
విషాదకర ఉదంతం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాక నక్సలైట్ల కార్యకలాపాలు చెప్పుకోదగ్గ స్థాయిలో కనబడని నేపథ్యంలో ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు(ఏఓబీ)లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్ కమాండర్ ఒకరు మరణించారని వచ్చిన వార్తలు కలవరం కలిగిస్తాయి. 2008లో ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య జరిగిన శాంతి చర్చల్లో ఆ పార్టీ తరఫున ప్రతినిధులుగా వచ్చిన వారిలో ఒకరైన గాజర్ల రవి, మరో సీనియర్ నాయకుడు మృతుల్లో ఉన్నారని నిర్ధారణ కాని సమాచారం వల్ల తెలుస్తున్నది. గ్రేహౌండ్స్‌కు చెందిన మరో కమాం డర్‌కు గాయాలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు చాలా తరచుగా చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్లు విభజన అనంతరం మందగించాయి. అయితే అవి పూర్తిగా ఆగిపోలేదు. నిరుడు ఏప్రిల్‌లో తెలంగాణలోని నల్లగొండ జిల్లా జానకీ పురంలో సిమి ఉగ్రవాదులు–పోలీసుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఎస్‌ఐ, కానిస్టేబుల్, హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే ఉగ్రవాది వికారుద్దీన్, అతని అనుచరులు అయిదుగుర్ని పోలీసులు ఒక ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు. మరో నాలుగు నెలలకు తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వివేక్ అనే యువ కుడితోపాటు ఇద్దరు ఆదివాసీ యువతులు ఒక ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పో యారు. ఆ మరుసటి నెలలో వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో యువతీ యువకులు శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డి మరణించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని శేషా చలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు తమిళనాడునుంచి వచ్చిన 20 మంది కూలీలను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు.
దేశంలో తొలి ఎన్‌కౌంటర్ ఎప్పుడు జరిగిందో చెప్పమని అడిగితే తడబడ వచ్చుగానీ... ఆ మాదిరి ఉదంతం చోటు చేసుకున్న ప్రతిసారీ పోలీసులు ఒకే రక మైన కథనం వినిపిస్తారు. ఫలానాచోట తీవ్రవాదులు లేక ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో వెళ్లినప్పుడు తమను చూసి వారు కాల్పులకు తెగబడ్డారని, లొంగి పొమ్మని హెచ్చరించినా వినకపోవడంతో గత్యంతరం లేక ఆత్మరక్షణార్ధం ఎదురు కాల్పులు జరిపామని అంటారు. చివరికది ఏ స్థితికొచ్చిందంటే... ఎన్‌కౌంటర్‌కు ఉండే స్థూల అర్ధం ‘ఎదురుకాల్పులు’ కనుమరుగై పట్టుకుని కాల్చిచంపడమన్న భావం స్థిరపడిపోయింది. ఏదైనా దుర్మార్గం చోటుచేసుకున్నప్పుడల్లా అందుకు కారకులైనవారిని ఎన్‌కౌంటర్ చేయాలని సామాన్య పౌరులు సైతం డిమాండ్ చేయడం...ఎన్‌కౌంటర్ చేస్తానని, చేయిస్తానని హెచ్చరికలు వినబడటం దీనికి కొన సాగింపే. ఎన్‌కౌంటర్ ఉదంతాలు జరిగినప్పుడల్లా పౌర హక్కులు, మానవ హక్కుల సంఘాలు వాటిపై న్యాయవిచారణ కోరతాయి. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తాయి. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో, బంధువుల సమక్షంలో పోస్టు మార్టం జరగాలని, ఆ ప్రక్రియను రికార్డు చేయించాలని విజ్ఞప్తి చేస్తాయి. నిజానికి ఎవరూ కోరకుండానే, న్యాయస్థానాల జోక్యం అవసరం లేకుండానే ప్రభుత్వాలు వాటంతట అవి అమలు చేయాల్సిన అంశాలివి. అందుకు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ), సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార ్గదర్శకాలున్నాయి. కానీ అవి అమలుకావు. ఇప్పుడు ఏఓబీ ఎన్‌కౌంటర్ విషయం లోనూ అందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. మావోయిస్టుల మృతదేహాలను ఆంధ్ర ప్రదేశ్‌కు తీసుకొచ్చి ఉంటే విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఆ మృతదేహాలను ఒడిశాలోని మల్కాన్‌గిరికి తరలించారని అంటున్నారు. అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో లేరని, కనుక సాక్ష్యాధారాలు తారుమారయ్యే ప్రమాదమున్నదని పౌరహక్కుల సంఘాల వాదన. ఇలాంటి ఉదంతాల్లో సాధ్యమైనంతవరకూ అనుమానాలకు తావీయని రీతిలో వ్యవహరించడం ప్రభుత్వాల ధర్మం.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణలోనూ, ఏజెన్సీ ప్రాంతం లోనూ నక్సల్ ఉద్యమ తీవ్రత ఎక్కువగా ఉండేది. తెలంగాణలోనైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు... ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం బయట అడుగుపెట్టడానికి జంకేవారు. నక్సల్ ఉద్యమ సారథులుగా ఉన్నవారితో సహా పలువురు వివిధ ఎన్‌కౌంటర్‌లలో చనిపోయారు. వేర్వేరు ఉదంతాల్లో పలువురు నేతలు, పోలీసు అధికారులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అంతటి తీవ్ర పరిస్థితులు లేవు. ఆ ఉద్యమ ప్రభావం గణ నీయంగా తగ్గింది. మావోయిస్టులు సైతం తమ కార్యక్షేత్రాన్ని దండకారణ్యానికి తరలించారు. ఏఓబీలో వారి కదలికలు ఉన్నట్టు అప్పుడప్పుడు వెల్లడవుతున్నా అవి చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఈ నేపథ్యంలో నక్సల్ ఉద్యమ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో ఇంతమంది మావోయిస్టులు ఒకేచోట పోలీసు కాల్పుల్లో మర ణించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏఓబీలో గత కొన్నాళ్లుగా పోలీసుల గాలింపు సాగుతోంది. ఒకరిద్దరు మావోయిస్టులు అరెస్టయినట్టు, ఎన్‌కౌంటర్‌లో గాయపడి నవారికి పోలీసులు చికిత్స చేయించడంతోపాటు వారికి రక్తదానం కూడా చేశారని వార్తలొచ్చాయి. పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించినట్టు కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే ఇంత పెద్ద ఉదంతం జరుగుతుందని ఎవరి ఊహకూ అందలేదు. ఏఓబీలోని గిరిజన గూడాలు పేదరికంతో, మరెన్నో సమస్య లతో సతమతమవుతుంటాయి. అలాంటిచోట నక్సలైట్ల ప్రాబల్యం ఉండటం అసా ధారణమేమీ కాదు. హింసాయుత వాతావరణం ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారానికి ఆటంకమవుతుంది. సామాజిక రుగ్మతలను అరికట్టడానికి భౌతిక నిర్మూలనే మార్గమని ఏ పక్షం అనుకున్నా అది సరికాదు. ఇలాంటి విషాద ఉదంతాలు జరగకూడదని ప్రజాస్వామికవాదులు ఆశిస్తారు. కొలంబియా వంటి దేశంలో ఏభైయ్యేళ్లకు పైబడి సాగుతున్న వామపక్ష ఉద్యమ నాయకులతో అక్కడి ప్రభుత్వం చర్చలు సాగించి సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించినప్పుడు మనదేశంలో అది అసాధ్యమని అనుకోలేం. ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నం జరగాలని, శాంతియుత వాతావరణం ఏర్పడాలని అందరూ కోరుకుంటున్నారు.