
నాన్నకో ముద్దా...
అలికి ముగ్గు పెట్టి పీటేసి ఆకేసి పప్పేసి, కూరేసి, అన్నం పెట్టి అంటూ నాన్నలు అన్నం తినిపించే ఉంటారు... రేపు ఫాదర్స్ డే ...
చిన్నప్పుడు అన్నం తినకుండా పిల్లలు మారాం చేస్తుంటే...
అమ్మకు కూడా లొంగకుండా ఏడుస్తుంటే...
వారిని ఎత్తుకుని సముదాయించి...
అలికి ముగ్గు పెట్టి పీటేసి ఆకేసి పప్పేసి, కూరేసి, అన్నం పెట్టి
అంటూ నాన్నలు అన్నం తినిపించే ఉంటారు...
రేపు ఫాదర్స్ డే ...
ఈ రోజు మీరే వంటింటికి అధికారులు కండి...
ఈ మెనూ పక్కన పెట్టుకొని వంటలు తయారుచేయండి...
నాన్నను అన్నానికి రమ్మనండి...
నా ముద్ద, అక్క ముద్ద, పిన్ని ముద్ద, బాబయ్య ముద్ద, నానమ్మ ముద్ద...
అంటూ బోలెడు కబుర్లు చెబుతూ... నాన్నకి గోరుముద్దలు తినిపించండి...
అన్నం తిన్నాక నాన్నకి కిళ్లీ కూడా ఇవ్వండి...
ఆ తరవాత సరదాగా చిన్నచిన్న బహుమతులు అందజేయండి...
నాన్న ప్రేమను మనసారా ఆస్వాదించండి...
రోస్టెడ్ కాజూ
కావలసినవి
జీడిపప్పు పలుకులు - కప్పు; నెయ్యి - టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; కారం - కొద్దిగా; ఉప్పు - తగినంత; పంచదార - చిటికెడు
తయారీ:
ఒక బాణలిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పులు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి
ఉప్పు, కారం పంచదార, మిరియాల పొడి వేసి బాగా కలపాలి
బాణలి కిందకు దించి చల్లారనివ్వాలి
వీటిని గాలి చొరని డబ్బాలో ఉంచితే సుమారు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి.
అర్బీ కా సాగ్
కావలసినవి:
చేమదుంపలు - అర కేజీ; ఆవాలు - పావు టీ స్పూను; కారం - ముప్పావు టీ స్పూను; నిమ్మరసం - ముప్పావు టీ స్పూను; ధనియాల పొడి - అర టీ స్పూను; పసుపు - చిటికెడు; నూనె - కప్పు; ఉప్పు - రుచికి తగినంత; వాము - అర టీస్పూను.
తయారీ:
ముందుగా చేమదుంపలను ఉడకబెట్టి, చల్లారాక తొక్కు తీసి చక్రాలుగా కట్ చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నూనె పోసి కాగాక చేమదుంప ముక్కలు వేసి కరకరలాడేలా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి
బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, వాము వేసి వేయించాలి
వేయించి ఉంచుకున్న చేమదుంప ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, నిమ్మరసం ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా కలిపి దించేయాలి
నాన్నకు కరకరలాడే కూర సిద్ధమైనట్లే.
గ్రీన్ టీ
కావలసినవి:
గ్రీన్ టీ పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు; నీళ్లు - కప్పు; పంచదార లేదా తేనె - రుచికి తగినంత
తయారీ:
ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి మరిగించాలి
నీళ్లు మరగ్గానే స్టౌ ఆపేసి గ్రీన్ టీ పొడి వేయాలి
రెండు మూడు నిమిషాలయ్యాక, మరో కప్పులోకి టీ వడపోసి, పంచదార లేదా తేనె వేసి కలిపి వేడివేడిగా అందించాలి
నాన్న నిద్రలేవగానే ముందుగా ఈ ఆరోగ్యకరమైన టీ అందించండి.
ఖట్టీ మీఠీ దాల్
కావలసినవి
కందిపప్పు - అర కప్పు; టొమాటో తరుగు - అరకప్పు; పల్లీలు - పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; కారం - తగినంత; అల్లం తురుము - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; పంచదార లేదా బెల్లం - ఒక టేబుల్ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నిమ్మరసం - టేబుల్ స్పూన్; ఆవాలు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; మెంతులు - పావు టీ స్పూను; నెయ్యి లేదా నూనె - రెండు టేబుల్ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు -తగినంత
తయారీ:
కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దింపాలి
చల్లారాక, గరిటెతో మెత్తగా మెదపాలి బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వరుసగా వేసి బాగా వేయించాలి
అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి
టొమాటో తరుగు, పల్లీలు వేసి బాగా కలిపి, ఈ మిశ్రమం మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి
ఉడికించిన కందిపప్పు, పసుపు, ఉప్పు, కారం, బెల్లం తురుము వేసి సుమారు కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి పది నిమిషాలు ఉంచాలి
పప్పు బాగా చిక్కబడిన తర్వాత కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి దించేయాలి
నాన్నకు అన్నంలో పప్పు, నెయ్యి వేసి కమ్మగా గోరుముద్దలు పెట్టండి.
మేతీ పోహా
కావలసినవి:
అటుకులు - 2 కప్పులు; మెంతి కూర - కప్పు; ఉల్లితరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెండు రెమ్మలు; నిమ్మ రసం - టేబుల్ స్పూను; పల్లీలు - పావు కప్పు; పసుపు - అర టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; సెనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె -టేబుల్ స్పూను
తయారీ:
ఒక గిన్నెలో నీళ్లు పోసి, అందులో అటుకులు వేసి, శుభ్రంగా కడిగి నీరు తీసేసి పక్కన ఉంచాలి
బాణలిలో టేబుల్ స్పూను నూనె కాగాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి
పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి
మెంతికూర, పసుపు వేసి బాగా కలపాలి
అటుకులు, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి
నిమ్మరసం వేసి కలిపి పళ్లెంలో ఉంచి నాన్న నోటికి అందించండి.
ఆమ్ రస్
కావలసినవి:
మామిడిపండ్లు - రెండు (మీడియం సైజు); పంచదార - 4 టేబుల్ స్పూన్లు; పాలు - 4 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను
తయారీ:
ముందుగా మామిడిపండ్ల తొక్కు తీసి ముక్కలు తరగాలి
మిక్సీలో మామిడిపండు ముక్కలు, పాలు, పంచదార, ఏలకుల పొడి వేసి మెత్తగా అయ్యేవరకు తిప్పాలి
ఈ జ్యూస్‌ని చిన్న చిన్న పాత్రలలో పోసి ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడ్డాక బయటకు తీయాలి
వేడి వేడి పూరీలు, దోసెలు, చపాతీలతో కలిపి అందించాలి.