ్మ (శోభా నాగిరెడ్డి) చనిపోతే ఒక్కరైనా వచ్చారా? ఆ రోజు మీరంతా ఎక్కడున్నారు. ఏ విషయమైనా రాజకీయమేనా? గోదావరి ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు 37 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టిస్తారా? ప్రయివేటు పరిశ్రమకు సపోర్టు చేస్తూ ప్రభుత్వం ప్రజలను వేధించడమేనా మీ మానవత్వం?’’ అని సీఎం చంద్రబాబును, మంత్రులను నిలదీశారు.