ఇంటిపంటల సాగు.. ఇతరులకూ తోడ్పాటు!
ఇంటిపంటల సాగులోని సౌలభ్యాన్ని చె న్నై ఐనవరానికి చెందిన వీరలక్ష్మి సూక్ష్మంగా గ్రహించారు. ఆమె భర్త శివకుమార్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ కంపెనీ నడుపుతున్నారు. వీరలక్ష్మి ఇంటిపనులను పూర్తిచేసిన తరువాతి మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. అంతేకాదు మరో 20 కుటుంబాలకు ఇంటిపంటను నేర్పించారు. వారానికి ఒక రోజు వారిళ్లకు వెళ్లి పంటలను పర్యవేక్షిస్తూ.. తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు.
టమోటా, మిరప కాయలు, పొట్లకాయ, నిమ్మకాయ, ముల్లంగి, గుమ్మడికాయ, కొత్తిమీరి, ఆకుకూరలను నాలుగేళ్లుగా తమ మేడపైనే పండిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడరు. వర్మీ కంపోస్టు, పంచగవ్యలను వినియోగిస్తున్నారు. పంచగవ్యను ఇంటి దగ్గర తానే తయారు చేసుకుంటున్నారు. వాతావరణానికి అనుకూలంగా పంటలను రొటేషన్ చేయడం ద్వారా అన్ని నెలల్లో వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలను అందుబాటులో ఉంచుకుంటున్నారు. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చి మొక్కలు ఏపుగా పెరిగేందుకు వినియోగిస్తున్నారు.
మంచి వ్యాయామం..!
‘మిద్దెపైన మొక్కలను పెంచడం వల్ల సేంద్రియ కూరలతోపాటు వ్యాయామమూ లభిస్తుంది. ఇల్లు చల్లగా ఉంటుంది. మానసిక వత్తిడి దూరమవుతుంది. స్నేహితులు, బంధువులను కూడా ప్రోత్సహించి టై కిచెన్ గార్డెన్స్ పెట్టించడం, అప్పుడప్పుడూ వెళ్లి వాటి బాగోగులు చూడటం సంతృప్తిగా ఉంది’ అన్నారు వీరలక్ష్మి.
- సాక్షి ప్రతినిథి, చెన్నై
దేశీ విత్తన సంబరం
విజయవాడలో జూలై 12-13 తేదీల్లో దేశీ / సంప్రదాయ విత్తన సంబరం జరగనుంది. ఆటోనగర్ గేటు సమీపంలోని ఎగ్జిబిషన్ సొసైటీ హాల్‌లో రైతుల మధ్య తమిళనాడు తరహాలో సంప్రదాయ విత్తన మార్పిడి జరుగుతుందని హరిత భారతి ట్రస్టు బాధ్యులు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 81065 66828, 0866 2550688 నంబర్లలో సంప్రదించవచ్చు.
అర్బన్ పర్మాకల్చర్‌లో శిక్షణ
పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటల సాగుపై హైదరాబాద్‌లో ఆగస్టు 15, 16 తేదీల్లో అర్బన్ పర్మాకల్చర్ సదస్సు జరగనుంది. ‘గార్డెన్స్ అఫ్ అబండెన్స్’ బృందం ఆధ్వర్యంలో నిపుణులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 99514 52345 నంబరులో సంప్రదించవచ్చు.
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్‌స,6-3-249/1,
రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034
saagubadi@sakshi.com