ఇప్పుడు ఆముదం వేసుకోవచ్చు | Now, Right season to plant Mustard seeds | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ఆముదం వేసుకోవచ్చు

Published Fri, Aug 8 2014 11:31 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

ఇప్పుడు ఆముదం వేసుకోవచ్చు - Sakshi

పాడి-పంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా మంది రైతులు ఇప్పటికీ ఆముదం విత్తనాలు వేసుకోలేదు. అలాంటి వారు ఈ నెలాఖరు వరకూ పంట వేసుకోవచ్చునని పరిష్కారం కాల్ సెంటర్ కో-ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత (వీరిని తెలంగాణ రైతులు 1800-425-1110, ఆంధ్రప్రదేశ్ రైతులు 1800-425-4440 మొబైల్ ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సంప్రదించవచ్చు) సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాలు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులకు ఈ అవకాశం ఉంది.
 
 అనువైన నేలలు-రకాలు
 ఆముదాన్ని రెండు రాష్ట్రాలలోనూ మెట్ట పంటగా సాగు చేస్తున్నారు. మెట్ట సాగులో నేలల ఎంపికే కీలకం. ఆముదాన్ని అన్ని రకాల నేలల్లోనూ వేసుకోవచ్చు. అయితే మురుగు నీరు బయటికి పోయే సదుపాయం లేని నేలలు, చౌడు నేలలు పనికిరావు. ఆముదం సాగుకు సూటి రకాలైన జ్యోతి, క్రాంతి, జ్వాల, కిరణ్, హరిత అనువుగా ఉంటాయి. నీటి పారుదల సౌకర్యం ఉన్న వారు సంకర రకాలైన జీసీహెచ్-4, డీసీహెచ్-177, 519, పీసీహెచ్- 222, 111 రకాలను వేసుకోవచ్చు. సూటి రకాలైతే ఎకరానికి 2-2.5 కిలోలు, సంకర రకాలైతే 2 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తనాలు వేసుకోవాలి.
 
 విత్తనశుద్ధి తప్పనిసరి
 చీడపీడల బారి నుంచి ఆముదం పంటను కాపాడుకునేందుకు విత్తనాలను విధిగా శుద్ధి చేయాలి. కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్/కాప్టాన్ పట్టించాలి. దీనివల్ల మొలకకుళ్లు, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లను పూర్తిగానూ, వడలు తెగులును కొంత వరకూ నివారించవచ్చు. వడలు తెగులు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 3 గ్రాముల కార్బండజిమ్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడె కలపాలి.
 
 ఎరువుల యాజమాన్యం
 ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. విత్తనాలు వేసేటప్పుడు ఎకరానికి 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌ను అందించే ఎరువులు వేయాలి. విత్తిన 30-35 రోజులకు, 60-65 రోజులకు 6 కిలోల చొప్పున నత్రజనిని అందించే ఎరువును పైపాటుగా వేసుకోవాలి. సంకర రకాలు వేసే వారు విత్తనాలు విత్తిన 90-95 రోజులకు మరో 6 కిలోల నత్రజనిని అందించే ఎరువు వేయాలి.
 
 తొలి దశలో కలుపు బెడద
 ఆముదం పంటకు తొలి దశలో కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విధిగా కలుపు నివారణ మందులు పిచికారీ చేయాలి. విత్తిన 24-48 గంటల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1-1.25 లీటర్ల పెండిమిథాలిన్ (స్టాంప్/పెండిగార్డ్/పెండిస్టార్) లేదా అలాక్లోర్ (లాసో/అలాటాప్) కలిపి తేమ నేలపై పిచికారీ చేయాలి. విత్తనాలు వేసిన 15-20 రోజుల మధ్య ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల క్విజలాఫాప్-పి-ఇథైల్ (టర్గా సూపర్) లేదా 250 మిల్లీలీటర్ల ప్రొపాక్విజాఫాప్ (ఎజిల్) కలిపి పిచికారీ చేసుకుంటే గడ్డి జాతి కలుపు మొక్కలు నశిస్తాయి.
 
 అంతరపంటలూ వేయొచ్చు
 ఆముదంలో అంతరపంటలు కూడా వేసుకోవచ్చు. ఆముదంలో కందిని 1:1, బొబ్బర్లను 1:2, మినుమును 1:2, వేరుశనగను 1:5, గోరుచిక్కుడును 1:2, ఉలవలను 1:8 నిష్పత్తిలో ఆయా ప్రాంతాలలోని పరిస్థితులను బట్టి అంతరపంటగా వేసుకునే అవకాశం ఉంది.
 
 ఇప్పటి నుంచే...
ఆముదం పైరు మొలిచిన వెంటనే ఎర్ర గొంగళి పురుగుల తాకిడి మొదలవుతుంది. ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తింటాయి. పురుగులు ఎదిగే కొద్దీ ఆకుల మీద రంధ్రాలు చేస్తూ కాడలు, ఈనెలు, లేత కొమ్మలను మాత్రం మిగులుస్తాయి. ఎదిగిన పురుగుల నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. దాసరి/నామాల పురుగులు ఆగస్ట్ నుంచే పైరుపై దాడి చేస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగులు లేత కొమ్మలు, కాడలు, పూలు, పెరిగే కాయలను తినేస్తాయి.
 
 వీటి నివారణకు తొలి దశలో లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేపనూనె లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్/థయోడికార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా ఒక మిల్లీలీటరు నొవాల్యూరాన్ చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేలా పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగుల తాకిడి కూడా ఆగస్ట్ నుంచే మొదలవుతుంది. ఇవి తొలి దశలో గుంపులు గుంపులుగా ఆకుల కిందికి చేరి పత్రహరితాన్ని గోకి తింటాయి. దీంతో ఆకులు జల్లెడాకులుగా మారతాయి. తొలి దశలో లద్దె పురుగుల నివారణకు లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేపనూనె లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పురుగు మధ్యస్థ దశలో ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ఎసిఫేట్/ప్రొఫెనోఫాస్/థయోడికార్బ్ మందును లీటరు నీటికి 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఒక మిల్లీలీటరు ఇండాక్సాకార్బ్/నొవాల్యూరాన్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement