ట్రిబ్యునల్ తీర్పుపై విజయమ్మ ధర్నా
4న పులిచింతల, 5న గండికోట, 6న జూరాల వద్ద ధర్నాలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ తీర్పు వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోనున్న నేపథ్యంలో... మూడు ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టుల వద్ద ధర్నాలు చేపట్టాలని భావించినట్లు పార్టీ కేంద్ర పాలకమండలి (సీజీసీ) సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆధ్వర్యంలో ఈ నెల 4న పులిచింతల ప్రాజెక్టు వద్ద, 5న వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్ద, 6న మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు వివరించారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే బి.గురునాధరెడ్డి, అధికారప్రతినిధి గట్టు రామచంద్రరావులతో కలిసి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం మీడియాతో మాట్లాడారు. బుధవారం ఉదయం పదింటికి పులిచింతల వద్ద ధర్నాలో విజయమ్మ పాల్గొంటారని వివరించారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీంకోర్టులో స్టే తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రిబ్యునల్ తీర్పును షెడ్యూల్‌లో ప్రకటించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ట్రిబ్యునల్ తీర్పు పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదని ఉమ్మారెడ్డి చెప్పారు. గోబెల్స్ ప్రచారానికి అలవాటుపడిన చంద్రబాబు ప్రతీదానికి వైఎస్‌పై బురదచల్లే ప్రయత్నంచేస్తున్నారని దుయ్యబట్టారు.