విప్లవ సాహిత్యంలో మెరుపుతీగ కాశీపతి | Amar opinion on kashipathi | Sakshi
Sakshi News home page

విప్లవ సాహిత్యంలో మెరుపుతీగ కాశీపతి

Published Sun, Aug 14 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

Amar opinion on kashipathi

సందర్భం

విప్లవోద్యమ ప్రభావానికి లోనయిన యాభై ఏళ్ళ వయస్సు వాళ్ళందరిలో కాశీపతి గురించి ఎరుగని వాళ్లుండరు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంలో పయనించిన అసంఖ్యాకుల్లో ‘‘ఉయ్యాలో జంపాల/ఈ దోపిడి కూలదొయ్యాల’’ అనే పాటని వినని వాళ్ళుండరు. లక్షలాది మందిని కట్టిపడేసే ఆయన ఉపన్యాసం గురించి చెవులు కోసుకోని వాళ్ళుండరు. దాదాపు ఇలాంటి ఎన్నో లక్షణాలు పుణికిపుచ్చుకున్న కాశీపతిని ఎమర్జెన్సీ ఎత్తేసిన కొత్తలో సిరిసిల్ల సభలో మొట్టమొదటిసారిగా చూశాను. 1977లో మొదలైన ఈ బంధం అనేక ఆటుపోట్ల మధ్య చెదర కుండా ఆయన ‘మద్య తరగతి మందుహాసం’లో ముందు మాటగా భాగం పంచుకునేదాకా సాగింది. ఎక్కడో అనంతపురం పట్టణంలో బ్రాహ్మణ ఉన్నతవర్గంలో జన్మించిన కాశీపతికి, వేములవాడలో పెద జాలరి కుటుంబంలో పుట్టిన నాకు విప్లవోద్యమమే బంధం వేసింది. పలురకాల వ్యాధులతో ఆగస్టు 11, 2016న కామ్రేడ్ కాశీపతి అంతిమ శ్వాస వదలడంతో కూడా ఈ అనుబంధం ముగిసిపోలేదు.

చరిత్ర నిర్మాతలు ప్రజలే అయినా విప్లవ నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి కూడా లెనిన్ ప్రాధాన్యతనిచ్చాడు. అందుకే చరిత్రలో వ్యక్తుల క్రియాశీల పాత్రను, మననం చేసుకుంటూ వారి పరిమితులను మననం చేసుకోక తప్పదు. వారి పరిమితులను విశ్లేషించక తప్పదు. నక్సల్బరి తర్వాత కల్లోల విప్లవ దశాబ్దంలో తెలుగునేల అందించిన విప్లవ ఆణిముత్యాల్లో యాధాటి కాశీపతి ఒకరు. సీపీఎం నుంచి తెగతెంపులు చేసుకున్న ఆంధ్ర విప్లవ కమ్యూనిస్టుల సాంగత్యంలో, చండ్రపుల్లారెడ్డి సాన్నిహిత్యంలో విజయ వాడలో కేంద్రంగా ‘జనశక్తి’ పత్రిక నిర్వహ ణలో భాగం కావడానికి, ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. విప్లవోద్యమానికి ప్రతి బింబంగా వెలువడే విప్లవ సాహిత్యం తిరిగి విప్లవోద్యమాన్ని భావప్రచారంతో తాత్వికంగా అభివృద్ధి చేసే క్రమంలో ఏర్పడ్డ విరసం వ్యవ స్థాపకుల్లో ఒకరుగా నిలిచారు. పౌర-ప్రజా స్వామిక హక్కుల అంశాన్ని ప్రజా సాంస్కృతిక సేన అవసరాన్ని ఎజెండా మీదకు తీసుకురావ డంతో పాటు వాటి నిర్మాణంలోనూ కీలక పాత్ర వహించాడు. విరసం, పౌరహక్కుల సంఘాలు తెలుగునేలపై ఎన్నెన్నో శక్తులు కలసి పనిచేసే ఉమ్మడి వేదికలుగా ఉండేవి. వీటిని మరింత విశాలంగా అభివృద్ధి చేయాలని పలు ఆంతరంగిక వేదికల్లో కాశీపతి పోరా డేవారు. ఇలాంటి విప్లవ స్ఫూర్తితోనే విమోచన పత్రిక బాధ్యతలు నిర్వర్తించడం చేశాడు.

మార్క్సిస్టు తత్వశాస్త్రం, అర్థశాస్త్రం, దేశీయ-అంతర్జాతీయ పరిస్థితులపై శిక్షణ నెరుపగల నిష్ణాతులు పాటల సాహిత్య సృష్టి చేయడం చాలా అరుదు. కానీ కాశీపతి రాసిన ఎన్నో పాటలు స్థలకాలాదులకతీతంగా, శాశ్వతంగా నిలిచిపోయే స్థాయిని కలిగి ఉన్నాయి. ఈ స్థాయిలో చాలామంది కవిత్వానికి, కథలకు, సాహిత్య విశ్లేషణలకు పరిమి తంగావడం మనం చూస్తాము. పామరులను మెప్పించే పాటలతో పాటు మధ్యతరగతిని సైతం అలరించే ‘మద్య తరగతి మందుహాసం’కు సాహిత్యేతిహాసం అని ఆయన పేరు పెట్టారు. విప్లవోద్యమంలో మధ్యతరగతి పాత్ర, ఉద్రేకం, ఊగిసలాటలెన్నో మన కళ్లముం దున్నాయి. వాటన్నింటికీ కాశీపతి సైతం అతీతం కాదనే చరిత్ర సైతం మన ముందే ఉంది.  ఈ అనేక పరిణామాల్లో అంతర్గత-బహిర్గత కారణాలు కూడా మనం విస్మరించలేము.

గోదావరిలోయ ప్రతిఘటనోద్యమం తర్వాత ముందుకు వచ్చిన సిరిసిల్ల రైతాంగ పోరాటానికి దేశం నలుమూలల నుండి సంఘీభావం లభించింది. ఆ పోరాటానికి సంఘీ భావంగా కదిలివచ్చిన వాళ్ళల్లో కాశీపతి పాత్ర, మరిచిపోలేనిది. తీవ్రమైన రాజ్యహింస మధ్య 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ిసీపీఐ (ఎం.ఎల్) అభ్యర్థిగా సిరిసిల్ల నుండి కాశీపతి పోటీ చేశారు. తినడానికి తిండిలేని దరిద్ర నారాయణులతో పాటు పేగులన్నీ బిగపట్టి మంత్రాలు చదివే బ్రాహ్మణ పండితుల వరకు ఎంతో మందిని తన ఉపన్యా సాలతో ఒప్పించి, మెప్పించారు. ఈ ప్రాంతంలో గ్రామ, గ్రామం ఆయన ఉపన్యాసాలను, నాల్కపై తారాడే లెక్కలను విని చప్పట్లు కొట్టిన వాళ్ళే.

దీని తర్వాత విప్లవోద్యమంలో సంభవించిన మరికొన్ని చీలికలు, నైరాశ్య వాతావ రణంలో కొంతమంది ఊగిసలాటకు గురైనారు. కవిగా, రచయితగా, ప్రజా కార్యకర్తగా, అనంతపురం కోలార్ మైన్స్ యూనియన్ అధ్యక్షునిగా, అనంతపురం మున్సిపల్ కౌన్సి లర్, విప్లవ ప్రజాస్వామిక సంస్థల నిర్మాణ భాగస్వామిగా బహుముఖ పాత్ర నిర్వహించిన కాశీపతి జర్నలిస్టుగానూ పనిచేశారు. ఇతరత్రా బలహీనతలతో కొంతదూరం ప్రయాణిం చాడు. కానీ చివరి వరకు విప్లవ సాహిత్య వినీలాకాశంలో తళుక్కుమనే తారగా వెలుగొం దుతూనే ఉన్నాడు. ‘‘గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో’’ అన్న దాశరథి పద్యంలాగా కాశీపతి మన నుండి అర్ధంతరంగా సెలవు తీసుకున్నాడు. కాని ఆయన ప్రగతిశీల ఆలోచనలకు సెలవు లేదు.

వ్యాసకర్త: అమర్, జనశక్తి కార్యకర్త
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement