రైతు శాస్త్రవేత్తలకు జేజేలు!
అద్భుతాల ఆవిష్కర్త అబ్దుల్ ఖాదర్!
తరుముకొచ్చే అవసరంలో నుంచే.. సృజనాత్మక ఆలోచన పొటమరిస్తుంది! అప్పటివరకూ అసాధ్యమైన పనిని సులభసాధ్యం చేసే.. సరికొత్త ఆలోచనై మెరుస్తుంది!! జనజీవనాన్ని బండ చాకిరీ నుంచి గట్టెక్కించే.. విశిష్ట ఆవిష్కరణై వెలుగుతుంది!!! అటువంటి అమూల్య ఆవిష్కరణలకు జన్మనిచ్చిన సృజనశీలురు ఆశీనులైన సుందర సమావేశ మందిరం అది. పువ్వుల మకరందాన్ని తెచ్చే తేనెటీగలకు పుస్తకాల చదువులు.. భాష.. ప్రాంతీయ భేదాలతో నిమిత్తమేముంది? మార్చి 7వ తేదీ.. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆవరణలోని కల్చరల్ సెంటర్ అది. పూల మకరందాన్ని వెంట తెచ్చిన తేనెటీగల మాదిరిగా.. గ్రామీణ ఆవిష్కర్తలు, రైతు శాస్త్రవేత్తలు, సంప్రదాయ విజ్ఞాన పరిరక్షకులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు. సభికుల కరతాళ ధ్వనుల మధ్య రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) జాతీయ పురస్కారాలను అందజేశారు. ఇన్నోవేషన్ ఫెస్టివల్‌లో పురస్కార గ్రహీతల విశిష్ట ఆవిష్కరణల వివరాలు కొన్ని ‘సాగుబడి’ పాఠకుల కోసం..
అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్! వ్యవసాయదారుడిగా తనకు ఎదురైన సమస్యల పరిష్కారానికి తనకు తానే సృజనాత్మక పరిష్కారాలు వెదుకుతూ విశిష్ట యంత్రాల ఆవిష్కర్తగా ఎదిగారు. పేరు ప్రతిష్టలు, అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్‌ఐఎఫ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు..
అబ్దుల్ ఖాదర్‌కు 62 ఏళ్లు. ధార్వాడ్ (కర్ణాటక) జిల్లాలోని అన్నిగెరి గ్రామం. పుస్తకాల చదువు బడి ఆవరణలోనే ఆగిపోయి.. సేద్యమే జీవనమైంది. అలారం మోతకు కూడా వదలని మొద్దు నిద్ర ఆయనకు అలవాటు. ఈ సమస్య నుంచి బయటపడడానికి.. శబ్దం చేయడంతో పాటు మొహం మీద నీళ్లొలికించే అలారాన్ని చదువుకునే రోజుల్లోనే తయారు చేశారు. అది మొదలు.. వ్యవసాయంలో తనకు ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ఒకటి తర్వాత మరొకటిగా అనేక యంత్రాలను తయారు చేసుకున్నారు. తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి హాని జరగకుండా ఉండే సాగు పద్ధతులను అనుసరిస్తుంటారు.
చింతలు తీర్చిన చింతపండు
తండ్రి ఆయనకు 60 ఎకరాల సాగుభూమి ఇచ్చారు. 1985లో కరువు ముంచుకొచ్చిన తర్వాత మామిడి తదితర పండ్ల తోటలూ చనిపోవటంతో దిక్కు తోచలేదు. భగర్భ జలాల్లో క్షార గుణం అధికంగా ఉంది. అయినా, కొన్ని ఎకరాల్లో చింత మొక్కలు (వరుసల మధ్య 20 అడుగుల ఎడం) నాటారు. ప్రయోగం ఫలించడంతో మొత్తం 16 ఎకరాల్లో 1800 చింత తోపును సాగు చేస్తున్నారు. తొలుత చింత పండును అమ్మేవారు. చింతపండు నాణ్యత చెడిపోకుండా నిల్వచేసేందుకు భూగర్భ గదుల వ్యవస్థను కనుగొన్నారు. ఆ తర్వాత పచ్చళ్లు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. చింతపండు కోయటం, గింజలు తీయడం కష్టతరమై ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి 1994లోనే రూ.3 లక్షల ఖర్చుతో 6 నెలలు శ్రమపడి చింత పిక్కలు తీసే యంత్రం తయారు చేశారు. గింజలు తీసిన చింతపండును పచ్చళ్ల కోసం ముక్కలు చేయడంలో కష్టాన్ని, ఖర్చును తగ్గించడం ఎలా? అని ఆలోచించి పాత యంత్రాన్ని విజయవంతంగా మెరుగుపరిచారు. ఇలా.. తనకు అవసరమైన ప్రతి పనికీ ఉపయోగపడే యంత్రం తయారు చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది.
5 పనులు చేసే టిల్లర్..
వార్షిక పంటల్లో ఒకేసారి 5 పనులు చేసే టిల్లర్‌ను ఇటీవలే అబ్దుల్ ఖాదర్ తయారు చేశారు. పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు వేయటంతోపాటు కలుపుతీత, లోతు దుక్కి చేయడం వంటి పనులను ఇది ఏకకాలంలో చేస్తుంది. ట్రాక్టర్‌తో రోజుకు 20-25 ఎకరాల్లో పనిని పూర్తి చేయడానికి ఈ టిల్లర్ ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు.
మరెన్నో ఆవిష్కరణలు..
సాధారణ రోటోవేటర్ కన్నా పది రెట్లు వేగంగా 5వేల ఆర్పీఎం వేగంతో తిరిగే రోటోవేటర్ ను రూపొందించారు. దీన్ని ఉపయోగించడం వల్ల తన పొలంలో మిర్చి దిగుబడి రెండేళ్లలో ఎకరానికి 3 క్వింటాళ్ల నుంచి 9 క్వింటాళ్లకు పెరిగిందని ఆయన తెలిపారు.
మహారాష్ట్ర రైతుల కోరిక మేరకు 6 నెలల్లో చెరకు విత్తే ఆటోమేటిక్ డ్రిల్లర్ పరికరాన్ని రూపొందించారు. చిన్న రైతుల కోసం చెరకు నరికే
యంత్రాన్ని రూపొందించబోతున్నానన్నారు.
దుక్కి దున్నే ట్రాక్టర్ల కోసం 20 ఏళ్లు మన్నే ఇనుప చక్రాలను రూపొందించారు. దుక్కి చేసే ట్రాక్టర్ డీజిల్‌ను ఆదా చేయడానికి ఉపయోగపడే వీల్ టిల్లర్‌ను రూపొందించారు. స్నానానికి నీటిని వేడి చేసి, 24 గంటలపాటు నీటిని వేడిగా ఉంచే మల్టీ స్టేజ్ హీటింగ్ యంత్రాంగంతో కూడిన బాయిలర్‌ను రూపొందించారు... ఇలా ఆయన సృజనాత్మక ఆవిష్కరణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రయోగాల కోసం కొంత మేరకు పొలాన్ని కూడా అమ్ముకున్నా తనకేమీ బాధగా లేదంటారు అబ్దుల్ ఖాదర్. సునిశిత పరిశీలన, సృజనాత్మకత, సమస్యలను అధిగమించాలన్న తపన.. ఆయనను దేశంలోనే అద్భుతమైన రైతు శాస్త్రవేత్తగా నిలబెట్టాయి.
చిరునామా: అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్, విశ్వశాంతి అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్, హోర్కెరి స్ట్రీట్, అన్నిగెరి, నవల్‌గుండ్ తాలూకా, ధార్వాడ్ జిల్లా, కర్ణాటక. పిన్ 582201. మొబైల్ : 094487 86350 (ఉ. 10 గం. - సా. 5 గం. మధ్యలోనే.
ఆదివారం సెలవు).
ఈ మెయిల్ : sharifnadakattin@yahoo.in
సేకరణ: పంతంగి రాంబాబు
సాగుబడి డెస్క్