హోదా.. సంజీవనే | ys jagan mohan reddy speech in yuva bheri | Sakshi
Sakshi News home page

హోదా.. సంజీవనే

Published Wed, Sep 23 2015 2:35 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

మంగళవారం విశాఖ పోర్టు కళావాణి స్టేడియం ఆవరణలో స్క్రీన్ పై యువభేరిలో జగన్ ప్రసంగాన్ని తిలకిస్తున్న వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరె - Sakshi

మంగళవారం విశాఖ పోర్టు కళావాణి స్టేడియం ఆవరణలో స్క్రీన్ పై యువభేరిలో జగన్ ప్రసంగాన్ని తిలకిస్తున్న వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరె

* హోదా వస్తే నంబర్-1  
* విశాఖ యువభేరిలో వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా... విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలన్నా ప్రత్యేక హోదా సాధించి తీరాలని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి... విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, యువతపాలిట ప్రత్యేక హోదా సంజీవనిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ‘‘ప్రత్యేక హోదా మన హక్కు... అది ఎవరో వేసే భిక్షం కాదు.

హోదా వస్తే రాష్ట్రం ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పనిలేదు, దేశంలోనే నెంబర్ 1గా నిలుస్తాం. అందుకే అందరం సమష్టిగా పోరాడి ప్రత్యేక హోదా సాధిద్దాం’’అని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు భయపడి ప్రత్యేక హోదాను ఫణంగా పెడుతున్నారని... విద్యార్థులు, యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులు విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన యువభేరి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు.

‘నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విద్య, ఉపాధి అవకాశాలు - రాష్ట్ర భవిష్యత్తు’ అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ముందుగా ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ పీవీజీడీ ప్రసాదరెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. ప్రొఫెసర్లు జేమ్స్ స్టీఫెన్, చందూలాల్, అబ్బులు, శ్రీనివాసరావు, మన్మథరావు, రీసెర్చ్‌స్కాలర్ మోహన్‌బాబు, విద్యార్థి నేతలు తదితరులు ప్రసంగించారు. అనంతరం మాట్లాడిన వై.ఎస్.జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే ...
 
హోదాపై మోసం చేసిన బీజేపీ, టీడీపీ...
ప్రత్యేకహోదాకోసం మేం చేసిన ధర్నాల వల్ల దానిగురించి అందరికీ కాస్తో కూస్తో అవగాహన వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులకు ఇప్పటికీ ప్రత్యేకహోదా అంటే ఏమిటో తెలియని దౌర్భాగ్యపరిస్థితి. ఇక ముఖ్యమంత్రికి ప్రత్యేకహోదా అంటే ఏంటో తెలిసినా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకహోదా ఏ పరిస్థితుల్లో ఇచ్చారన్నది ఒక్కసారి మనం పరిశీలిస్తే.... 2014 మార్చిలో మన అభీష్టానికి వ్యతిరేకంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు.

ఐటీ రంగంలో 95శాతం ఉద్యోగాలు, ఉత్పత్తి రంగంలో 70శాతం పరిశ్రమలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అటువంటి హైదరాబాద్ నగరం పక్కకు వెళ్లిపోతే మన ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మనకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామని బీజేపీ, తెస్తామని చంద్రబాబు ఎన్నికల్లో ప్రతి చోటా మాట్లాడారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగమంటూ ఊరూరా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారు. బాబు ఇచ్చిన డబ్బు వడ్డీలకు సరిపోక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రెండు రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి.
 
విద్యార్థులకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు
చంద్రబాబు ఏ రోజూ విద్యార్థుల గురించి, వారికి ఉద్యోగాల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఆయన 2002-03లో ‘ప్రైవేటైజేషన్ ఆఫ్ సక్సెస్ స్టోరీ ఇన్‌ఆంధ్ర ప్రదేశ్’ అని పుస్తకం వేశారు. దాదాపు 42 ప్రభుత్వ సంస్థలను మూసేశామని అందులో గొప్పగా చెప్పుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే రూ.రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ఘనంగా చెప్పారు.

రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లున్నాయి, 1,48,822 ఉద్యోగాలు ఉన్నాయని విభజన సమయంలో లెక్కగట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. కొత్త ఉద్యోగాలు ఇచ్చేమాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతున్నారు. ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు ఐదువేలమంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు జాబులు పోగొట్టుకున్నారు. గత సంవత్సరం అక్టోబరులో డీఎస్సీ పరీక్షలు నిర్వహించినా 10వేలమందిలో ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. పైగా ఉన్న స్కూళ్లను, హాస్టళ్లను తగ్గించి... ఏడువేల మిగులు ఉద్యోగాలు ఉన్నాయని రోజుకొక పేపర్ లీకు ఇస్తున్నారు.

మొన్నటికి మొన్న విశాఖపట్నంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్ల సమస్యలపై ధర్నా చేస్తున్న విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా ఈడ్చేసి, వ్యాన్లలో తీసుకెళ్లారు. రాష్ట్రంలో లక్షా 48వేల ఖాళీలున్నాయి. వాటికోసం గ్రామాల నుంచి వచ్చి పిల్లలు హాస్టళ్లలో ఉండి ఫీజులు కట్టుకుంటూ కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు.

యూనివర్సిటీల్లో టీచింగ్ స్టాఫ్ లేరు. ఐదువేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోరు. కారణం ఆ యూనివర్సిటీలు దివాళా తీయాలి... అక్కడ ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకురావాలి. ప్రైవేటు యూనివర్సిటీలు వస్తే అక్కడ కన్వీనర్ కోటా ఉండదు. కన్వీనర్ కోటా ఉండకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకమే ఉండదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకమే లేకపోతే గవర్నమెంట్‌కు చాలా డబ్బులు మిగులుతాయన్న దిక్కుమాలిన ఆలోచన. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు కనిపిస్తే గట్టిగా అడగండి.

అయ్యా... ప్రైవేటు యూనివర్సిటీకి భూములు ఫ్రీగా ఇస్తారు, అవకాశం ఉంటే డబ్బులూ ఇస్తారు. కానీ వాటిల్లో లోకల్ కోటా కింద ఇంతమంది పిల్లలను తీసుకోండి అని అడుగుతున్నారా? అని నిలదీయండి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చదువుకున్న ప్రతి పిల్లాడికి సంజీవనిగా కనిపించేది ప్రత్యేక హోదా.
 
కేసులకు భయపడి హోదా తాకట్టు: ప్రత్యేక హోదావల్ల ప్రధానంగా రెండు లాభాలున్నాయి. ఒకటి రాష్ట్రానికి కేంద్రం 90శాతం నిధులు  గ్రాంటుగా ఇస్తుంది. కేవలం 10శాతం లోన్‌గా ఉంటుంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రమైతే 30శాతం మాత్రమే గ్రాంటు, 70శాతం లోన్‌గా ఇస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం 100శాతం ఎక్సైజ్ సుంకం, ఆదాయపన్నులో రాయితీలు ఇస్తుంది. ఇటువంటి రాయితీలిస్తే పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారు, పరిశ్రమలు పెడతారు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయి.

ఇవన్నీ తెలిసినా చంద్రబాబు పట్టించుకోరు, ప్రత్యేకహోదాకోసం పోరాటం చేయరు. ఎందుకంటే... ఓటుకు కోట్లు కుంభకోణం. ఏపీలో తీసుకున్న లంచాల సొమ్ముతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ వీడియో ఆడియో టేపుల్లో పట్టుబడటం మనమంతా చూశాం. తెలంగాణలో ఎమ్మెల్సీలను గెలవాలన్న తపనతో 18మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5కోట్లు నుంచి రూ. 20కోట్లు ఎర చూపించి అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసులనుంచి బయటపడేందుకు బీజేపీకి సాగిలపడుతున్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రంలోని తన మంత్రులను ఉపసంహరించుకుంటానని హెచ్చరించలేకపోతున్నారు. కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చేట్లుగా లేదని, అదేమీ సంజీవని కాదని ప్లేటు మారుస్తున్నారు. ప్రత్యేకహోదాకంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని కొత్తపాట పాడుతున్నారు. విభజన చట్టంలో మనకు ఇస్తామని చెప్పిన పోలవరం ప్రాజెక్టు, యూనివర్సిటీలు, కాలేజీలు, రోడ్లు, కారిడార్లు... అన్నింటినీ కలిపి కేంద్రం కొత్తగా ప్యాక్ చేసి ప్రత్యేకప్యాకేజీగా ఇస్తామంటోంది.

ఇవన్నీ మనకు హక్కుగా వచ్చేవే కదా... ఇక మీరు కొత్తగా తెచ్చేదేమిటని చంద్రబాబును ప్రశ్నించండి. అప్పట్లో ఇదే చంద్రబాబు సోనియాగాంధీతో కలిసి నామీద కేసులు పెట్టారు. అయినా నేను భయపడలేదు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని గట్టిగా పోరాడాను. కానీ చంద్రబాబు కేసులకు భయపడి ప్రత్యేకహోదాను కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు. అయ్యా చంద్రబాబూ... ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న, ఉద్యోగాల కోసం చూస్తున్న పిల్లలందరూ మనవైపు చూస్తున్నారు. కేసులకు భయపడి రాష్ట్రాన్ని పణంగా పెడితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
 
వరల్డ్‌బ్యాంకు ర్యాంకింగ్ పేరిట దగా
ప్రపంచబ్యాంకు మనకు నెంబర్ 2 రేటింగ్ ఇచ్చారని చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్, కేపీఎన్‌జీ అనే సంస్థ, సీఐఐ, వరల్డ్‌బ్యాంకు వాళ్లు కలిసి తయారు చేసిన ఆ రిపోర్టులో రెండో స్థానం ఎలా వచ్చిందో తెలుసుకుంటే చంద్రబాబు ఎంత చక్కగా మోసం చేస్తారో తెలుస్తుంది. ఉత్పత్తి రంగంలో చైనా 43శాతం, తైవాన్ 35శాతం, ఇండోనేషియా 26శాతం, మలేషియా 25శాతం ఉండగా మనదేశం 16శాతం మాత్రమే ఉంది. అందుకే ఉత్పత్తిరంగంలో మిగతా దేశాలతో పోటీ పడాలని ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అందులో భాగంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను పిలిచి 98 పాయింట్లు ఇచ్చారు. వాటిని ఏ రాష్ట్రం ఎంత త్వరగా అమలు చేస్తుందో చెప్పమన్నారు. ఆ 98 పాయింట్లు చూసి చాలామంది ముఖ్యమంత్రులు భయపడ్డారు. ఎందుకంటే అందులో ఉన్నవి ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్. పనిచేసే వాళ్లను నిర్దాక్షిణ్యంగా తీసే అధికారం కంపెనీలకు ఇచ్చేశారు. యూనియన్లు ఉండకూడదంటూ అన్యాయమైన షరతులు పెట్టారు.

అందుకే వాటిపై సంతకాలు చేస్తే ప్రజలు ఆగ్రహిస్తారని ముఖ్యమంత్రులు భయపడ్డారు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ సంతకాలు పెట్టేశారు. అందుకే వరల్డ్‌బ్యాంకు ఆయనకు రెండోస్థానం ఇచ్చింది. సంతకాలు పెట్టని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలను పదో స్థానంలోనో, పన్నెండో స్థానంలోనో పెట్టింది. ఈ విషయాలన్నీ దాచి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు.
 
పత్యేకహోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రే!
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల గురించి చంద్రబాబు, ఆయన మంత్రులు, కేంద్రమంత్రులు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు, అబద్ధాలు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రకటించాక అప్పటి యూపీఏ కేబినెట్ సమావేశమై ప్లానింగ్ కమిషన్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయినా ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు ఒప్పుకోవడం లేదని, 14వ ఆర్థికసంఘం ఒప్పుకోవడం లేదని సాకులు చెబుతున్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించిన రోజున ఈ రాష్ట్రాలు లేవా? అని చంద్రబాబును నిలదీయండి. మేం చదువుకున్నవాళ్లం... ప్రత్యేకహోదా ఇచ్చేది ఆర్థిక సంఘం కాదనే విషయం మాకు తెలుసునని గట్టిగా చెప్పండి. ప్రత్యేక హోదా అన్న అంశం పూర్తిగా కేబినెట్ నిర్ణయం. జాతీయ అభివృద్ధి మండలికి, నీతి అయోగ్‌కు, కేంద్ర మంత్రివర్గానికి అధ్యక్షుడు ప్రధానమంత్రే. ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది కూడా ప్రధానమంత్రే.
 
ప్రత్యేక హోదా వస్తే మనమే నెంబర్-1
ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలకు ఉత్తరాఖండ్ ప్రత్యక్ష ఉదాహరణ. ప్రత్యేక హోదా ఇవ్వడంవల్ల ఆ రాష్ట్రంలో రెండువేల పరిశ్రమలు వచ్చాయి. రూ. 33వేల కోట్ల పెట్టుబడులు వచ్చి ఒకేసారి 110శాతం పరిశ్రమలు ఏర్పాటు కావడంవల్ల ఉపాధి అవకాశాలు 490శాతం పెరిగాయి. ప్రత్యేక హోదావల్ల హిమాచల్‌ప్రదేశ్‌లో ఏకంగా 10వేల పరిశ్రమలు వచ్చాయి. మన రాష్ట్రంలో 972 కి.మీ. సముద్ర తీరం ఉంది.

మనకు ప్రత్యేక హోదా ఇస్తే ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కం ట్యాక్స్, ఫ్రైట్ చార్జీల బెనిఫిట్ వల్ల మనకు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి లక్షల ఉద్యోగాలు వచ్చి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. రాష్ట్రం ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పని లేదు, నెంబర్ 1గా నిలుస్తుంది. అందుకే అందరం కలిసి ప్రత్యేకహోదా కోసం పోరాడాలి. ప్రత్యేక హోదా గురించి మంగళగిరిలో రెండురోజులు నిరాహారదీక్ష చేశాం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేశాం.

అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశాం. చివరకు ఈనెల 26 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు కూడా కూర్చోబోతున్నాం. కానీ ప్రత్యేక హోదా ఒక్క జగన్‌వల్ల అయ్యేది కాదు. జగన్‌కు తోడుగా మీరందరూ కలసి నిలబడితేనే అది సాధ్యమవుతుంది. విశాఖపట్నంలో యువభేరీ సదస్సును అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసులతో బెదిరించినా మీరంతా బేఖాతరు చేస్తూ పెద్ద సంఖ్యలో వచ్చారు. అదే స్ఫూర్తితో అందరం కలసి కట్టుగా పోరాడదాం. ప్రత్యేక హోదా సాధిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement