‘సమైక్య’ పిటిషన్లపై నేడు విచారణ
‘సమైక్య’ పిటిషన్లపై నేడు విచారణ
Published Mon, Nov 18 2013 2:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు సోమవారం విచారించనుంది. విభజన నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ నేత, పారిశ్రామికవేత్త కె.రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో పాటు కె.కృష్ణమూర్తి వేసిన పిటిషన్లను దీనికి జతపరిచారు. ఇవన్నీ ఈ నెల 1న జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ మదన్ బి.లోకూర్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.
అయితే తమ సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ అందుబాటులో లేరని ప్రధాన పిటిషనర్ తరఫు న్యాయవాదులు నివేదించడంతో విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా పడింది. అనంతరం విభజనను వ్యతిరేకిస్తూ మరో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య రైతుల సంఘం, కె.ప్రభాకర్‌రాజు తదితరులు, అనిశెట్టి చంద్రమోహన్ ప్రభృతులు, ఎం.రామకృష్ణ వేసిన పిటిషన్లను సోమవారం విచారణకు రానున్న నాలుగు పిటిషన్లకు జతపరిచారు. దీంతో మొత్తం 8 పిటిషన్లు ధర్మాసనం ముందు లిస్టయినట్టయింది. ఇలావుండగా టీడీపీ నేత సీఎం రమేష్, మరొకరు వేసిన పిటిషన్ల విచారణకు కూడా వారి న్యాయవాదులు సోమవారం విజ్ఞప్తి చేయవచ్చని సమాచారం.
పిటిషనర్లు ప్రస్తావించిన ముఖ్యాంశాలు...
శాసనసభ అభిప్రాయం తెలుసుకోకుండానే కేంద్రం విభజన నిర్ణయం తీసుకుందని, ఈ దృష్ట్యా దానిని రాజ్యాంగవిరుద్ధమైనదిగా ప్రకటించాలని తొలుత పిటిషన్ వేసిన రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ 3వ అధికరణం ఆధారంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ నేత సోమయాజులు తన పిటిషన్‌లో అభ్యర్థించారు. ‘‘కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగంలోని 3వ అధికరణం ద్వారా పార్లమెంటుకు దఖలు పడిందన్నది వాస్తవమే. కానీ ఆ అధికారాన్ని... అందుకోసం ఏర్పరచిన విధి విధానాలకు అనుగుణంగా ఉపయోగించాలే తప్ప వివక్షాపూరితంగానో, ఇష్టారాజ్యంగానో వాడకూడదు. ప్రభుత్వ చర్యలేవైనా చెల్లుబాటు కావాలంటే అవి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరంకుశ పోకడలకు లోనై తీసుకున్నవి అయ్యుండకూడదు. ఇదే మనల్ని పాలించే న్యాయ పాలన వ్యవస్థ తాలూకు మౌలిక పునాది. రాజ్యాంగంలోని 14వ అధికరణం సారాంశం కూడా ఇదే’’ అని నివేదించారు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కేంద్రం ఈ మౌలిక సూత్రాన్నే ఉల్లంఘిస్తోందని తన పిటిషన్‌లో ఆరోపించారు.
ఇప్పటిదాకా 3వ అధికరణం ప్రకారం ఏర్పాటైన రాష్ట్రాలన్నీ మొదటి ఎస్సార్సీ సిఫార్సుల మేరకు గానీ, లేదా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ కోరిక మేరకు జేవీపీ కమిటీ, దార్ కమిటీ, లేదా వాంచూ కమిటీ వంటివి ఇచ్చిన నివేదికల ఆధారంగా గానీ ఏర్పడ్డవేనని సోమయాజులు గుర్తు చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ మరో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఇలాంటి ప్రాతిపదిక ఏదీ లేదు. పెపైచ్చు, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడమే అత్యుత్తమ పరిష్కారమని పేర్కొన్న జస్టిస్ శ్రీకష్ణ కమిటీ సిఫార్సులకు కేంద్రం నిర్ణయం పూర్తి విరుద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగవిరుద్ధం’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రుల బృందం(జీవోఎం) ఏర్పాటుకు వీలు కల్పించిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని, సదరు నోటిఫికేషన్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 3, 14, 371డీకి ఉల్లంఘనగా ప్రకటించాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.
Advertisement