
పుష్కర సంరంభం
'తల్లి కృష్ణానదీ! భవత్తటమునందె/మ్రోసెనాంధ్ర పతాక ముమ్మొదటి దెగసి/ తెలుగునావలు నీ దీవనలు గడించి/ఎత్తె తెరచాప దీవుల నెల్లనొత్తె’ అంటూ కృష్ణమ్మకూ, తెలుగు నేలకూ ఉన్న అవినాభావ అనుబంధాన్ని తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి కమనీయంగా చెప్పారు. ఆది మానవుడిని మానవుడిగా తీర్చిదిద్దడంలో... సంస్కృతినీ, సంస్కారాన్నీ అద్దడంలో.. సహజీవన సౌందర్యాన్ని గుర్తెరిగించడంలో ఎక్కడైనా నదుల పాత్ర వెలలేనిది. అందుకే నదిని అమ్మగా తలిచి కొలిచే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. నేటి ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా ప్రారంభమై పన్నెండురోజులపాటు కొనసాగే పుష్కరాలు ఆ సంప్రదాయంలో భాగమే. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 5.45కు, తెలంగాణలో ఉదయం 5.58 నిమిషాలకు ఈ పన్నెండు రోజుల సంరంభం ప్రారం భమవుతుంది.
దేవతల గురువు బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించే క్షణాలను గణించి ఈ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. పన్నెండళ్లకొక్కసారి వచ్చే ఈ పుష్కరాలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. పుష్కరకాలంలో నదుల్లో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలూ, సప్తరుషులు, పితృదేవతలూ నివసిస్తారని... మూడున్నర కోట్ల తీర్థాలు అందులో కలుస్తాయని విశ్వసిస్తారు. అందుకే ఈ కాలంలో పుష్కర స్నానం, పితృ కర్మలు అనంత పుణ్యప్రదమని చెబుతారు. ఆధునికత పెరుగుతున్న కొద్దీ, రవాణా సదుపాయాలు విస్తరిస్తున్నకొద్దీ ఈ విశ్వాసాలు మరింత చిక్కనవు తున్నాయి. ఇందుకు 1921నాటి ఒక వాణిజ్య ప్రకటనే రుజువు. ఆ ఏడాది ఆగస్టు 15-సెప్టెంబర్ 7 మధ్య జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా మద్రాస్ అండ్ సదరన్ మరాఠా రైల్వే కంపెనీ లిమిటెడ్ పేరిట వెలువడిన ఈ ప్రకటన తమ కంపెనీవారు ‘కావలసినంత ప్రయాణికులు ఉన్న పక్షమునందు ఎన్ని తడవలైనను స్పెషలుబండ్లు పోవుటకు తగిన ఏర్పాట్లు చేసెదరు’ అని యాత్రికులకు తెలిపింది. ‘చాలినంతమంది రెండవ తరగతి ప్రయాణికులున్నప్పుడు రెండవ తరగతి పెట్టె కూడా చేర్చబడును’ అని ఆ ప్రకటన ముక్తాయించింది.
దేశంలో మూడో పెద్ద నదిగా, దక్షిణాదిన గోదావరి తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించే కృష్ణానది పడమటి కనుమల్లోని మహాబలేశ్వర్ సమీపాన ఒక చిన్నధారగా ప్రారంభమవుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ముందుకు సాగు తున్నకొద్దీ అది అనేక ఉప నదులను సంగమించుకుంటూ, తాను ఒరుసుకు ప్రవహించే నేలతల్లిని సశ్యశ్యామలం చేసుకుంటూ సుమారు 1,240 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 29 నదులు కృష్ణమ్మలో లీనమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,188 మీటర్ల వెడల్పుతో దీని విశ్వ రూపం కనబడుతుంది.
ఈసారి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మూడున్నర కోట్లమంది... తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మరో మూడున్నర కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేశామని, రద్దీని తట్టుకు నేందుకు అవసరమైన బస్సులు, రైళ్లు సమకూర్చామని చెబుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగే పుష్కర స్నానాల్లో అధికభాగం... దాదాపు 80 శాతం విజయ వాడలోనే ఉంటాయి. ఆర్భాటపు ప్రకటనల సంగతలా ఉంచి రెండు రాష్ట్రాల్లోనూ పనులు నత్తనడకనే సాగాయని, నాసిరకంగానే ఉన్నాయని ఆరోపణలు వెల్లు వెత్తాయి. పుష్కరాల ముహూర్తం సమీపిస్తున్న సమయానికి కూడా పనులింకా కొనసాగుతూనే ఉన్నాయి.
విజయవాడలో పుష్కర ఘాట్లకు చేరువలో ఉన్న ఖాళీ స్థలాలను వదిలిపెట్టి కిలోమీటర్ దూరంలో ఎక్కడో యాత్రికుల కోసం పుష్కర నగర్‌లు నిర్మించారు. కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక తలదాచుకునేందుకు భక్తులు అంత దూరం వెళ్లవలసిన అవసరమేమిటో అర్ధంకాదు. పుష్కరాల పనుల సాకుతో ప్రార్థనా మందిరాల కూల్చివేతలు, విగ్రహ విధ్వంసాలు అందరినీ నివ్వెరపరి చాయి. మిత్రపక్షంగా ఉన్నా బీజేపీది అరణ్యరోదనే అయింది. ఆ పార్టీలో బలహీనంగానైనా తమ స్వరం వినిపించడానికి ప్రయత్నించినవారిని... టీడీపీ కార్య కర్తలను వెంటేసుకెళ్లిన నేతలు పరాభవించాలని చూశారు. ఆధ్యా త్మికవేత్తలు అడగబోతే ‘మేం మీకంటే గొప్ప భక్తులం...’ అంటూ మొరటుగా జవాబిచ్చారు. ప్రధాన రహదార్లపై అక్కడక్కడ ప్రైవేటు భవనాలపై పెట్టుకున్న ప్రతిపక్షం ఫ్లెక్సీలు కూడా తొలగించి ప్రభుత్వం తన విద్వేషపూరిత మనస్తత్వాన్ని చాటుకుంది.
పనుల వరకూ చూస్తే తెలంగాణలోనూ పెద్ద తేడా ఏం లేదు. జూలై 15 కల్లా పనులన్నీ పూర్తికావాలని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరుగులు పెట్టిం చినా కదలిక లేదు. దీన్ని ఆగస్టు 5కు పెంచినా ఫలితం లేదు. చివరకు 8వ తేదీకి దాన్ని సాగదీసినా ఉపయోగం లేదు. పుష్కరాలు మొదలుకావడానికి ముందు రోజు కూడా అక్కడక్కడ పనులు నడుస్తూనే ఉన్నాయి. ఒకటి రెండు చోట్లయితే పుష్కరఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన రక్షణ కడ్డీలు విరిగిపోయాయి. నిర్మించిన మట్టిరోడ్లు వర్షాలకు జాడలేకుండా పోయాయి. పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమ వుతాయో చాలా ముందే తెలుస్తుంది. అయినా నెల, నెలన్నర ముందు తప్ప చేయాల్సిన పనులకు సంబంధించి స్పష్టత రాకపోవడం, నిధులు విడుదల చేయకపోవడం ఆశ్చర్యం గొలుపుతుంది. పాలనా వ్యవహారాల్లో ఆరితేరినవారే రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా ఉన్నా... గత అనుభవాలు పుష్కలంగా ఉన్నా ఈ విషయంలో వైఫల్యం చెందడం విచిత్రం. చంద్రబాబుకైతే నిరుడు గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలు ఉండనే ఉన్నాయి. పన్నెండేళ్ల కొకసారి వచ్చే పుష్కర సంరంభం లక్షలాదిమంది భక్తులను ఒకచోట చేర్చే సందర్భం. నదీ స్నానానికి వచ్చే భక్తకోటిని తిరిగి ఇళ్లకు వెళ్లేవరకూ సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత పాలనా యంత్రాంగానిది. ఆ బాధ్యతనైనా సక్ర మంగా, చిత్తశుద్ధితో నిర్వర్తించాలని అందరం కోరుకుందాం.