న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా గల సుమారు 5 కోట్ల ఖాతాదారులకు కనీసం 8.5 శాతం వడ్డీ చెల్లించనుంది. ఈ మేరకు వచ్చేనెలలోగా నిర్ణయం తీసుకోనుంది. పీఎఫ్ ఖాతాలపై ఈపీఎఫ్‌వో ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం కంటే తక్కువ వడ్డీ చెల్లించబోదని ఈపీఎఫ్‌వో అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వచ్చేనెల భేటీ కావాలని భావిస్తున్నందున, ఆ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈపీఎఫ్‌వో 2011-12లో 8.25 శాతం వడ్డీ చెల్లించగా, 2012-13లో స్వల్పంగా పెంచి, 8.5 శాతం చెల్లించింది. పీఎఫ్ వడ్డీరేటుపై నిర్ణయం తీసుకునేందుకు సీబీటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలు కార్మిక సంఘాలు ఇప్పటికే కార్మికశాఖకు లేఖ రాశాయి.