కుసుమ విత్తుకునే సమయం సెప్టెంబర్ రెండో పక్షం నుంచి అక్టోబర్ మొదటి పక్షం వరకు.
కుసుమ విత్తుకునే సమయం సెప్టెంబర్ రెండో పక్షం నుంచి అక్టోబర్ మొదటి పక్షం వరకు. అయితే వర్షాలు ఆలస్యమైన ప్రాంతాల్లో, నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో నవంబర్ మొదటి పక్షం రోజుల్లోపు విత్తుకుంటే మంచిది. పంట కాలంలో వాతావరణంలో తక్కువ తేమతోపాటు అల్ప ఉష్ణోగ్రతలు పంట ఎదుగుదలకు దోహదం చేస్తాయి. కుసుమను శనగ లేదా ధనియాలతో 1:2 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేస్తే అధిక నికరాదాయాన్ని పొందవచ్చు.
ఈ నేలలు అనుకూలం..
నీరు నిల్వని, బరువైన, తేమను నిల్వ చేసుకునే నల్లరేగడి, నీటి వసతి ఉన్న ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఫ్యుజేరియం ఎండుతెగులు ఎక్కువ ఆశించే అవకాశం ఉన్నందున ఆమ్లత్వం ఉన్న భూములు పనికిరావు. కొద్దిపాటు క్షారత్వాన్ని కుసుమ పంట తట్టుకుట్టుంది.
దుక్కి తయారీ ఇలా..
రబీలో ఏకపంటగా వేసుకునేటప్పుడు నాగలి, ట్రాక్టర్‌తో గాని లోతుగా దున్నుకొని, ఆ తర్వాత రెండు మూడుసార్లు గుంటకలను తోలుకున్నట్లైతే కలుపును నివారించి, భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. కుసుమను స్వల్పకాలిక ఖరీఫ్ అపరాల తర్వాత వేసుకునేప్పుడు, ఖరీఫ్ పంటను కోసిన అనంతరం పైపైన రెండుసార్లు గుంటకలను తోలి కలుపు లేకుండా చూసుకోవాలి.
విత్తనం, విత్తే పద్ధతి..
ఎకరానికి 4 కిలోలు (పూర్తి పంటకు), 1.5 కిలోలు (అంతరపంటకు) విత్తనాన్ని గొర్రుతో గాని, నాగటి సాళ్లలో గాని విత్తుకోవచ్చు. విత్తనాన్ని 5 సె.మీ.లోతులో విత్తుకోవాలి. విత్తనం ఎక్కువ లోతులో పడితే మొలక శాతం తగ్గుతుంది. నేలలో తేమను బట్టి, విత్తిన లోతును బట్టి 4 నుంచి 7 రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది.
రకాలు..
టీఎస్‌ఎఫ్-1, మంజీర, సాగర్ ముత్యాలు (ఏపీఆర్‌ఆర్-3), నారి-6, పీబీఎన్‌ఎస్-12, జేఎస్‌ఎఫ్-414 (ఫూలె కుసుమ), డీఎస్‌హెచ్-129, నారి ఎన్‌హెచ్-1 రకాలన్నీ రబీ కాలానికి అనుకూలం. విత్తే దూరం- వరుసల మధ్య 45 సె.మీ. లేదా వరుసలలో మొక్కల మధ్య 20 సె.మీ.
ఎరువులు..
వర్షాధారపు పంటకు ఎకరానికి 16 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం విత్తనంతోపాటు దుక్కిలో వేసుకోవాలి. నీటి వసతి కింద కుసుమను సాగు చేసుకున్నట్లయితే, సిఫారసు చేసిన నత్రజనిలో 50శాతం లేదా పూర్తి భాస్వరాన్ని దుక్కిలో వేసుకోవాలి. మిగితా 50 శాతం నత్రజనిని 5 వారాల తర్వాత మొదటి తడి కట్టేటప్పుడు పైపాటుగా వేసుకోవాలి.
భాస్వరాన్ని సింగిల్ సూపర్‌ఫాస్ఫేట్ రూపంలో వేసినట్లయితే దానిలోని గంధకం వల్ల నూనె దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. జీవన ఎరువైన లజోస్పైరిల్లమ్ 25 గ్రా.తో ఒక కిలో విత్తనాన్ని శుద్ధి చేసినట్లయితే, ఎకరాకు 8 కిలోల నత్రజని ఆదా చేసుకోవచ్చు. 45 కిలోల గంధక మూలకాన్ని సింగిల్ సూపర్‌ఫాస్ఫేట్ దూపంలో వేసుకున్నట్లయితే అధిక గింజ దిగుబడిని, నూనె శాతాన్ని సాధించవచ్చు. శాఖీయ ఎదుగుదలను అదుపు చేసే హార్మోను అయిన ‘సూకోసిల్’ను 1000 పీపీ ఎం మోతాదులో 50శాతం పూత దశలో పిచికారీ చేసుకోవడం వల్ల గింజ దిగుబడిని అధికంగా సాధించే అవకాశం ఉంది.
నీటి యాజమాన్యం..
బరువైన నేలల్లో పంటకు నీటి తడి ఇవ్వాల్సిన అవసరం లేదు. తేలిక నేలల్లో ఒకటి, రెండు నీటి తడులు అవసరం. రకాన్ని బట్టి లేదా నేలలో తేమను బట్టి కుసుమలో పూత 65 నుంచి 75 రోజులకు వస్తుంది. వర్షాభావ పరిస్థితులల్లో కీలక దశలైన కాండం సాగే దశ (30 నుంచి 35 రోజులకు) లేదా పూత దశ (65 రోజుల నుంచి 75 రోజులకు)లలో ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు 40-60శాతం పెరిగే అవకాశం ఉంటుంది.
కలుపు నివారణ/అంతరకృషి
విత్తిన 20-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25 రోజులకు లేదా 40-50 రోజులకు దంతులు తోలి అంతరకృషి చేసుకోవాలి. దీని వల్ల కలుపును నివారించడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. విత్తిన వెంటనే అలాక్లోర్ 50శాతం లేదా పెండిమిథాలిన్ 30శాతం ఎకరాకు లీటరు చొప్పున ఏదో ఒక దానిని విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి. విత్తనం వేయకముందు ఫూక్లోరాలిన్ 1 కేజీ మూల పదార్ధంగా మందును 1 హెక్టారుకు భూమిలో కలియబెట్టడం వల్ల ముందుగా వచ్చే కలుపు ఉధృతిని తగ్గించుకోవచ్చును.
పేను తాకిడి.. నివారణ
కుసుమ పంటకు పేను తాకిడి చాలా ప్రమాదకరం. ఆలస్యంగా విత్తిన పంటపై (అక్టోబర్ రెండో పక్షంలో) దీని ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది విత్తిన 40-45 రోజుల నుంచి పంటను ఆశించి ఒక వారం రోజుల్లో ఇబ్బడిముబ్బడిగా సంతతిని పెంచుకుంటుంది. ఇది ఎక్కువగా లేతగా ఉండే మొవ్వు, చిగుళ్లు, ఆకు అడుగు భాగాలను ఆశించి రసం పీల్చడం వల్ల మొక్కలు వడలి ఎండిపోతాయి. ముళ్లులేని కుసుమ రకాలతో పేను తాకిడి అధికం. దీని నివారణకు డైమిథోయేట్ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6. మి.లీ. లేదా కోరిఫైరిఫాస్ 2.5. మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఆకుమచ్చ తెగులు.. నివారణ
ఈ తెగులు పూత మొదలయ్యే దశ (విత్తిన 60 రోజుల) నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య రుతుప్రభావం వల్ల డిసెంబరు- జనవరి నెలల్లో వర్షాలు కురవడం లేదా ఆకాశం మేఘావృతమై వాతావరణంలో తేమ 70శాతం మించినప్పుడు పూతదశలో ఉన్న పంటపై ఆశించి అధిక నష్టం చేస్తుంది.
ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో గుండ్రటి మచ్చలు ఏర్పడి ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోతాయి. నివారణకు మాంకోజెబ్ 2.5.గ్రా.లీటరు నీటికి కలిపి మచ్చలు కనిపించగానే ఒకసారి, 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేసుకోవాలి.