పేరు పెట్టింది.. నిజాం నవాబు
టేస్ట్ స్పెషలిస్ట్: తండ్రి చనిపోయే సమయానికి మహ్మద్ హుస్సేన్‌కి 15 ఏళ్లు. అతని తండ్రి నిజాం సైన్యంలో పనిచేసేవాడు. తండ్రి మరణానంతరం ఈ స్వీట్ షాప్ పెట్టాడాయన. కారణం తెలియదు కానీ... అది ‘వితవుట్ నేమ్’ స్వీట్‌షాప్. నేమ్ బోర్డ్ లేకపోయినా నిదానంగా ఆ స్వీట్‌షాప్ ప్రాచుర్యంలోకి రావడం మొదలైంది. దాని మిఠాయిలు ఇప్పుడు పాతబస్తీ కేంద్రంగా చవులూరిస్తున్నారుు.
పాలు, నెయ్యి, పంచదార, కుంకుమపువ్వు... మరికొన్ని కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన దినుసులు కలిపి తయారు చేసే జౌజిహల్వా ఇక్కడ సూపర్ ఫేమస్. దీన్ని కట్టెల పొయ్యి మీద తక్కువ మంటతో 8 నుంచి 10 గంటల దాకా వండుతారు. కొద్దిగా జౌజిహల్వా నోట్లో వేసుకుంటే దాని రుచి చాలా సేపు మన నోటిని వదలదు. ఇక ఇక్కడి కేసరి లడ్డూ రుచి అద్భుతం అంటారు స్వీట్‌లవర్స్. ఇలాంటి వినూత్న రుచులనే ఆధారం చేసుకుని ఈ స్వీట్‌షాప్ పేరు శరవేగంగా విస్తరించింది. ఆ పేరంటే గుర్తొచ్చింది. ఈ షాప్‌కి తర్వాతి కాలంలో పేరు కూడా పెట్టారు. అది కూడా నామకరణం చేసింది ఎవరనుకున్నారు! ఏకంగా నిజాం నవాబు.
దాని వెనుక ఓ చిన్న కథ ఉంది...
ఈ షాప్ పేరు ఆ నోటా ఈ నోటా విన్న నిజాం నవాబు సైతం ఈ స్వీట్‌షాప్‌ని విజిట్ చేశాడట. అక్కడ మిఠాయిలు రుచి చూశారట. అద్భుతం అన్నారట. అంతేకాకుండా అంత టేస్టీ స్వీట్స్ విక్రయించే షాప్ అలా పేరు లేకుండా ఉండడం నచ్చక... అలా తిరిగి వెళ్లాక ఆ షాప్‌ని అభినందిస్తూ పురస్కారం పంపడమే కాక తన పుత్రుల్లో ఒకరి పేరును ఆ షాప్‌కి పెట్టమని అభ్యర్థిస్తూ స్వయంగా ఒక ఉత్తరం కూడా రాశాడట. అలా ‘హమీది కన్ఫెక్షనర్స్’ పేరు బోర్డెక్కిందట.
నిజాం రాసిన ఉత్తరం, ఆయన పంపిన పురస్కారం ఆ షాప్‌లో మనకి ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. ‘మేం ప్రారంభించినప్పుడు (దాదాపు తొంభై ఎనిమిదేళ్ల క్రితం) ఇక్కడ ఈ షాప్ ఒక్కటే ఉండేది. దీనికి వచ్చిన ప్రాచుర్యంతో మరికొన్ని వెలిశాయి. మేం షాప్ పెట్టిన కొంత కాలానికి ఇక్కడ మొజంజాహి మార్కెట్ ప్రారంభమైంది’ అంటూ షాప్ నిర్వాహకులు పాషా చెప్పుకొచ్చారు.
- సంకల్ప్