విభజనపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన ప్రక్రియపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే, ఈ విషయంలో కోర్టుకు ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది.
పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి, ఇప్పుడైనా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్ దాఖలైంది. ఇంతకుముందు పలుమార్లు రాష్ట్ర విభజనపై పలువురు నాయకులు, న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, అప్పటికి ఇంకా సమయం పరిపక్వం కాలేదంటూ ఆయా పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.