
వైఎస్‌ఆర్‌కు ఘనంగా నివాళులు
ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు
♦ కన్నీటి పర్యంతమైన వైఎస్ విజయమ్మ, షర్మిల
♦ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత
♦ వైఎస్ వర్ధంతి సందర్భంగా జనసంద్రమైన ఇడుపులపాయ
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 6వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు బుధవారం ఉదయాన్నే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ సోదరుడు దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, కుమారులు వైఎస్ అనిల్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి, తదితరులు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
అనంతరం చర్చి పాస్టర్లు రెవరెండ్ నరేంద్రకుమార్, మృత్యుంజయలు ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతోపాటు వైఎస్ సోదరి విమలమ్మ, మేనత్తలు కమలమ్మ, రాజమ్మ, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ జగన్ చిన్నాన్నలు రవీంద్రనాథరెడ్డి, సుధీకర్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, పులివెందుల వైఎస్‌ఆర్‌సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, కడప, ఒంగోలు ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వై. వి.సుబ్బారెడ్డి, ఒంగోలు వైఎస్‌ఆర్‌సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, కమలాపురం వైఎస్‌ఆర్‌సీపీ నేత దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి సుగుణమ్మ, వైఎస్ భాస్కర్‌రెడ్డి సతీమణి లక్షుమ్మ, వైఎస్ ప్రకాష్‌రెడ్డి సతీమణి పద్మావతి తదితరులు నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సుమారు గంటపాటు ఘాట్ వద్ద నివాళులు, ప్రార్థన కార్యక్రమం జరిగిన అనంతరం సమీపంలో ఉన్న దివంగత సీఎం వైఎస్‌ఆర్ విగ్రహానికి వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, సాక్షిగ్రూపు సంస్థల చైర్ పర్సన్ వైఎస్ భారతిరెడ్డి తదితరులు పూలమాలలువేసి నివాళులర్పించి మైనపు ఒత్తులు వెలిగించారు.
కన్నీటి పర్యంతమైన వైఎస్ విజయమ్మ
వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న సమయంలో ఉద్విగ్నభరిత వాతావరణం కనిపించింది. వైఎస్‌ఆర్‌ను పాస్టర్లు తలచిన ప్రతిక్షణంలోనూ ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిలమ్మ, వైఎస్ జగన్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థన జరుగుతున్నంతసేపు విజయమ్మ కన్నీటి పర్యంతం కాగా.. షర్మిలమ్మ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వైఎస్ 6వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ జనసంద్రంగా మారింది.