సిరులన్నీ...సరిపాళ్లలో... | cookery with amla | Sakshi
Sakshi News home page

సిరులన్నీ...సరిపాళ్లలో...

Published Fri, Nov 22 2013 11:08 PM | Last Updated on Fri, Aug 17 2018 2:18 PM

cookery with amla

వజ్రాలా? వైఢూర్యాలా? మరకతాలా? మాణిక్యాలా?
 గోమేధికాలా, పుష్యరాగాలా? పగడాలా, ముత్యాలా?
 ఇంద్రనీలాలా? పసిడి రజతాలా?
 ఏమున్నాయండీ... ఇంత చిన్న ఉసిరిలో!! మాట్లాడితే సిరులంటారు, సరిపాళ్లంటారు?
 అవునా? లేవంటారా? నిజంగానే లేవంటారా? ఆలోచించండి, ఉసిరిక్కాయ్‌ని నములుతూ ఆలోచించండి.
 ఆరోగ్యానికి పనికొచ్చేవన్నీ ఉన్నాయి. ఆహారానికి రుచినిచ్చేవన్నీ ఉన్నాయి.
 హాయిగా తింటూ, ఆరోగ్యంగా ఉంటే... అంతకు మించిన మహాభాగ్యం ఏముంది చెప్పండి?
 జిహ్వకు రుచిని, జీర్ణకోశానికి శుచినీ అందించే ఆమలకం రిచ్ కాక ఏమిటి? వెరీమచ్ కాక మరేమిటి?

 
 ఉసిరి రైస్
 
 కావలసినవి:
 ఉసిరికాయలు - 10; బియ్యం - అర కేజీ; పసుపు - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; నువ్వులపొడి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు - 10; పచ్చిమిర్చి - 4; ఎండుమిర్చి - 5; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర కట్ట - చిన్నది ; శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను
 
 తయారి:   
 ముందుగా అన్నం వండుకుని పెద్ద పాత్రలో ఆరబెట్టాలి  ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి ఉంచి, కొద్దిసేపయ్యాక దంచాలి. (ఉసిరికాయలు మరీ పెద్దగా ఉంటే తురుముకోవచ్చు)  
 
 పాన్‌లో నూనె వేసి కాగాక పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి రెండు నిముషాలు వేయించాలి  
 
 అందులోనే పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన లేదా తురిమిన ఉసిరికాయ ముద్ద వేసి దోరగా వేయించాలి
 
 రెండు మూడు నిముషాలు మీడియం మంట మీద ఉంచి వేయించి, దించేయాలి  కొద్దిగా చల్లారిన తర్వాత అన్నంలో కలపాలి.
 
 ఆమ్లా కీ లౌంజీ
 
 కావలసినవి:  
 ఉసిరికాయలు - పావు కిలో; నూనె - 2 టేబుల్ స్పూన్లు; పంచదార - టీ స్పూను; కారం - టీ స్పూను; పసుపు - అర టీ స్పూను; ధనియాలపొడి - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; సోంపు - టీ స్పూను; ఇంగువ - చిటికెడు; ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 5
 
 తయారి:  
 ఉసిరికాయలను కుకర్‌లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి దించేయాలి
 
 చల్లారాక గింజలు వేరు చేసి, ముక్కలుగా కట్ చేయాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి వేయించాలి
 
 సోంపు, ఇంగువ, ఎండుమిర్చి జత చేసి మరోసారి వేయించాలి
 
 
 ఉసిరి ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి  
 
 టీ స్పూను పంచదార, టీ స్పూను నీరు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరోమారు కలిపి రెండు నిముషాలు ఉంచి దించేయాలి.
 
 ఆమ్లా స్క్వాష్
 
 కావలసినవి:
 ఉసిరికాయలు - 2 కేజీలు; పంచదార - 2 కేజీలు; కుంకుమపువ్వు - కొద్దిగా; ఏలకులపొడి - టీ స్పూను; సోడియం బెంజోయిట్ - 4 టీ స్పూన్లు
 
 తయారి:
 ఉసిరికాయలను ఆవిరి మీద ఉడికించి, చల్లారాక గింజలను వేరు చేసి, ఉసిరికాయలను మెత్తగా పేస్ట్ చేయాలి  
 
 ఒక పెద్ద పాత్రలో పంచదార, ఉసిరి పేస్ట్, కొద్దిగా నీరు వేసి మూత పెట్టి, స్టౌ మీద ఉంచి, చిక్కగా అయ్యేవరకూ ఉడికించాలి  
 
 కుంకుమపువ్వు, ఏలకులపొడి జతచేసి ఒకసారి కలిపి దించేయాలి  
 
 కొద్దిగా వేడి నీటిలో సోడియం బెంజోయిట్‌ను వేసి కలిపి, ఉసిరి స్క్వాష్‌లో వేసి కలిపి గాలిచొరని సీసాలో వేయాలి.
 
 ఆమ్లా రైతా
 
 కావలసినవి:
 ఉసిరికాయలు - 3; పచ్చిమిర్చి - 3 (సన్నగా పొడవుగా కట్ చేయాలి); కొబ్బరితురుము - కప్పు; పెరుగు - కప్పు; ఉప్పు - తగినంత; నూనె - టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; కరివేపాకు - 2 రెమ్మలు; ఎండుమిర్చి - 2
 
 తయారి:   
 ఉసిరికాయలను మెత్తగా ఉడికించి, చల్లారాక గింజలు తీసేయాలి
 
 మిక్సీలో ఉసిరికాయలు, పచ్చిమిర్చి, కొబ్బరితురుము వేసి మెత్తగా చేయాలి  
 
 ఉప్పు, పెరుగు వేసి మరోమారు మిక్సీపట్టాలి
 
 బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి  ఒక గిన్నెలో పెరుగు మిశ్రమం, ఇంగువ వేసి బాగా కలిపి వేయించిన పోపు జతచేయాలి.
 
 ఉసిరి మసాలా పచ్చడి
 
 కావలసినవి:
 ఉసిరికాయలు - పావు కిలో; మెంతులు - 3 టేబుల్ స్పూన్లు; సోంపు - 3 టేబుల్ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; కారం - 3 టీ స్పూన్లు; పసుపు - అర టీస్పూను; ఆవనూనె -2 టేబుల్‌స్పూన్లు; ఉప్పు - తగినంత
 
 తయారి:  
 ఉసిరికాయలకు తగినంత నీరు జతచేసి సుమారు పది నిముషాలు ఉడికించాలి  చల్లారాక గింజలు వేరు చేసి ఉసిరికాయలను పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేయాలి  ఒక పాత్రలో ఆవనూనె, మెంతిపొడి, సోంపు, ఇంగువ, కారం, పసుపు, ఉప్పు వేసి కలపాలి  
 
 ఉసిరికాయ ముక్కలు జత చేసి బాగా కలపాలి  
 
 ఈ మిశ్రమాన్ని, తడి లేసి సీసాలో వేసి నాలుగు రోజుల పాటు ఎండలో ఉంచి తీసేయాలి  
 
 ఈ ఊరగాయ సుమారు నెలరోజులు నిల్వ ఉంటుంది.
 
 విశేష ఉసిరి...
 విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
     
 ఎండకి, వర్షాభావానికి కూడా పెరుగుతుంది.
     
 ఉసిరిని పెంచడానికి అన్ని నేలలూ అనువైనవే.
     
 వీటి గింజలు, ఆకులు, పూలు, వేళ్లు, బెరడు... అన్నిటినీ ఆయుర్వేద ఔషధాలలో వాడతారు.
     
 ఈ చెట్టు 18 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.
     
 జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు పట్టడం లాంటివి రాకుండా కాపాడుతుంది.
     
 హెమరైజ్‌కి, లుకోమియా వ్యాధికి, గర్భసంచిలో రక్తస్రావం అరికట్టడానికి ఔషధంగా వాడతారు.
     
 ఉప్పులో ఎండబెట్టి నిల్వ చేసిన ఉసిరిముక్కను ప్రతిరోజూ బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
     
 శరీరానికి చల్లదనాన్నిచ్చి మలమూత్రవిసర్జన సక్రమంగా జరుగుతుంది.
     
 చక్కెరవ్యాధిగ్రస్తులు దీనిని వాడితే రక్తంలోని చక్కెరను తగ్గిస్తుంది.
     
 జ్ఞాపకశక్తినిచ్చే మందులలో ఉసిరిని ఎక్కువగా వాడతారు.
     
 శరీరంలో ఉండే కొవ్వును తగ్గిస్తుంది. ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది.
     
 కాలేయంలో చేరిన మలినాలు, విషపదార్థాలను తొలగించి, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
     
 స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది.
     
 బాగా ముదిరిన కాయలను ఎండబెట్టి వాటి గింజలను వేరుచేసి, ఒక్కో గింజలను పగలగొట్టి, లోపల చిన్న పరిమాణంలో ఉండే ఆరు విత్తనాలను 12 గంటల పాటు నీటిలో నానబెట్టి, మునిగిన విత్తనాలను మాత్రమే నారుమళ్లలో విత్తుకోవాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement