ఇంటికి చేరిన నిర్వాసితులు!
ఆర్ట్ అండ్ లిటరేచర్
నిర్వాసితులయ్యేది గిరిజనులు, జానపదులేనా? నగరజీవులూ నిర్వాసితులవుతారు! అటువంటి ఒక నిర్వాసి జి.సత్య శ్రీనివాస్. వివిధ భాషలలో వస్తోన్న పర్యావరణ కవితలను పరిచయం చేస్తున్న వ్యక్తిగా అతడు తెలుగు పాఠకులకు పరిచితుడు. స్వతహాగా కవి, ఫొటోగ్రాఫర్. గిరిజన ప్రాంతాలన్నిటినీ తిరిగిన వాడు.
త్రిభాషా పత్రిక మీజాన్‌లో తెలుగు పత్రికకు సంపాదకుడైన అడవి బాపిరాజు హైద్రాబాద్‌లో తొలితరం తెలుగు జర్నలిస్ట్. తదుపరి తరానికి చెందిన వ్యక్తి గుడ్లవల్లేరు రామారావు. ‘నంబర్ 20, జర్నలిస్ట్ కాలనీ, బంజారాహిల్స్’ ఆయన ఇల్లు. ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. అన్నలతో సోదరితో సత్య శ్రీనివాస్ అక్కడ పెరిగారు. కారణాంతరాల వలన ఆ ఇంటిని అమ్మివేశారు. మూడు దశాబ్దాలు గిరిజనులు, జానపదులతో గడిపి వారి నిర్వాసిత జీవితాలను మాటలుగా, పాటలుగా విన్న సత్యశ్రీనివాస్‌కు తాము నిర్వాసితులైన ఇల్లు, ఆ ఇంటితో పెనవేసుకున్న అమ్మలు, అమ్మమ్మలు గుర్తొచ్చారు. జలవర్ణాలతో వారికి ఆకృతి ఇచ్చేందుకు పూనుకున్నాడు. ఒక పరిశోధకునిలా 20 పాత ఫొటోలను సేకరించి, వారి వ్యక్తిత్వాలు తొణికిసలాడే ‘20 మెమోయర్స్’ రూపొందించాడు.
భర్త చనిపోయినా బాధ్యతలకు వెరవక పిల్లలను వృద్ధిలోకి తెచ్చిన మిత్రుడు చంద్రశేఖర్ అమ్మ బి.ఆదిలక్ష్మి, ఆప్యాయత ఈమె నుంచే పుట్టిందా అన్నట్లుగా కన్పించే అనంతపురం జిల్లా, చిన్న కోటాల గ్రామానికి చెందిన 92 ఏళ్ల భారకం పాపమ్మ, పురానా షెహర్ నడచి వస్తున్నట్లుగా కన్పించే కవి-గాయకుడు సిద్ధార్ధ అమ్మ బి.సుశీల, స్వాదిష్ట్ భోజనాన్ని తయారు చేసే కరీంనగర్ కు చెందిన గండి సులోచన, తాను తల్లిలా భావించే కొండపల్లి కోటేశ్వరమ్మ, నగరంలో ఉండలేనని రొట్టమాకురేవుకు వెళ్లి వేపచెట్టుకింద కొన్ని రోజులు నివసించిన ‘గ్రామదేవత’ కవి యాకూబ్ అమ్మ హూరంబీ, మామ అమ్మ ముప్పనేని నాగలక్ష్మి తదితరులను సత్యశ్రీనివాస్ చిత్రించాడు. తాను అంతకు ముందు పెయింటింగ్స్ చేయలేదు. వ్యూ ఫైండర్‌ను కాన్వాస్‌గా భావించి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని కళాత్మకంగా పట్టే విద్య తనలో ఉన్నది. రంగులతో రూపాలు ఇవ్వడం అనుభవం లేనిదే! గుహల గోడలపై ఆదిమ చిత్రకారులు మట్టి రంగులతో, జంతువుల కొవ్వులను కలిపి ఎలా చిత్రించారు? అదే ఉద్వేగం సత్యశ్రీనివాస్‌లో నర్తించింది.
‘నంబర్ 20, జర్నలిస్ట్ కాలనీ, బంజారాహిల్స్’ ఇప్పడు చేతులు మారి ‘గోథె జెంత్రమ్’ అయ్యింది. ఆ భవనంలోనే ఈనెల 5వ తేదీ నుంచి 13 వరకూ ప్రదర్శన ఏర్పాటైంది. చిత్తరువుల్లో ఉన్నవారు, వారి బంధువులు విచ్చేశారు. ‘అదుగో అమ్మ, నానమ్మ’ వంటి యురేకా మాటలు వెల్వడినవి. నిర్వాసితులు ఇంటికి చేరిన ఆనందం కువకువలాడింది. వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు, దేశాలు తమ పరస్పర సంబంధాలను తెలుసుకోవాలని, కలుపుకోవాలని తన రచనల ద్వారా చెప్పిన జర్మన్ మహాకవి గోథె ఆకాంక్ష ‘నంబర్ 20: మెమోయర్స్’ ద్వారా నెరవేరిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అమితాదేశాయ్ అన్నారు. తాము కొన్నేండ్లుగా ఇరుదేశాల మధ్య సాంస్కృతిక బాంధవ్యాలను పెంచే అనేక కార్యక్రమాలను నిర్వహించామనీ, కాని సత్యశ్రీనివాస్ చిత్తరువులు తమ సంస్థకు స్థానికతను ఇచ్చాయని కూడా అన్నారు. తల్లివేరును స్పర్శించిన ఊడలు కదా ఆ చిత్రాలు!
-- పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్, 7680950863.