సంచలన కర్ణన్!
సాధారణంగా గంభీర వాతావరణం రాజ్యమేలే న్యాయస్థానాల్లో వింత ఉదంతాలను ఎవరూ ఊహించలేరు. కానీ ఊహకందనివి ఎక్కడైనా చోటు చేసుకోవచ్చునని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ నిరూపించారు. తనను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించుకుంటూ తీర్పునివ్వడమేకాక తన విధుల్లో జోక్యం చేసుకుని విసిగించొద్దంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు...ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని నిండు న్యాయస్థానంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా జాతి వ్యతిరేకులని ముద్రలేసే వాతావరణం కొనసాగుతున్న వర్తమానంలో ఈ మాటలే మరోచోట ఎవరైనా అని ఉంటే ఏమయ్యేదో ఊహించుకోవడం పెద్ద కష్టంకాదు.
ఈ మాదిరి ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరచడం జస్టిస్ కర్ణన్‌కు కొత్తగాదు. విభిన్నమైన ధోరణితో, విలక్షణమైన తీర్పులతో ఆయన గతంలోనూ ‘ఔరా’ అనిపించారు. సివిల్ జడ్జీల ఎంపిక కోసం ఏర్పాటైన కమిటీలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధనపాలన్‌ను నియమించడాన్ని ప్రశ్నిస్తూ నిరుడు ఏప్రిల్‌లో ఆయన ఆదేశాలిచ్చారు. ఆ న్యాయమూర్తి బోగస్ సర్టిఫికెట్లతో, ప్రశ్నార్ధకమైన ప్రవర్తనతో న్యాయమూర్తి పదవిని చేజిక్కించుకున్నారని అనడంతోపాటు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలిచ్చారు. తన ఉత్తర్వులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌కే కౌల్ ఆటంకం కలిగించారని తెలిసి ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి ప్రవర్తనకు కోర్టు ధిక్కార నేరంకింద చర్యలు తీసుకోవలసివస్తుందని జస్టిస్ కౌల్‌ను హెచ్చరిస్తూ మరో ఆదేశాన్నిచ్చారు. ఈ ప్రహసనంపై మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రీ సుప్రీంకోర్టుకెక్కి ఆ ఆదేశాల అమలును నిలిపేయించింది. ఎందుకిలా చేయాల్సివచ్చిందో సంజాయిషీ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై 12 వారాల తర్వాత చూద్దామని జవాబిచ్చారు. జస్టిస్ కర్ణన్ కేవలం ఇలా వివాదాల్లో చిక్కుకుని మాత్రమే వార్తల్లోకెక్కలేదు. ఆయనచ్చిన తీర్పులు వాటికవే సంచలన వార్తలుగా మారిన సందర్భాలున్నాయి. పెళ్లీడు వచ్చిన ఇద్దరు ఆడ, మగ మధ్య లైంగిక సంబంధం ఏర్పడితే దాన్ని పెళ్లిగా పరిగణించవచ్చునని, వారిని భార్యాభర్తలుగా గుర్తించవచ్చునని జస్టిస్ కర్ణన్ తీర్పునిచ్చినప్పుడు దేశవ్యాప్తంగా గగ్గోలుపుట్టింది.
న్యాయమూర్తుల నియామకం వ్యవహారాలను చూసే కొలీజియం వ్యవస్థ స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై విచారణ సాగుతున్న సమయంలో మద్రాస్ హైకోర్టులో ఏర్పడిన వివాదం ప్రస్తావనకొచ్చింది. ప్రవర్తన సరిగాలేనివారు న్యాయమూర్తులుగా రావడంవల్ల న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆ సందర్భంగా కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. అలాంటివారిని సరిచేయలేని నిస్సహాయ స్థితిలో కొలీజియం ఉన్నదని కూడా అన్నారు. ఆ సంగతిని బెంచ్ సైతం అంగీకరించకతప్పలేదు.
ఒక న్యాయమూర్తిని తొలగించడమంటే మాటలు కాదు. దానికి ఎంతో సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. ఏ దశలోనైనా ఆ ప్రక్రియ కుప్పకూలితే అది మళ్లీ మొదటికొస్తుంది. స్వతంత్ర భారత చరిత్రలో ఉన్నత న్యాయస్థానాల్లో అవినీతి ఆరోపణలు లేదా ఇతరత్రా వ్యవహారాల్లో పదవులు కోల్పోయిన న్యాయమూర్తులెందరని ఆరా తీస్తే దాదాపు ఎవరూ లేరన్న సమాధానం వస్తుంది. తొలగింపు ప్రక్రియ ఎంతో సంక్లిష్టమైనది కావడమే దీనికి కారణం. రాజ్యాంగంలోని 124(4) అధికరణ ప్రకారం వందమంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు ఆయా చట్టసభల అధ్యక్షులకు తీర్మానం అందజేయాలి. లోక్‌సభ సభ్యులు తీర్మానం అందజేసిన పక్షంలో స్పీకర్ దాని ఆధారంగా న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటుచేస్తారు.
రాజ్యసభ సభ్యులనుంచి తీర్మానం వచ్చిన సందర్బంలో చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. అలా ఏర్పాటయ్యే కమిటీ సిఫార్సు న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఉంటేనే చట్టసభల్లో అభిశంసన తీర్మానంపై చర్చ జరుగుతుంది. చర్చ సందర్భంగా న్యాయమూర్తి సభకు హాజరై తన వాదనను వినిపించవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వి. రామస్వామిపై ఆరోపణలొచ్చినప్పుడు లోక్‌సభలో వాటిపై చర్చ జరిగింది. ఓటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ గైర్హాజరు కావడంతో అభిశంసన తీర్మానం వీగిపోయింది. అనంతరకాలంలో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రసేన్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినకరన్‌లపై అభిశంసన తీర్మానాలొచ్చాయి. సౌమిత్రసేన్‌ను అభిశంసించే తీర్మానం రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దినకరన్ సైతం ఈ పద్ధతిలోనే తప్పుకున్నారు. చిత్రమేమంటే వీరిద్దరూ అనంతరకాలంలో రిటైర్మెంట్ సదుపాయాలన్నీ పొందారు. చట్టంలో స్పష్టత లేకపోవడమే దీనికి కారణం. ఇంత సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ గనుకే సర్వసాధారణంగా అభిశంసన జోలికిపోరు.
ఇప్పుడు జస్టిస్ కర్ణన్‌పై అలాంటి చర్యకు ఉపక్రమిస్తే ఆయన మౌనంగా ఉండిపోరు. రాజీనామా చేసి వెళ్లిపోరు. చట్టసభల్లో తన వాదనను గట్టిగా వినిపిస్తారు. తనపై కుల వివక్ష చూపుతున్నారని, తనను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆయన చెప్పినట్టయితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. న్యాయమూర్తులను తొలగించడానికి ఇప్పుడనుసరిస్తున్న ప్రక్రియను సరళతరం చేయాలని న్యాయ నిపుణులు చెబుతారు. అలా చేయడం తర్వాత సంగతి...అసలు నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉంటే విపరీత పోకడలు, అవినీతి చరిత్ర ఉన్న వ్యక్తులు రావడం అసాధ్యమవుతుంది. అప్పుడు న్యాయవ్యవస్థ విశ్వసనీయత, ప్రతిష్ట మరింత పెరగడానికి అవకాశం కలుగుతుంది.