ఉపాధికి ఇంగ్లిష్ మంత్రం?
విశ్లేషణ
ఇంటి భాషలోనే వ్యక్తీకరణ సమస్యలు ఎదుర్కొనే పిల్లలు ఇంగ్లిష్‌లో నేర్పు పొందుతారనడంలో హేతువు ఏమిటి? ఇంగ్లిష్ మీడియంలోనే విద్య ముగించినవారు ఆ చదువు ద్వారా మాత్రమే పైకి ఎదుగుతున్నారా?
తల్లి భాషలో కొత్త తెలివి తేటలు నేర్పే ప్రాథమిక చదువు నేర్చు కోవడం, దానిని నేర్పడం పిల్లల హక్కు, ఒక బాధ్యత. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లలో తెలుగులో చదువుకోవడం ప్రయోజనకరం కాదన్న భావన బలంగా ఏర్పడి ఉంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడంవల్ల మాత్రమే తమ పిల్లలు బాగుపడతారు అని నిరుపేద తల్లిదండ్రులు కూడా భావించే స్థితి వచ్చింది.
‘కులవృత్తులు కడుపు నింపవు కనీస గౌరవాన్ని ఇవ్వవు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అందరికీ రావు, సంపద సృష్టి, బతుకుదెరువుల సృష్టి ముఖ్యంగా మార్కెట్టులో జరుగుతుంది, అక్కడికి చేరుకోవా లంటే ఇంగ్ల్లిషు మాత్రమే మార్గం’ అనే తర్కం ఇంగ్లిష్ మీడియంలో చదవడం మాత్రమే నాణ్యమైన బతుకుదెరువు బాట చూపే చదువు అన్న భావనకు బలం చేకూర్చింది.
ఈ తర్కంతోబాటు తెలుగులో చదువు చెప్పించేందుకు పూనుకున్న ప్రభుత్వాలు తెలుగులో చదువుకుంటున్న పిల్ల లకు అందుబాటులో ఉండే రీతిలో అనేక శాస్త్ర సంబంధ పుస్త కాలను యూరోపియన్ తదితర భాషల నుండి తెలుగులోకి అను వదించి అందుబాటులోకి తేక పోవడం. తెలుగు మీడియం స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు కనీస వ్యక్తీకరణ సామర్థ్యాలను మెరుగుపరచుకునే వ్యూహం నిర్మించకపోవడం, తల్లి భాషలో నేర్పడం ద్వారా ఇంగ్లిష్ ఇతర భాషలు నేర్పడం మీద శ్రద్ధ పెట్టకపోవడం అన్న సమస్యలూ తోడైనాయి.
ఇక సర్కారు బడిలో పాఠాలు చెప్పే టీచర్లు నూటికి తొంభై శాతం తమ పిల్లలను తాము చదువు చెబుతున్న సర్కారు బడిలో చది వించక పోవడం, కాస్తో కూస్తో సంపాదనా సామర్థ్యం గల ప్రతి ఒక్కరూ తెలుగు మీడియం సర్కారు బడికి తమ పిల్లలను పంపక పోవడంతో ఇంగ్లిష్ మీడియంలో చదవ డమే నాణ్యమైన చదువు అనే భావానికి పునాదిని కల్పిం చింది. మొత్తంమీద సర్కారు స్కూల్ అంటేనే నాసిరకం అన్న భావన బలంగా మారింది.
ముఖ్యంగా 1990ల నుండి సర్కారు తెలుగు మీడియం బడులలో చదువుకునే విద్యార్థుల ఆర్థిక సామాజిక స్వరూపం చూస్తే అది దారిద్య్రరేఖకు దిగువన గల వారి తోనూ, కుల శ్రేణిపరంగా చూస్తే పాలనకూ అధికారానికి దగ్గరగా లేని పాలిత, వెనుకబడిన కులాల పిల్లలతో నిండి పోయింది. సామాజిక పర్యవేక్షణ, సర్కారు పర్యవేక్షణ లోపించిన స్కూళ్లలో టీచర్లు చదువుచెప్పే ప్రక్రియకు దూరం అవడమూ మొదలైంది.
ఈ స్థితిలో నాణ్యమైన చదువు అంటే అది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందు తుంది అనే అభిప్రాయం ఒక నిశ్చితమైన రూపం తీసు కున్నది. ‘ఉత్పాదకమైన మనుషులుగా మారడం కోసం, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశం కోసం దళితులూ ఇతర వెనుకబడిన సమూహాల పిల్లలకు ఇంగ్లిష్‌లో నేర్పడం నేటి ప్రధాన అవసరం’ అనే సులభంగా తీసిపారేయలేని వాద నను చాలా ప్రభావవంతంగా దళిత, ఇతర ఉత్పత్తి కులాల నుండి ఎదిగొచ్చిన మేధావులు ముందుకు తెచ్చారు. వీట న్నింటి ఫలితంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయం జరిగిపోయింది.
కాలంతోబాటు చదువు, అవసరాలు మారుతూ ఉంటాయి. చిన్న బాలశిక్ష, పెద్ద బాల శిక్షలను దాటి, బాషలు, పరిసరాల విజ్ఞానం, సాంఘిక, భౌతిక శాస్త్రాలు, గణితంతో కూడిన విద్యలోకి ప్రవేశించడం అటువంటి మార్పే. ఈ మార్పు ఎంతో పరిశోధనల తరువాత వచ్చింది. వ్యక్తీకరణ సామర్థ్యం, సామాజిక అవగాహనా సామర్థ్యం, పదార్థ విజ్ఞాన సామర్థ్యం. గణిత సామర్థ్యం, తార్కిక సామర్థ్యం అందించే ఉద్దేశంతో ఈ సిలబస్ మార్పు జరిగింది.
ఈ అంశాలను తెలుగులో నేర్పడానికి ప్రయత్నాలు జరిగి అవి కొంత మంచి ఫలితాలనే ఇచ్చాయి. తల్లిభాష కేవలం భావ ప్రసార సాధనం మాత్రమే కాదు, అది సంక్లి ష్టమైన చింతనా సామర్థ్యానికి పనికివచ్చే కీలక సాధనం. సామాజిక, ఆర్థిక ఆధిపత్యాలను, అణచివేతనూ అర్థం చేసు కునేందుకు పనికివచ్చేది కూడా భాషే. తల్లి భాష కాని వేరొక భాష నేర్చుకునేందుకు అది కీలక సాధనం కూడా.
ఇంగ్లిష్‌లో ఎటువంటి నేర్పు లేని నేపథ్యం నుంచి వస్తున్న విద్యార్థులకు ఆ భాషా పాటవాలను నేర్పేందుకు కూడా తల్లిభాషలో వ్యక్తీకరణ మెరుగుదల అవసరం. ఇప్పుడు మనకు ఇది అయిపులో లేదు. లిపిలేని తల్లిభాష, లిపిగల ప్రాంతీయ భాష, లిపి విస్తరణ గల భాష (ఉదా హరణకు కోయ భాష, తెలుగు, ఇంగ్లిష్)లలో మొదటి దానికన్నా తర్వాతది చాలా గొప్ప భాష అనే గొప్పతనపు భావనను నిర్మించుకున్నాం. ఇది మనలోని వర్ణ కుల ఆధిపత్య మానసిక తత్వానికి కొనసాగింపే. ఆయా భాష లకు ఆయా స్థాయిలలో ప్రయోజనం ఉంటుందని మనం గుర్తించడం లేదు.
1990ల మొదటి నుండి సగటున ప్రతి మూడు ఏళ్లకు ఒక సారి ఒక స్థిరత్వం లేని బోధన, అభ్యసన, మూల్యాంకనా ప్రయో గాలు చేసి సర్కారు బడిలో చదువు నేర్పే పద్ధతులను అస్థిరత్వానికి గురి చేశారు పాలకులు. టీచర్ల సంఘాలు ఈ అస్థిరత్వ ప్రయోగాలను గురించి చర్చ చేసింది తక్కువే. ఇక పాల కులు వడపోత ద్వారా వివిధ సామాజిక శ్రేణుల పిల్లలను ఎంపిక చేసుకునే ప్రభుత్వ రెసిడెన్షియల్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినారు. ఈ పరిణామాల వల్ల మామూలు ప్రభుత్వ స్కూలు పట్ల సామాన్యులు కూడా నమ్మకం కోల్పోయే స్థితి దాపురించింది.
ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూలులో చెప్పే చదువే నాణ్యమైన చదువు అనీ, అటువంటి చదువునే సర్కారు ఇప్పుడు అందిస్తుందని చెబుతున్నారు తెలుగు నేలల్లో. తద్వారా నాణ్యమైన విద్య అందించడం అంటే ఏమిటి? అనే ప్రధాన ప్రశ్నకు అత్యంత సరళమైన సమాధానంగా ‘సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన’ ముందుకు వచ్చింది. నాసిరకం చదువుకు, నాణ్యమైన చదువుకు మాధ్యమంతో సంబంధం ఉండదన్న కనీస స్థాయి ఎరుక కొరవడ్డ స్థితిలోకి మనం వచ్చేశాం. తెలుగులో అందరికీ సార్వత్రిక విద్య అనే నాలుగు దశాబ్దాల ప్రయోగపు బాగోగులను లోతైన చర్చకు పెట్టకుండా ఇంగ్లిష్ మీడియం ఫార్ములాను గొప్పది అనుకుంటు న్నాము.
మనం నిజంగానే ఈ విషయంలో ముందు చూపుతో ఆలోచిస్తున్నామా?
ఒక మనిషి సమగ్ర వికాసానికీ, ఒక జీవిత కాలంలోనే మంచి ఆర్థిక, సామాజిక స్థితికి ఎదుగుదలకు, ఆ రకంగా లోకానికంతా పనికివచ్చే మనుషుల ఎదుగుదలకూ, సమానతా స్వేచ్ఛల సమతూకం సాధించే వ్యవస్థ నిర్మాణా నికీ, పనికివొచ్చే సర్కారుబడిని మెరుగుపరచుకోవడం అనేది ‘ఇంగ్లిష్ మీడియంలో బోధన’ అనే ఒకే ఒక మహిమ గల తాయత్తు ద్వారా సాధ్యం అని చెబుతున్నారు. అదే ఈనాడు సామాన్య ప్రజల కోరిక అని చెప్పుతున్నారు పాలకులు. కానీ నిజంగా ఆ తాయత్తు పని చేస్తుందా? సంక్లిష్టమైన సంవాదాత్మక ప్రశ్నలకు, చర్చతో, తర్కంతో సంబంధం లేని అత్యంత సరళమైన పాపులిస్ట్ ‘తాయత్తు’ సమాధానాల చరిత్ర గొప్పగా ఉన్న దాఖలాలు తక్కువే.
హెచ్ వాగీశన్
వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ మొబైల్: 9440253089