బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రభావం రాష్ర్టంలో ప్రధానంగా ఆరు ప్రాజెక్టులపై త్రీవంగా పడనుంది. మిగులు జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కష్టంగా మారింది.
-
భారీ వరదలు వస్తేనే వీటికి మనుగడ
సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రభావం రాష్ర్టంలో ప్రధానంగా ఆరు ప్రాజెక్టులపై త్రీవంగా పడనుంది. మిగులు జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కష్టంగా మారింది. ఇప్పటివరకు మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేయకపోవడంతో ఆ నీటిని ఉపయోగించుకునేందుకు వీలుగా వీటిని చేపట్టారు. ప్రస్తుతం ట్రిబ్యునల్ మిగులు జలాలను కర్ణాటక, మహారాష్ట్రలకు కేటాయించడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. రాష్ర్టంలో మిగులు జలాలను ఆధారం చేసుకుని ఏడు ప్రాజెక్టులను చేపట్టారు. నెట్టెంపాడు, కల్వకర్తి, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ ప్రాజెక్టులను మిగులు జలాల ఆధారంగా చేపట్టారు. అయితే కొత్త ట్రిబ్యునల్ తీర్పులో తెలుగుగంగకు నీటిని కేటాయించారు.
మిగిలిన ఆరు ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కేటాయింపులను చేయలేదు. దాంతో వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే సుమారు రూ.20 వేల కోట్లకుపైగా వ్యయం చేశారు. ఇవి పూర్తయితే సుమారు 24 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టులతో ప్రయోజనం పొందే జిల్లాల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలుతో పాటు కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడంతో ఇక వరద నీరే ఆధారం కానుంది. ఇందులో చాలా ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు కావడంతో వరదలు వచ్చిన సమయంలో నీటిని పంపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు కొత్తగా వచ్చే నియంత్రణ బోర్డు అనుమతి అవసరం ఉంటుంది.