సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ‘‘విభజన దిశగా కేవలం ప్రకటనే వెలువడింది తప్ప రాష్ట్రం ఏర్పడే ముందు తీసుకోవాల్సిన పలు చర్యలను ఇంకా తీసుకోలేదు. మనమింకా ఆ దశకు చేరుకోలేదు. విభజన ప్రకటనపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాన్ని పార్లమెంటు ముందుకు కేంద్రం తీసుకెళ్తుంది. అప్పుడది విభజన ప్రతిపాదనను అంగీకరించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు’’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘‘మీది ప్రీమెచ్యూర్ పిటిషన్. తొందరపడకుండా వేచి చూడండి’’ అని పిటిషనర్‌కు సూచించింది.
న్యాయవాది పి.వి.కృష్ణయ్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ సుధాంశు జ్యోతి ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలని, తెలంగాణ ఏర్పాటు దిశగా తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని నియంత్రించాల్సిందిగా పిటిషన్‌లో కృష్ణయ్య కోరారు. 3వ అధికరణం ప్రకారం విభజన అధికారం ఎవరికుందని ఈ సందర్భంగా జస్టిస్ దత్తు ప్రశ్నించారు. ప్రభుత్వానికని కృష్ణయ్య చెప్పగా, ‘కాదు, పార్లమెంట్‌కు ఉంది.
ప్రధాని సారథ్యంలోని కేబినెట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుంది. పార్లమెంటేమో రాష్ట్రపతి ఆదేశానుసారం పనిచేస్తుంది’’ అని వివరించారు. అయినా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది సీడబ్ల్యూసీ కదా అని వ్యాఖ్యానించారు. విభజన ప్రక్రియ మొదలు పెట్టామని కాంగ్రెస్ తరఫున దిగ్విజయ్‌సింగ్, ప్రభుత్వం తరఫున చిదంబరం చెప్పారంటూ కృష్ణయ్య ఏదో వివరించబోయారు. జస్టిస్ దత్తు కల్పించుకుని, ‘‘వారేమన్నా చెబుతారండీ. కేబినెట్ నోట్ రూపొందడం, బిల్లును పార్లమెంట్‌లో పెట్టడం, దాన్ని ఆమోదించడం... ఇవన్నీ ప్రక్రియలో భాగమవుతాయి’’ అని స్పష్టం చేశారు. కృష్ణయ్య మళ్లీ ఏదో చెప్పబోగా, జస్టిస్ దత్తు తెలుగులో మాట్లాడుతూ, ‘‘అయ్యా కృష్ణయ్య గారూ...! అది మాకు తెలుసండీ. అదేం కాలేదయ్యా’’ అంటూ పిటిషన్‌ను తోసిపుచ్చారు.
హైకోర్టులో దాఖలుకు అనుమతి తీసుకున్నా
‘‘హైకోర్టులో కేసు వేసే అవకాశం ఉన్నప్పుడు నేరుగా ఇక్కడికెందుకు వచ్చారంటూ ధర్మాసనం అభ్యంతరం చెప్పింది. అందుకే వ్యాజ్యాన్ని అనుమతించబోమంది. నేను పిటిషన్‌ను ఉపసంహరించుకుని, హైకోర్టులో దాఖలుకు అనుమతి తీసుకున్నాను’’ అని కృష్ణయ్య తెలిపారు.
హైకోర్టులో కూడా...
సాక్షి, హైదరాబాద్: ఆస్తులు, అప్పులు, నీరు, ఉద్యోగాలు, విద్యుత్ తదితర అంశాలపై స్పష్టత ఇచ్చేవరకు రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. విభజనపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోనప్పుడు దానిపై కోర్టుకెలా వస్తారంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వి.సూర్యనారాయణ అనే రైతు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజనపై దాఖలైన మరో వ్యాజ్యంపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
విభజనపై వ్యాజ్యాన్ని కొట్టేసిన సుప్రీం
Published Tue, Aug 27 2013 5:54 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement