రేపటి నుంచి జగన్ సమైక్య శంఖారావం | Ys Jagan mohan reddy to undertake Samaikya Sankharavam tour tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జగన్ సమైక్య శంఖారావం

Published Fri, Nov 29 2013 2:22 AM | Last Updated on Wed, Aug 8 2018 5:54 PM

రేపటి నుంచి జగన్ సమైక్య శంఖారావం - Sakshi

రేపటి నుంచి జగన్ సమైక్య శంఖారావం

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో శనివారం నుంచి ప్రారంభంకానుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ సమైక్య శంఖారావం సభలు నిర్వహించడంతో పాటు వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా జగన్ ఓదారుస్తారు. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాలెం గ్రామానికి  చేరుకుని అక్కడ వెంకటేష్ కుటుంబాన్ని ఓదారుస్తారు. అనంతరం కుప్పం చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు బస్టాండ్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత కంచి బందార్లపల్లె గ్రామానికి చేరుకుని అక్కడ లక్ష్మి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. రాత్రికి కుప్పంలో బస చేస్తారని వైఎస్సార్ సీపీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలియజేశారు.
 
 బెంగళూరు మీదుగా కుప్పం వెళ్లేందుకు అనుమతించండి
 చిత్తూరు జిల్లా కుప్పంలో ఈనెల 30న నిర్వహించనున్న ‘సమైక్య శంఖారావం’ సభలో పాల్గొనే నిమిత్తం బెంగళూరు మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. అలాగే డిసెంబర్ 2న కుప్పం నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకూ అనుమతించాలని అభ్యర్థించారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి గురువారం పిటిషన్ దాఖలు చేశారు.
 
  విమానంలో బెంగళూరు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం వెళ్లాల్సి ఉందని, ఈ దృష్ట్యా బెయిల్ షరతును సడలించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి... సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, వృత్తిపరమైన కార్యకలాపాల నిమిత్తం డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి కూడా సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ తదుపరి విచారణను న్యాయమూర్తి డిసెంబర్ 2కు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement