కపట మేధావుల విన్యాసాలు | gauri lankesh murder are hypocritical | Sakshi
Sakshi News home page

కపట మేధావుల విన్యాసాలు

Published Thu, Sep 14 2017 1:45 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

కపట మేధావుల విన్యాసాలు - Sakshi

కపట మేధావుల విన్యాసాలు

సందర్భం
పార్లమెంటు మీద, మన ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరం మీద దాడికి దిగిన ముష్కరులను తెగటార్చాలని, పట్టి దండించాలని భారతీయుడై పుట్టిన ప్రతి పౌరుడూ కోరాలి. దాడికి పాల్పడిన దోషులను పట్టి సుదీర్ఘ విచారణ అనంతరం ఉరితీస్తే కడవల కొద్దీ కన్నీరు కార్చిన వారిని ఏమనాలి? ముష్కరుల వర్థంతులు నిర్వహించడాన్ని ఏమనాలి? ఇలాంటి దేశద్రోహ పూరిత చర్యలను ఖండించకపోవడం, వాటికి మద్దతు తెల్పడం భూమండలం మీది ఏ దేశంలోనూ ఆమోదనీయం కాదు.

సామాన్య ప్రజలకు రాజకీయ నేతల పట్ల విశ్వాసం సన్నగిల్లడం మొదలై చాలా కాలమైంది. మేధావుల పట్ల మాత్రం సమాజానికి కొంత నమ్మకం మిగిలి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి ప్రజాస్వామిక భావనలకు ప్రపంచమంతటా ఆదరణ లభిస్తున్న తరుణంలో హింస పట్ల సర్వత్రా ఖండన మండనలు వెలువడడం హర్షణీయం.

భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామిక రాజకీయ సంస్కృతిలో భాగం. హింసా రాజకీయాలు దాని వికృతి. సర్వే సర్వత్రా సర్వులూ ఖండించదగిన హింస విషయంలో కొందరు మేధావుల వైఖరి నిజాయితీగా లేకపోవడం వారి ప్రతిష్టకే కాదు, సమాజ హితానికి కూడా చెరుపు చేస్తుంది. మొదలంటా వ్యతిరేకించవలసిన హింసను హింస, ప్రతిహింస, రాజ్యహింస అంటూ వర్గీకరించి, కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఆమోదించడం లేదా కొన్ని సందర్భాలలో మౌనం దాల్చడం మేధావులకు శోభనివ్వదు.

గౌరీ హత్య మీద కపట విలాపాలు
ఈ సెప్టెంబరు 5, మంగళవారం రాత్రి బెంగళూరులో జరిగిన సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య విషయంలో అదే జరుగుతోంది. సిద్ధాంతం, భావజాలం వేరైనా సరే సమాజ సేవకు ముందుకు వచ్చిన వారిని వ్యతిరేకించడం, విమర్శించడం తగునేమో కానీ, వ్యక్తులను అంతమొందించి, వారి భావజాలాన్నీ, సిద్ధాంత వ్యాప్తినీ అడ్డుకోగలమని భావిస్తే అది వారి అజ్ఞానం. తమకు నచ్చిన సిద్ధాంతం, భావజాలం మాత్రమే పురోగామిగా, ప్రోత్సహించదగినవిగాను; మిగిలినవి తిరోగామిగా, హింసామార్గంలోనైనా సరే అడ్డుకుని నిర్మూలించదగినవని భావించడం మూర్ఖత్వం. హతురాలు గౌరి లోగడ విభిన్న భావజాలానికి మద్దతుదారు కావచ్చు. తరువాత తన వైఖరిని మార్చుకునే హక్కు ఆమెకుంది. స్వేచ్ఛగా, నిర్భయంగా తను నమ్మిన భావజాల వ్యాప్తికి పనిచేసే వ్యక్తిని కాల్చి చంపడం కిరాతక చర్య. దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించి తీరాలి. త్వరితగతిన విచారణ జరిపి దోషులను దండించాలని పట్టుబట్టాల్సిందే. సరైన విచారణ జరిపించాలని కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిందిపోయి నిందితుల గురించి అస్పష్ట, ఊహాత్మక ఆరోపణలతో కపట విలాపాలు వినిపిస్తున్నారు.

ప్రశ్నిస్తే చంపుతారా? వ్యతిరేక భావజాలాన్ని బ్రతకనివ్వరా? అంటూ గౌరి హత్యానంతరం వెలువడిన విలాపానికి స్పందనగా ‘ఔను, 33 ఏళ్ళుగా హిందువులను దూషిస్తూ, హిందుత్వను వ్యతిరేకిస్తూ, చైనా, పాకిస్తాన్‌లను సమర్థిస్తూ కశ్మీర్‌ పోరాటాలకు, నక్సల్స్‌కు మద్దతు పలికినా గౌరీ కలానికీ, గళానికీ ముప్పు రాలేదు. ఇటీవల ఆరునెలలుగా కాంగ్రెస్‌ వ్యతిరేకి కావడం, ఇద్దరు ముగ్గురు నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం జరిగాకే ఆమెను తూటాలు బలిగొన్నాయి. ఆ తూటాలెవరివో నిగ్గుతేలాలి!’ అని సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ వచ్చే సరికి సద్దుమణిగిన విలాపం తర్క రాహిత్యాన్ని పట్టిస్తోంది.

రోహిత్‌ ఉదంతంతో పబ్బం గడపదలిచారు
గౌరీ హత్య జరగ్గానే కల్బుర్గీ, పన్సారే, దబోల్కర్‌ల హత్యోదంతాలను ప్రస్తావించడం, కొన్ని సంస్థల పేర్లను ప్రస్తావించి వారిని దోషులుగా చిత్రీకరించాలని ప్రయత్నించడం వెనుక మతలబేమిటి! ఇక్కడ ప్రస్తావించిన హత్యలన్నీ ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. మరి సరైన విచారణ జరిపి దోషులను దండించకుండా అడ్డుపడినదెవరు! ఇప్పుడు కూడా అసలు దోషులను తప్పించే ప్రయత్నాల్లో భాగమే ఈ అసందర్భ ప్రస్తావనలని అనుమానించడంలో తప్పేముంది?

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వేముల రోహిత్‌ ఆత్మహత్య విషయంలో త్వరితగతిన సక్రమ విచారణ జరగాలని కోరాల్సిందిపోయి, తెరాస, కేసీఆర్‌లపై ఒత్తిడి పెంచాల్సింది పోయి అస్పష్ట, నిరాధార ఆరోపణలతో ఆందోళనకు తెర తీసి రాజకీయ పబ్బం గడుపుకోజూసిన వారికి పలువురు మేధావులు వత్తాసు పలికారు. రోహిత్‌ ఆత్మహత్య లేఖను, దానిలో పేర్కొన్న విషయాలను సమగ్రంగా విచారిస్తే వామపక్ష రాజకీయాల్లో ఇమడలేక, వాస్తవాలతో రాజీపడలేక అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టమౌతుంది. సమగ్ర విచారణ జరక్కూడదని, విచారణను తప్పుదారి పట్టించాలనే కుట్రతోనే ఎవరెవరినో దోషులుగా చిత్రిస్తూ ఆందోళనకు తెరతీశారు. మేధావులని చెప్పే పలువురు విద్యావంతులు వారిని గుడ్డిగా అనుసరించారు. ఆ సందర్భంగా హైదరాబాద్‌ వచ్చి ఆక్రోశించి వెళ్లిన నేతలకు నిజంగా దళితుల పట్ల నిబద్ధత ఉంటే హుటాహుటిన వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సంఘటన కేరళలో జరిగింది.

నిరపరాధి, దళిత యువకుడైన రాజేశ్‌ను కేరళలోని హింసోన్మాదులు తిరువనంతపురంలో నడిరోడ్డు మీద జూలై 29న చేతులు నరికి, కర్కశంగా పొడిచి చంపారు. అతడు మరణిస్తూ నిందితుల పేర్లు వెల్లడించాడు. అయినా కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం చలించలేదు. అలా కేరళలో హత్యా రాజకీయాలకు బలైపోయిన వారి పేర్లు, చిరునామాలు ఏకరువు పెడితే కొండవీటి చేంతాడంత అవుతుంది. దేశంలో ఏ మూల ఎవరి హత్య జరిగినా మోకాలికీ బోడిగుండుకీ ముడి పెట్టినట్టు హిందుత్వంతో ముడిపెట్టి వ్యాఖ్యానించే మేధావులు కేరళలో ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలపై జరిగిన హత్యాకాండ పట్ల మౌనం వహిస్తూనే వస్తున్నారు.

నోరు మెదపని సందర్భాలు ఎన్నో!
రాజకీయాలతో, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా కేవలం గిరిజన సంక్షేమం కోసం ఒరిస్సాలోని కంథమూల్‌ జిల్లాలో ఆశ్రమం నెలకొల్పుకుని పనిచేస్తున్న స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్య మరీ దారుణం. వామపక్ష తీవ్రవాద రాజకీయాలకు, క్రైస్తవ మిషనరీల మతమార్పిడి కార్యకలాపాలకు కావాల్సిన ముడి సరుకు లాంటివారు గిరిజనులు. వారికీ, తమకూ మధ్య స్వామి లక్ష్మణానంద అవరోధమని భావించి, ఉభయులు కుమ్మక్కై మిషనరీల ఆర్థిక సాయంతో నక్సలైట్లు హత్య చేసినట్లు తరువాత పోలీసు విచారణలో వెల్లడైంది. మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలెవ్వరూ ఈ లంచగొండి మతవాద హత్య పట్ల ఆక్షేపణ, ఆగ్రహం ప్రకటించలేదు. లక్ష్మణానంద హత్యను ఖండించడానికి మేధావులెవ్వరికీ నోరురాలేదు.

రాజ్యాంగధర్మాన్ని అనుసరించి తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను హింసోన్మాదులు హతమార్చినప్పుడు కూడా ఈ మేధావులు నోరు మెదపడం లేదు. ప్రజా ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను సవాలు చేసిన హింసోన్మాదులు విదేశీయులు అయినప్పటికీ ఈ మేధావులు పట్టించుకోవడం లేదు. పైగా, అలాంటి వారిని కూడా సమర్థిస్తున్న వారికి మేధావులు మద్దతు పలకడానికి బారులు తీరడం నిస్సం దేహంగా ఆక్షేపించవలసిన విషయమే.

మన దేశ పార్లమెంటు మీద, మన ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరం మీద దాడికి దిగిన ముష్కరులను తెగటార్చాలని, పట్టి దండించాలని భారతీయుడై పుట్టిన ప్రతి పౌరుడూ కోరాలి. దాడికి పాల్పడిన దోషులను పట్టి సుదీర్ఘ విచారణ అనంతరం ఉరితీస్తే కడవల కొద్దీ కన్నీరు కార్చిన వారిని  ఏమనాలి? ముష్కరుల వర్థంతులు నిర్వహించడాన్ని ఏమనాలి? ఇలాంటి దేశద్రోహ పూరిత చర్యలను ఖండించకపోవడం, వాటికి మద్దతు తెల్పడం భూమండలం మీది ఏ దేశంలోనూ ఆమోదనీయం కాదు. సత్తెయ్య, వ్యాస్, ఉమేశ్‌చంద్ర వంటి పోలీసు అధికారులు బలైన సందర్భాల్లో కనీసం మానవతా దృక్పథంతోనైనా హింసను ఖండించలేదీ మేధావులు. ‘మూడు దశాబ్దాల గమనం గమ్యం’ పేరిట పౌరహక్కుల ఉద్యమనేత స్వర్గీయ బాలగోపాల్‌ లేవనెత్తిన ప్రశ్నలకు మేధావుల నుంచి జవాబే లేదు. జాతి వ్యతిరేక శక్తులకు వత్తాసు పలికినా, జాతీయతను అవమానించినా మేధావులు నోరు మెదపక పోవడం విచారకరం.

వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో మన జాతీయ పతాకాన్ని అవమానించడం తగదని అడ్డుపడిన సామా జగన్మోహనరెడ్డి హత్యతో మొదలు పెట్టి, తెలంగాణ ప్రాంతంలో జాతీయ భావజాల వ్యాప్తికి కృషి చేస్తున్న రామన్న, గోపన్నల దాకా జరిగిన అనేక హత్యల్లో ఒక్కదాన్నీ ఖండించడానికి కూడా ఈ మేధావులకు నోరు రాలేదు. హైదరాబాద్‌లో 1997మార్చి 3న విద్యార్థి పరిషత్‌ నేత చంద్రారెడ్డిని హతమార్చినప్పుడు కూడా జార్జిరెడ్డి హత్యతో ముడిపెట్టి ప్రత్యేక కథనాలు వండివార్చి, నేర తీవ్రతను తగ్గించాలని ప్రయత్నించారు పత్రికా రచయితలుగా స్థానం పొందిన మేథావులు.

లేడిని పులి చంపకపోతే....
‘పులి చంపిన లేడి నెత్తురు కావాలోయ్‌ నవకవనానికి’అన్న శ్రీశ్రీ కవితా స్ఫూర్తితో ఈ మేధావులు తమ రాజకీయ లబ్ధికి లేడి నెత్తురు కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. అమాయక లేడి ఆడదో, దళిత, బడుగు బలహీన వర్గాలదో అయితే మరింత మేలు. లేడిని పులి చంపకపోతే తామే చంపించి, వేరెవరినో పులులుగా చిత్రించి పబ్బం గడుపుకోవడం వారికి ఆనవాయితీ. దానిలో ఇటీవల చిన్న మార్పు వచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చాక ‘హిందుత్వ మోదిత్వ’ అనే పదబంధాన్ని ప్రచారంలోకి తెచ్చారు. మోదీ పుట్టక ముందునుంచీ∙ఈ దేశంలో హిందుత్వం ఉంది, మోదీ తరువాతా ఉంటుంది. ఈ కనీస చారిత్రక జ్ఞానం కూడా లేని వారు మేధావుల గ్రూపులో జొరబడడం నికార్సయిన శ్రేష్టతను దిగజార్చగలదు! దుష్టుల రాజకీయ గుణదోషాలను ఎంచి ఆమోదించడం, తిరస్కరించడం ప్రజల పని. రాజకీయాల పట్ల తటస్థ వైఖరిని అవలంబిస్తూ, సమాజానికి యోగ్యమైన దిశా నిర్దేశనం చేయగల మేధావులైన విద్యావంతులు హింసా రాజకీయవాదుల మాయాజాలంలో పడి కొట్టుకు పోరాదు. తమ ప్రతిష్టను విశుద్ధంగా నిలుపుకోవడం కోసం, సమాజ హితం కోసం మేధావులు నిష్పక్షపాత ధోరణితోను, చిత్తశుద్ధితోను వ్యవహరించాలి!
వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్, హైదరాబాద్, అధ్యక్షులు
పి. వేణుగోపాల్‌రెడ్డి
మొబైల్‌ : 94904 70064

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement