ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామా? | YSRCP asks for footage of House proceedings from AP Govt | Sakshi
Sakshi News home page

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామా?

Published Fri, Dec 25 2015 3:42 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామా? - Sakshi

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామా?

సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సవాలు
సాక్షి, హైదరాబాద్: ‘‘సాక్షాత్తూ సీఎం చంద్రబాబు తన కనుసైగలతో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత రాజశేఖరరెడ్డిపై సభ్యసమాజం తలదించుకునేలా బూతులు తిట్టించి.. ఆనందిస్తారు. ఓపిక నశించి మేమేదైనా అంటే.. వాటిని భూతద్దంలో చూపెడుతూ మాపై విషప్రచారం చేస్తారు.  ఎన్నాళ్లీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు.. చంద్రబాబూ.. నీకు దమ్ము , ధైర్యం ఉంటే..

నీది సుపరిపాలనని నమ్మకముంటే.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామా? మధ్యంతర ఎన్నికలకు వెళదామా? ప్రజలు ఎవరిని ఛీకొడతారో తెలుస్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సవాలు విసిరారు. గురువారమిక్కడ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

మాల వేసుకుని కాషాయ వస్త్రాలు ధరించి దీక్షలో ఉన్న తనను కసాయివాడిలా వ్యవహరించారంటూ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు విమర్శించడంపై ఆయన అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘కసాయి అనేది వృత్తి. ఆ వృత్తివాళ్లను అగౌరవపరిచేలా మాట్లాడటం మంచిదికాదు.. తక్షణమే వాళ్లకు క్షమాపణ చెప్పు’’ అని శ్రీనివాసుల్ని ఆయన డిమాండ్ చేశారు.
 
స్పీకర్ తీరు అనుమానాస్పదం..
అసెంబ్లీలో స్పీకర్ కోడెల వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని చెవిరెడ్డి అన్నారు. కోడెలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడమేగాక.. చంద్రబాబులా కాకుండా సంప్రదాయాల ప్రకారం స్పీకర్ కుర్చీపై కూర్చోబెట్టడానికి విపక్ష నేత వైఎస్ జగన్ వెళ్లారని గుర్తుచేశారు. కానీ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదన్నారు. ‘‘అసెంబ్లీ రికార్డుల్లో లేనిమాటలు సోషల్ మీడియాకు ఎలా వచ్చాయి? అదీ ఒకపార్టీకి చెందినవారివే అనధికారికంగా సోషల్ మీడియాకు ఇచ్చిందెవరు? బాధ్యులెవరో తేల్చాలి? అని డిమాండ్ చేశారు.
 
సభాసంఘానికి సిద్ధమా?
రోజమ్మపై ఏడాది సస్పెన్షన్ విధించడం వివాదాస్పదం కావడంతో.. దారిమళ్లించేందుకు అనితమ్మను సభలో ఏడిపించిన చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టాలన్నారు. ‘‘అసెంబ్లీలో అనధికారికంగా, అధికారికంగా జరిగిన ప్రతిచర్చనూ, ప్రతిమాటనూ, ప్రతి దూషణనూ ప్రజలకు తెలపాలన్న చిత్తశుద్ధి ఉంటే.. రెండు పార్టీల సభ్యులు సమానంగా ఉండేలా సభాసంఘాన్ని ఏర్పాటు చేసి.. మొత్తం అసెంబ్లీ సమావేశాల ఫుటేజీని పాత్రికేయుల సమక్షంలో చూపించగలరా?’’ అని సవాలు విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement