ప్రమాద ఘంటికలు!
నేలతల్లికి ఏదో అవుతోందని కొంతకాలంగా పర్యావరణవేత్తలు అనుమానిస్తున్నారు. ప్రకృతికి చేటుతెచ్చే స్థాయికి చేరుకున్న అభివృద్ధి నమూనాలను పునర్నిర్వచించుకుని సరి చేయకపోతే వరదలు, అధిక ఉష్ణోగ్రతలు, కరువు కాటకాలు మాత్రమే కాదు...భూకంపాల బెడద కూడా తప్పదని వారు తరచు చెబుతున్నారు. ఈమధ్య ఇండొనేసియా, జపాన్, ఈక్వెడార్‌లలో సంభవించిన భూకంపాల తీరుతెన్నులను గమనించిన భూభౌతిక శాస్త్రవేత్తలకు సైతం ఇప్పుడు ఈ మాదిరి సందేహాలే కలుగుతున్నాయి.
‘భూకంప క్రియాశీల దశలోకి భూమి చేరుకుని ఉండొచ్చునన్న భావన వారిలో ఏర్పడుతోంది. అయితే ఈ విషయంలో వెనువెంటనే స్పష్టమైన నిర్ధారణకు రావడం అంత సులభమేం కాదు. మిగిలిన ప్రకృతి వైపరీత్యాలతో పోలిస్తే భూకంపాల తీరే వేరు. మిగిలినవన్నీ ఏదో మేరకు సూచనలందిస్తాయి. మనం జాగ్రత్త పడటానికి కాస్తయినా వ్యవధినిస్తాయి. భూకంపాలు అలా కాదు. ఉన్నట్టుండి విరుచుకుపడతాయి. లిప్తపాటులో శిథిలాలను మిగులుస్తాయి. అపార ప్రాణనష్టానికి కారణమవుతాయి.
ఈ నెల 1న జపాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూ కంపం వచ్చింది. ఆ ఘటనలో ప్రాణ నష్టంగానీ, ఆస్తి నష్టంగానీ సంభవించలేదు. ఆ మర్నాడే దక్షిణ పసిఫిక్‌లోని వనౌతు ద్వీప సమూహంలో 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. 24 గంటల వ్యవధిలోనే మళ్లీ ఆ దేశం భూకంపం బారిన పడింది. ఈసారి తీవ్రత కాస్త తగ్గింది. అది 6.9కి పరిమితమైంది. ఈక్వెడార్‌లో ఈనెల 17న వచ్చిన భూకంపం అన్నిటికన్నా తీవ్రమైనది. రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపంవల్ల 272మంది ప్రాణాలు కోల్పోయారు.
భూకంపాల విషయంలో చాలా అనుభవాన్ని గడించి ప్రాణ నష్టాన్ని కనిష్ట స్థాయికి తెచ్చుకున్న జపాన్‌లో సైతం ఈనెల 14, 15 తేదీల్లో వచ్చిన భూకంపాలు 42మంది ప్రాణాలుతీశాయి. ఈ 20 రోజుల వ్యవధిలోనూ మన దేశంతోపాటు అఫ్ఘాన్, పాకిస్తాన్‌లు కూడా భూకంపాలను చవిచూశాయి. వాస్తవానికి భూమి లోలోతు పొరల్లో అనుక్షణమూ ఎన్నో మార్పులు, వాటి పర్యవసానంగా ప్రకంపనాలు సంభవిస్తూనే ఉంటాయి. భూగర్భం మొత్తం ఏడు పలకలుగా విడిపోయి ఉంది. వీటిల్లో వచ్చే కదలికలు, ఆ కదలికలు తెచ్చే రాపిడి వల్ల ఆకస్మికంగా శక్తి విడుదలై తరంగాల రూపంలో ప్రయాణించి భూ ఉపరితలానికి చేరుతుంది. అలా చేరినప్పుడు మాత్రమే భూ ప్రకంపనలు మన అనుభవంలోకి వస్తాయి. ఆ ప్రకంపనల తీవ్రత ఏమేరకు పెరిగితే ఆ మేరకు నష్టం తీవ్రత కూడా ఎక్కువవుతుంది.
ప్రకృతి వైపరీత్యాల్లో మిగిలినవాటి విషయంలో జరిగే పరిశోధనలు మనిషికెంతో మేలు చేస్తున్నాయి. ఆ వైపరీత్యాలను నివారించడం సాధ్యం కాకపోయినా కనీసం ఎప్పుడొచ్చే అవకాశం ఉందో తెలుసుకుని నష్టాన్ని పూర్తిగా నివారించడానికీ, కనీసం ఎంతోకొంత తగ్గించుకోవడానికీ వీలుకలుగుతోంది. సుదూర గ్రహాలకు సైతం రోదసీ నౌకలను పంపుతూ వాటిని ఇక్కడినుంచే నియంత్రించగల శక్తిని సంతరించుకున్న మానవుడు భూకంపాల ముందు నిస్సహాయంగా మోకరిల్లుతున్నాడు. కాళ్లకింద నేల ఏ క్షణంలో కుంగిపోతుందో చెప్పలేని స్థితిలో ఉన్నాడు.
భూకంపాల పరిశోధనలు గతంతో పోలిస్తే ఎంతో కొంత మెరుగుపడ్డాయనడంలో సందేహం లేదు. ఫలానాచోట భూకంపం రావడానికి ఆస్కారం ఉన్నదని, ఫలానా ప్రాంతంలో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చునని భూ భౌతిక శాస్త్రవేత్తలు చెప్పగలుగుతున్నారు. అయితే నిర్దిష్టంగా ఎప్పుడు వస్తుందో చెప్పడం సాధ్యం కావడంలేదు. అంతేకాదు... ఫలానా ప్రాంతానికి భూకంపాల ప్రమాదం లేదని కూడా అంచనాకు రాగలుగుతున్నారు. భూకంపం వచ్చే ముందు పశు పక్ష్యాదులు వింతగా ప్రవర్తించడం అందరికీ అనుభవమే. జంతువులు కట్టు తెంచుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తే...పక్షులు అరిచి రొదచేసి అస్థిరంగా ప్రవర్తిస్తాయి. ఇవి జరగబోయే ప్రమాదాన్ని ఎలా పసిగట్టగలుగుతున్నాయో తెలుసుకుందుకు చేసిన అధ్యయనాలు పెద్దగా ఫలితాన్నివ్వలేదు.
మనకు చిత్రంగా అనిపిస్తుందిగానీ వాతావరణ కాలుష్యం, అందువల్ల పెరుగుతున్న భూతాపం వంటివి భూమి లోలోపలి పొరలపై సైతం తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. అడవుల నరికివేత, వాహన కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు వంటివి పర్యావరణంపై ప్రతికూల ప్రభావానికి కారణమవుతున్నాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులకు దోహదపడుతున్నాయి. ఇవన్నీ వరదలకు , సముద్ర మట్టాలు పెరగడానికి దారితీసి భూ లోలోపలి పొరల్లో సాగే అలజడిని మరింత వేగవంతం చేస్తున్నాయి.
హిమాలయ పర్వతసానువుల్లో విచ్చలవిడిగా జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఆనకట్టలు కట్టడం, కొండలను తొలచి రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు నిర్మించడంవంటి పనులు చేటు కలిగిస్తున్నాయి. ధ్రువ ప్రాంతాల తర్వాత అత్యధికంగా మంచు పేరుకుని ఉండే ప్రాంతం హిమాలయాలే. ఈ తరహా మంచు పర్వతశ్రేణిని కంటికి రెప్పలా కాపాడుకోవలసి ఉండగా మన చర్యలన్నీ అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. హిమాలయ సానువుల్లో ‘అత్యంత భారీ భూకంపం’ రావడానికి ఆస్కారం ఉన్నదని నాలుగేళ్లక్రితం భూ భౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కానీ అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను చూస్తుంటే ఈ హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేసినట్టు కనబడటం లేదు.
ప్రపంచంలో 1960కి ముందున్న స్థితి భూమికి మరోసారి రాబోతున్నదన్న శాస్త్రవేత్తల సందేహం నిజం కావొచ్చు. కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడొచ్చిన భూ కంపాలన్నీ అవి తరచుగా సంభవించే ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైరలోనే ఉన్నాయి. వాటి మధ్య పరస్పరం సంబంధం ఉన్నదన్న సంగతి కూడా ఇంకా నిర్ధారణకాలేదు. అయితే శాస్త్రవేత్తల సందేహం ప్రభుత్వాల్లో కాస్తయినా పునరాలోచన కలిగించాలి. తమ అభివృద్ధి నమూనాలు ప్రకృతికి కలిగిస్తున్న చేటును గుర్తించి సవరించుకోవాలి. అదే సమయంలో భూకంపాలపై పౌరులను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను చేపట్టాలి. ఏ భూకంపమైనా దానంతటదే ప్రాణాలు తీయలేదు. ఆ భూకంపంలో కూలిపోయే కట్టడాలే అందుకు కారణమవుతాయి. కనుక ఏ నిర్మాణమైనా భూకంప తీవ్రతను తట్టుకునే తరహాలో ఉండేందుకు అనువైన చర్యలు తీసుకోవాలి.