పాడి పశువుల పాలనలో షెడ్డును నిర్మలంగా ఉంచుకోవడం అతి ముఖ్యమైంది. పశువుకు ఎంత మేత వేసి ఎన్ని ఖనిజ లవణాలిచ్చినా ఆశించిన పాల దిగుబడి రాదు. దీనికి ప్రధాన కారణం పశువులను పీడించే పరాన్నజీవులు. పశువులను గోమార్లు, పిడుదులు పీడించి రక్తం పీల్చడంతో పాటు పాకను ఆశ్రయించి ఉండే దోమలు కుట్టి బాధిస్తుంటాయి.
దొడ్డిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ పరాన్న జీవుల బెడదను అరికట్టవచ్చు. కొట్టాలను శుభ్రంగా ఉంచడానికి లాక్టోబ్యాక్టీరియా అద్భుతంగా ఉపయోగపడుతుంది. లాక్టోబ్యాక్టీరియా లీటరు నీటికి ఒక మిల్లీ లీటరు చొప్పున కలిపి షెడ్డులోపల, బయట కనీసం వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. దీని వలన పశువుల పాకలో దుర్వాసన పోవడమే కాకుండా వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కూడా అంతరిస్తుంది. కొన్ని మూలికలతోనూ గోమార్లు, పిడుదుల బాధను వదిలించుకోవచ్చు.
1. వనమూలికల పొడి: ముడి పసుపు, వేప నూనె, వస ఆంగ్లంలో దీన్ని స్వీట్‌ఫ్లాగ్ అంటారు. వీటికి కొబ్బరి చిప్పల బొగ్గును చేర్చి ముద్ద నూరుకోవాలి. ఈ ముద్దను తెల్లటి గుడ్డ లేదా తాటాకు, కొబ్బరాకులో చుట్టి పశువు మెడలో కట్టాలి. దీంతో పశువును గోమార్లు, పిడుదులు బాధించవు. జోరీగలు వంటివి దూరంగా పోతాయి. ప్రధానంగా వర్షకాలంలో దోమలు, ఈగలు, జోరీగల బారి నుంచి కాపాడడమే కాకుండా ఇతర పరాన్నజీవులు, బ్యాక్టీరియా సోకకుండా నిరోధిస్తుంది.
2. షెడ్డు చుట్టూ పరిసరాలు చిత్తడిగా మారే వర్షాకాలం, శీతాకాలంలో దోమలు, ఈగలు పశువులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ కాలంలో కొట్టం ముందు పిడకలతో పొగవేస్తే దోమలు ఈగలు పారిపోతాయి. ఒక ఇనుప తట్టలో పిడకలు వేసి అగ్గి ముట్టిస్తే నిలకడగా కాలి పొగ వస్తుంది. దీనితో ఈగలు దోమలు కూడా కొట్టం పరిసరాల్లో నిలవకుండా పారిపోతాయి. పిడకలు త్వరగా కాలకుండా ఉండడానికి దాని మీద కొంత పచ్చిపేడ వేసుకోవాలి. అందుబాటులో ఉంటే పిడకల మీద వరిపొట్టు పరిచి.. దాని మీద పచ్చి పేడ పలచగా వేస్తే కుంపటి రాజుకున్నట్లుగా పొగ వెలువడుతూ పిడకలు మరింత నిలకడగా కాలుతాయి. పిడకల పొగ వలన శ్వాసకు ఎలాంటి ఇబ్బంది రాదు.
3. పశువుల కొట్టం పరిసరాల్లో నిమ్మగడ్డి, తులసి, పుదీనా వంటి ఔషధ మొక్కలు పెంచినా దోమలు, ఇతర కీటకాల నిరోధానికి ఉపయోగపడుతాయి.
- ‘సాగుబడి’ డెస్క్
పశువు కొట్టం.. పరిశుభ్రత
Published Mon, Mar 31 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement