విభజనపై వివరణివ్వండి
* కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం
* స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం
* కేంద్రం నుంచి సమాధానం వచ్చాక విచారణ
* రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలో లేదో అప్పుడే చెబుతాం
* జస్టిస్ దత్తు వ్యాఖ్య నోటీసులకు కాలపరిమితి విధించేందుకూ నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కేంద్ర హోం శాఖ సహా ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు నోటీసులు జారీచేసింది. అయితే చట్టం అమలుపై స్టే విధించాలన్న పిటిషనర్ల వినతిని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. అయితే ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
* రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన మొత్తం 18 పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. తొలుత ఫిబ్రవరి 19న వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్, రఘురామకృష్ణంరాజు తదితరులు వేసిన 5 పిటిషన్లతోపాటు ఆ తరువాత దాఖలైన మరో 13 పిటిషన్లను కూడా ఈ విచారణలో భాగంగా చేర్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, సి.ఎం.రమేశ్, రాయపాటి సాంబశివరావు తదితరులు కూడా ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
* శుక్రవారం సరిగ్గా ఉదయం 11.35 గంటలకు ఈ కేసు విచారణకు రాగా.. కేవలం రెండు నిమిషాల్లోనే వాదనలు పూర్తయ్యాయి. ‘మేం ఈ కేసులో నోటీసులు జారీచేస్తున్నాం. స్టే ఇవ్వడం లేదు..’ అని కేసు విచారణకు రాగానే న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు పేర్కొన్నారు.
* ‘అపాయింటెడ్ డే తొందరలోనే ఉంది..’ అని కిరణ్‌కుమార్‌రెడ్డి తరపు న్యాయవాది రాజీవ్‌ధావన్ చెబుతుండగా... ‘ఈరోజు మేమేమీ చెప్పలేం... మీరేమీ అడ గకండి. గతంలో ఇవే కేసులు వచ్చినప్పుడు అపరిపక్వంగా ఉన్నాయని చెప్పాం. ఇప్పుడు మేం నోటీసు జారీచేస్తున్నాం. ప్రతివాదులు చెప్పేది కూడా వినాలి కదా..’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
* ‘చట్టం అమలుకు అపాయింటెడ్ డే జూన్ 2నే ఉన్నందున చట్టం అమలుకాకుండా నిలుపుదల చేయండి..’ అని మేకపాటి రాజమోహన్‌రెడ్డి తరపు న్యాయవాది హరీష్‌సాల్వే కోరారు. ‘లేదు.. ఈరోజు మీరేమీ అడగక ండి. వారు సమాధానం ఇచ్చాక... మేం విచారించాలా? లేక రాజ్యాంగ ధర్మాసనానికి విన్నవించాలా? అన్నది అప్పుడు చెబుతాం..’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో అపాయింటెడ్ డే ఉన్నందున త్వరగా విచారణకు వచ్చేలా నోటీసులకు నిర్దిష్ట గడువు పెట్టాలని, తదుపరి విచారణకు తేదీ ఇవ్వమని సాల్వే విన్నవించారు. ‘ప్రస్తుతం నోటీసులు మాత్రమే.. స్టే లేదు..’ అని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.
కిక్కిరిసిన కోర్టు హాలు..
* రాష్ట్ర విభజనపై శుక్రవారం ఈ 18 పిటిషన్లు కోర్టుకు రానున్న నేపథ్యంలో న్యాయవాదులతో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. పిటిషనర్లు, సందర్శకులు, మీడియాతో సందర్శకుల గ్యాలరీ కూడా కిక్కిరిసిపోయింది.
* మేకపాటి రాజమోహన్‌రెడ్డి తరపున హరీష్‌సాల్వే, గోపాల్ శంకరాయణన్, విక్రమ్ తదితర న్యాయవాదులు... అడుసుమిల్లి జయప్రకాశ్, రఘురామ కృష్ణంరాజుల తరఫున ఫాలీ నారీమన్, అనూప్ ఛౌదరి, శ్యామల పప్పు, గల్లా సతీష్ తదితరులు... కిరణ్‌కుమార్‌రెడ్డి తరపున రాజీవ్ ధావన్, బి.సుదర్శన్‌రెడ్డి, తదితర న్యాయవాదులు హాజరయ్యారు.
* కేంద్రానికి నోటీసులు జారీచేస్తున్నామని కోర్టు చెప్పగానే సమైక్యవాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. జూన్ 2లోపు విచారణకు వస్తుందని, చట్టం అమలుపై స్టే కూడా వస్తుందని వారిలో ఆశాభావం వ్యక్తమైంది.
* పిటిషనర్లలో ఉండవల్లి అరుణ్‌కుమార్, సీఎం రమేశ్ తదితరులు కూడా కోర్టు హాలుకు వచ్చారు.
త్వరగా విచారణ జరపాలని కోరాం
‘‘మేకపాటి రాజమోహన్‌రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది హరీష్‌సాల్వే వాదనలు వినిపించారు. అపాయింటెడ్ డే జూన్ 2నే ఉన్నందున ఆలోపే విచారణకు వచ్చేలా తేదీ ఇవ్వాలని అడిగాం. కానీ కోర్టు ఇందుకు నిరాకరించింది. కేసు రాజ్యాంగ ధర్మాసనానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపుతున్న ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగ నిబంధనలు పట్టించుకోకుండా కేంద్రం తీసుకొచ్చింది. అనేక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉన్నా వాటిని పట్టించుకోలేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా కేంద్రం పట్టించుకోలేదు..’ అని మేకపాటి తరపు న్యాయవాది గోపాల్ శంకరాయణన్ తెలిపారు. ‘జూన్ 2నే అపాయింటెడ్ డే ఉన్నందున ఒకవేళ కోర్టు ఈ అంశం అత్యవసరమని భావిస్తే త్వరితగతినే విచారణకు వస్తుంది..’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.