నిజాంసాగర్ : పశుగ్రాసాల్లో ధాన్యపు జాతి, పప్పుజాతి అని రెండు రకాలుంటాయి. జొన్నజాతికి చెందినవి ధాన్యపు జాతికి సంబంధించిన పశుగ్రాసాలు. వీటికి కాయలుండవు. కంకులుండడం వల్ల పిండిపదార్థాలు ఎక్కువగా లభిస్తాయి.
పప్పుజాతి పశుగ్రాసాల పంటలకు కాయలు కాస్తాయి. వీటిలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. వీటి వేర్లలోని నత్రజని, బుడిపెల వల్ల నేలలో నత్రజని పెరిగి భూమి సారవంతం అవుతుంది.
ఏడాది పొడవునా..
డెయిరీ ఫాంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నవారు కాలంతో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా పశుగ్రాసాలను సాగు చేయాలి. అప్పుడే పాడి పశువులకు పోషకాలు అంది, పాలదిగుబడులు పెరుగుతాయి. పాలల్లో వెన్నశాతం బాగుంటుంది.
ఐదు ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాన్ని సాగు చేస్తే 20 పాడి పశువులకు సరిపడా మేత ఏడాది పొడవునా లభిస్తుంది.
నీటి వసతి ఉన్న భూముల్లో ఏపీబీఎన్-1, కొ1 పారావంటి ధాన్యపు జాతి, లూసర్న్ వంటి పప్పుజాతి బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేస్తే మూడు నాలుగేళ్ల వరకు పశుగ్రాసం తిప్పలు ఉండవు.
వర్షాధారంగా తేలికపాటి భూముల్లో ఎస్‌ఎస్‌జీ-59-3 రకం ధాన్యపు జాతి, అలసంద, పిల్లిపెసర వంటి పప్పుజాతి ఏకవార్షిక పశుగ్రాసాలను మిశ్రమపంటలుగా సాగు చేసుకోవచ్చు.
అలసంద
జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈ పశుగ్రాసాన్ని పండించవచ్చు. ఇది ఏకవార్షిక, కాయజాతి పశుగ్రాసం. ఇది తీగలాగా పైకి వస్తుంది. కాండం పొడవుగా ఉంటుంది. పశువులకు పుష్టికరమైన ఆహారంగా ఉపయోగపడుతుంది.
అనువైన భూములు : అన్నిరకాల భూముల్లో సాగుచేసుకోవచ్చు. నీరు నిలవని భూముల్లో ఈ పశుగ్రాసాన్ని సాగు చేసుకుంటే మంచిది.
అధిక దిగుబడినిచ్చే రకాలు : ఈసీ -4216, యూపీసీ-5286, 5287, అలసంద- 2201, ఎన్‌పీ-3
విత్తనాలు : ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. మిశ్రమ పంటగా ఈ పశుగ్రాసాన్ని సాగు చేస్తే 6 నుంచి 8 కిలోల విత్తనాలు సరిపోతాయి.
కావాల్సిన ఎరువులు : విత్తనాలు వేసేముందు దుక్కిలో ఎకరానికి పది బండ్ల కంపోస్ట్ ఎరువు, పది కిలోల యూరియా, 20 నుంచి 24 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేయాలి.
నీటితడి : పదిహేను రోజులకోసారి నీటితడి అవసరం. వర్షాలు కురిస్తే నీరు పారించకపోయినా పరవాలేదు. వేసవిలో ఏడు రోజులకోసారి నీటిని పెట్టాలి.
మేత దిగుబడి : విత్తిన రెండు నెలల తర్వాత మొదటి కోత అందుతుంది. పూతదశలో ఉండగా పంట యాభై శాతం కోయాలి. ఎకరానికి 8-10 టన్నుల పచ్చిమేత లభిస్తుంది.
సజ్జ
తక్కువ వర్షపాతం గల ప్రాంతాలకు అనువైన పశుగ్రాసం ఇది. తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే ధాన్యపుజాతికి చెందినది. జొన్న రకాలకన్నా అధిక శాతం మాంసకృతులు కలిగి ఉంటుంది.
అనువైన నేలలు : అన్నిరకాల నేలలు ఈ పంట సాగుకు అ నువైనవి. ఇసుక, చవుడు నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు.
అధిక దిగుబడినిచ్చే రకాలు: టీ-55, కే-599, 533, ఐ-72, 74, జెంట్‌రాజ్‌కో 5-530.
విత్తనాలు : ఎకరానికి 4-6 కిలోల విత్తనాలు అవసరం.
మొక్క అంతరం : భూమిలో మూడు సెంటీమీటర్లకన్నా లోతులో విత్తనాలు వేయకూడదు.
మొక్కకు మొక్కకు మధ్య 4 నుంచి 5 అంగుళాలు, సాళ్ల మధ్య 9 నుంచి 10 అంగుళాల అంతరం ఉండాలి.
అనువైనకాలం : జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు
కావాల్సిన ఎరువులు : దుక్కిలో ఎకరానికి 8 నుంచి 10 బండ్ల కంపోస్ట్ ఎరువులు వేయాలి. విత్తే ముందు 22 కిలోల యూరియా, 20 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపి చల్లాలి. విత్తిన తర్వాత 25 నుంచి 30 రోజులకు 20 కిలోల యూరియా వేయాలి.
నీటితడి : వర్షకాలంలో(వర్షాలు కురుస్తున్నప్పుడు) నీరు పారించాల్సిన అవసరం లేదు. వేసవి కాలంలో 10నుంచి 15 రోజులకు ఒకసారి నీటి తడిపెట్టాలి.
మేత దిగుబడి : విత్తిన 60 నుంచి 70 రోజులకు మొదటిసారి, తదుపరి 40, 45 రోజులకు రెండోసారి కోయవచ్చు. ఎకరానికి 12 నుంచి 14 టన్నుల పచ్చిమేత లభిస్తుంది.
‘పాడి’కోసం పశుగ్రాసం..
Published Tue, Aug 19 2014 2:10 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM
Advertisement
Advertisement