అన్నదాత..జర జాగ్రత్త..!
ఎరువుల కొనుగోలులో అప్రమత్తత అవసరం
యడ్లపాడు : ఖరీఫ్ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మే నెలలో సగటు వర్షపాతానికి మించి మండలంలో వర్షం కురిసింది. జూన్ ప్రారంభంలోనూ 4 దఫాల్లో 17.8 మిమీ వర్షపాతం కురవడంతో రైతులు భూమిని దుక్కి దున్ని ఎరువులు, విత్తనాల కోసం షాఫులకు వెళ్తున్నారు. అయితే రైతులు ఎరువుల కొనుగోళ్ల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలాచోట్ల నాసిరకం విత్తనాలు కొని పంట ఎదుగుదల లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
ఎవరో చెప్పారని మొహమాటానికి నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తే మోసపోయే అవకాశం ఉంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలతో కొందరు వ్యాపారులు నాసిరకం విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ మందులను అంటగడుతుంటారు. విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలను మండల వ్యవసాయాధికారి ఐ.శాంతి వివరించారు.
విత్తనాల కొనుగోళ్లలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
గుర్తింపు పొందిన విత్తనాల సంస్థల నుంచి ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తనాల సంచిపై లాట్ నంబర్, కాల పరిమితి తప్పనిసరిగా ముద్రించి ఉన్నవాటినే కొనుగోలు చేయాలి. రైతు కొనుగోలు చేసిన విత్తనాల సంచి ట్యాగ్, బిల్లు రసీదులను పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలియని వ్యక్తుల ప్రోద్బలం, మాయమాటలు నమ్మి విత్తనాల గురించి తెలియకపోయినా కొనుగోలు చేయడం మంచిదికాదు. విత్తనాలు నాణ్యమైనవా కావా అన్నవిషయాన్ని విత్తనాలను విత్తే ముందుగానే మొలకశాతాన్ని పరిరక్షించుకోవడం మంచిది.
నాణ్యమైన విత్తనాలను ఇలా గుర్తించవచ్చు...
కొనుగోలు చేసిన విత్తనాల సంచి నుంచి 100 గింజలను తీసుకోవాలి. శుద్ధమైన ఇసుకను సేకరించి పళ్లెంలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో రెండు అంగుళాల మందంతో నింపుకోవాలి. అందులో 100 విత్తనాలను సమాన స్థాయిలో ఉంచి తిరిగి ఇసుకతో కప్పాలి. ఇసుకను రోజూ నీటితో తడపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. వారం పదిరోజుల్లో అందులో దృఢంగా, ఏపుగా, ఆరోగ్యంగా పెరిగిన మొక్కలను లెక్కిస్తే 70 నుంచి 80 శాతం మొలకెత్తితే అవి నాణ్యమైన విత్తనాలని భావించాలి.
బలం మందులు, పురుగు మందుల కొనుగోలు సమయంలోనూ...
బలం మందులు, పురుగు మందులు కొనుగోలు చేసేటప్పుడు ఆయా డబ్బాలపై సీలు సరిగ్గా ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలించాలి. అన్నీ సక్రమంగా ఉన్న వాటిని కొనుగోలు చేయాలి. కొన్న ప్రతిదానికి తప్పకుండా రసీదు అడిగి తీసుకోవాలి. ముఖ్యంగా ఐఎస్‌ఐ ముద్ర ఉన్న వాటిని విధిగా కొనాలి. వాటితో పాటు మందులు తయారు చేసిన తేదీ, గడువు తేదీ ముద్రించి ఉన్నాయో లేదో గమనించాలి. వ్యవసాయ శాఖ అనుమతులు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. ఎలాంటి వివరాలు లేకుండా ఇచ్చే ఎరువుల సంచులు కొనుగోలు చేయరాదు.
- శాంతి
వ్యవసాయాధికారిణి