
ఢిల్లీ చేరుకున్న జగన్, మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు.
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించాలన్న నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఈరోజు మరోసారి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరనున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి.. రాష్ట్ర విభజన నిర్ణయం, తాజా పరిణామాలపై ఆయనకు సవివరమైన నివేదిక అందజేసి, విభజన జరక్కుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే.. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు జనతాదళ్ (యూ) అధినేత శరద్‌యాదవ్‌ను కూడా కలిసి.. ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా వివరించనున్నారు. ఆ తర్వాత 24వ తేదీ ఆదివారం రోజున జగన్ భువనేశ్వర్ వెళ్లి ఉదయం 11.30 గంటలకు బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసుకుంటారు.