కోర్టుకు హాజరైన జగన్, సబిత | Ys Jagan mohan reddy, Sabitha indra reddy appears in CBI court | Sakshi

కోర్టుకు హాజరైన జగన్, సబిత

Published Thu, Nov 14 2013 12:24 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

తన కంపెనీల్లో ఇందూ ప్రాజెక్టు పెట్టుబడులకు సంబంధించిన కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సీబీఐ ప్రధాన కోర్టుల ఇన్‌చార్జి న్యాయమూర్తి, మూడో అదనపు ప్రత్యేక జడ్జి రమణనాయుడు ముందు హాజరయ్యారు.

సాయిరెడ్డి, నిమ్మగడ్డ, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఐఏఎస్‌లు కూడా..
 ‘ఇందూ ప్రాజెక్టు’ కేసు విచారణ డిసెంబర్ 3కు వాయిదా

 
 సాక్షి, హైదరాబాద్:  తన కంపెనీల్లో ఇందూ ప్రాజెక్టు పెట్టుబడులకు సంబంధించిన కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సీబీఐ ప్రధాన కోర్టుల ఇన్‌చార్జి న్యాయమూర్తి, మూడో అదనపు ప్రత్యేక జడ్జి రమణనాయుడు ముందు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఇందూ గ్రూపు సంస్థల చైర్మన్ ఐ.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్‌లు కె.రత్నప్రభ, బీపీ ఆచార్య, ఏపీఐఐసీ మాజీ సీఈ దామెర పార్థసారధి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఇందూ సంస్థల ఆడిటర్ సీవీ కోటేశ్వరరావులు కూడా కోర్టు ఎదుట హాజరయ్యారు.
 
  కోర్టు నిర్దేశించిన మేరకు వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను జగన్, సాయిరెడ్డిల తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి.. శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆయనకు చెందిన కంపెనీలు ఇందూ టెక్‌జోన్, ఎస్‌పీఆర్, భూమి రియల్ ఎస్టేట్‌ల తరఫు న్యాయవాది ఎంజే శివరామకృష్ణ సమర్పించారు. సబిత, నిమ్మగడ్డ, ఆయన కంపెనీ జీ-2 కార్పొరేట్ సర్వీస్‌ల తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు, బీపీ ఆచార్య తరఫు న్యాయవాది సురేందర్‌రావు, రత్నప్రభ తరఫు న్యాయవాది వీర్రాజు, పార్థసారధి తరఫు న్యాయవాది కిరణ్‌కుమార్, కోటేశ్వరరావు తరఫు న్యాయవాది నళినీ కుమార్‌లు పూచీకత్తు బాండ్లు సమర్పించారు. వాటిని ఆమోదించిన న్యాయమూర్తి తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. కాగా, లేపాక్షి సంస్థపై దాఖలైన చార్జిషీట్‌కు సంబంధించి జగన్, మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ఇతర నిందితులు ఈ నెల 15న కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.
 
 అయితే మొహర్రం సందర్భంగా 15న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో 14న హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ తరఫు న్యాయవాది నివేదించారు. ఈనెల 16 నుంచి ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల నేతలను కలవాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి... ఈ కేసును విచారిస్తున్న రెండో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి దృష్టికి గురువారం ఈ విషయాన్ని తీసుకెళ్లాలని సూచించారు.
 
 జగన్‌ను చూసి కన్నీరు పెట్టిన మహిళ
 కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళ్తున్న జగన్‌ను చూసిన ఓ మహిళ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టింది. ఇది గమనించిన జగన్ ఆ మహిళను ఆప్యాయంగా పలకరించి ఓదార్చారు. జై జగన్ అంటూ కొందరు మహిళలు నినాదాలు చేయడంతో వారి దగ్గరకు కూడా వెళ్లి పలకరించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి సామాన్యులెవరినీ న్యాయస్థానం ఉన్న గగన్‌విహార్ భవన సముదాయంలోకి అనుమతించలేదు. అయినప్పటికీ అతికష్టంగా భవన ప్రవేశమార్గం వద్దకు చేరుకున్న కొందరు ప్రజలు జగన్‌ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అందరికీ అభివాదం చేసిన జగన్ అక్కడి నుంచి నిష్ర్కమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement