సోషల్ మీడియాలో ఆ వీడియోలకు బ్రేక్!
సోషల్ మీడియా ద్వారా తమ సంస్థ వ్యాప్తిని విసృతం చేసుకుంటున్న ఉగ్రవాద సంస్థలకు చెందిన వీడియోలకు త్వరలో బ్రేక్ పడనుంది. ఉగ్రవాద వీడియోలను సోషల్ మీడియా నుంచి ఆటోమేటిక్గా తొలగించే సరికొత్త సాఫ్ట్ వేర్ ను ఆయా వెబ్‌సైట్లు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తాజాగా సిరియా, బెల్జియం, అమెరికా తదితర దేశాల్లో ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్లు ఫేస్ బుక్, యూట్యూబ్ లు ప్రస్తుతం ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోలను తొలగించేందుకు సిద్ధం అవుతున్నాయి.
అయితే, ఏ పద్ధతి ప్రకారం ఉగ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని గుర్తిస్తారో మాత్రం తెలుపలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా ఒత్తిడితో ఆన్ లైన్ లో ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకునేందుకు ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్, క్లోడ్ ఫ్లేర్ తదితర కంపెనీలు ఒప్పుకున్నాయి. దాంతో ఆన్ లైన్ లో ఎక్కడైనా ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోల సమాచారం కనిపిస్తే సంస్థలు తొలగించనున్నాయి. ఆటోమేషన్ ప్రత్యేకంగా తయారుచేసిన సాఫ్ట్ వేర్ ను ఇందుకు ఉపయోగించనున్నారు. ఏ అంశాలను ఉగ్రవాద సమాచారంగా భావిస్తారనే విషయం మాత్రం పూర్తి స్థాయిలో తెలియాల్సివుంది.