పంజాబ్ సీఎం బాదల్తో జగన్ భేటీ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడగడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్తో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న వైనాన్ని తెలియచేశారు. ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి విభజనలు పునరావృతం కాకుండా ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో జగన్తో పాటు పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్వీందర్ బాదల్, వైఎస్ఆర్ సీపీ బృందంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరారెడ్డి, బాలశౌరి పాల్గొన్నారు. బాదల్తో భేటీ అనంతరం జగన్ పార్లమెంట్ సమావేశాలకు హాజరు అవుతారు. కాగా ఈరోజు సాయంత్రం బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ను పాట్నాలో కలవటానికి జగన్ మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి పాట్నా వెళ్లనున్నారు.