కళాత్మక భావనలు విరిసిన వేదిక!
హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్, వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుక భావ్-2024 బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో వైభవంగా జరిగింది. దిగ్గజ కళాకారులచే కదిలించే ప్రదర్శనలు, పౌరాణిక పాత్రల ఆధారంగా రచించిన కళారూపకాలు, రామాయణ భావోద్వేగ చిత్రణలు, అంతరించి పోతున్న కళారూపాల పునరుజ్జీవనం మొదలైన అంశాలతో జరిగిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి అత్యుత్తమ సాంస్కృతిక ప్రతిభావంతులు, వర్ధమాన కళాకారులు హాజరయ్యారు.
మానవతావాది, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వం, ప్రేరణతో జనవరి 25 నుండి 28 వరకు జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి, కళలతో ఆధ్యాత్మికతను మేళవించి సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. కళాకారుడి భావోద్వేగ స్థితి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా, “కళాకారులు భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేక్షకులను సంతోషపెట్టే ప్రయత్నంలో కళాకారులు తరచుగా తమను తామే మరచిపోతారు. పాత్రలతో మమేకమై తమ అంతరంగాన్ని, తమ సహజ స్వభావాన్ని సైతం గమనించలేరు. పైగా మనకు ఒకటి కాదు, కోపం, ధైర్యం, దుఃఖం, విరహం – ఇలా తొమ్మిది రకాలైన భావోద్వేగాలు (నవ రసాలు) ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం కావాలంటే ఈ భావాలన్నిటినీ అధిగమించి వెళ్లాలి. వీటికి ఆవలగా వెళ్లగలిగినప్పుడే మనకు బలం వస్తుంది.” అని ప్రబోధించారు.
ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాలకు చెందిన సంగీత, నృత్య కళాకారులు హాజరయ్యారు. వర్ధమాన కళాకారులను, ఇందులో భాగంగా 61 అంశాలపై 153మంది కళాకారులతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, బృందచర్చలు మొదలైనవి ఏర్పాటు చేశారు. శతాబ్దాల క్రిందటి సంప్రదాయ వర్కరీ యాత్ర, శేషులత కోసురు మొదలైన కర్ణాటక సంగీత ప్రముఖులచే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ భావ్-2024 లో భాగంగా నిర్వహించారు.
ఈ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశం గురించి వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ శ్రీవిద్య యశస్వి మాట్లాడుతూ.. “ఇటువంటి ప్రదర్శనలలో మనం ఆ ప్రాచీన కాలానికి వెళ్ళిపోయి చూస్తాం. కళాకారుడు కేవలం దైవానికి సమర్పణగా మాత్రమే ప్రదర్శన ఇస్తాడు. ఇక చూసేవారు ఆ అనుభవానికి ప్రేక్షకులుగా ఉంటారు” అని పేర్కొన్నారు. “ఉదాహరణకు, అయోధ్యలోని దేవాలయాల నుండి 7000 సంవత్సరాలకు పైగా తరతరాలుగా సంప్రదాయబద్ధంగా నాట్యం చేస్తున్న కళాకారులను మేము ఆహ్వానించాము. వారి కళానిబద్ధత, అనుభవ సారాంశం ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రదర్శనలలోనూ మనం చూడవచ్చు.” అని ఆమె పేర్కొన్నారు.
కళారూపాలకు తమ జీవితాలను అంకితం చేసి, వాటిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ప్రముఖ కళాకారులకు కళాసారథి అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలలో ఈలపాటకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా. కొమరవోలు శివప్రసాద్, కేరళకు చెందిన డా. కళామండలం సరస్వతి, మొదలైనవారు ఉన్నారు. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యుడు, ఈలపాట మాంత్రికునిగా, ఆంధ్రకోకిలగా పేరొందిన డా. కొమరవోలు శివప్రసాద్ మాట్లాడుతూ.. ''కళా సారథి అవార్డు అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఈ కళాసారథి అవార్డు దివ్యత్వంతో కూడినది. పవిత్రమైన ఈ ఆశ్రమ వాతావరణంలో ఎక్కడ చూసినా చాలా కష్టపడి పనిచేసిన కళాకారులు కనిపిస్తున్నారు. 93 ఏళ్ల వయస్సు ఉన్న కళాకారులు సైతం ఉన్నారు. వారిని కలుసుకోగలగడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఒక అందమైన అనుభవం." అని పేర్కొన్నారు.
భావ్-2024 సదస్సులో తన అనుభవాన్ని శేషులత కోసూరు పంచుకున్నారు, తనకు సంగీతమే గొప్ప సాంత్వన చేకూరుస్తుందని తెలిపారు. ఇతరుల అనుభవాలను తెలుసుకునేందుకు గొప్ప అవకాశాన్నిచ్చిందని ప్రముఖ వైణికుడు ఫణి నారాయణ పేర్కొన్నారు. ఇలాంటికార్యక్రమాలు ప్రతీ ఏటా జరగాలన్నారు. సంగీతకారులకు భావ్ అనేది చాలా సముచితమైన గౌరవం అని ఈమని శంకరశాస్త్రిగారి కుమార్తె ఈమని కళ్యాణి పేర్కొన్నారు. భానుమతీ నరసింహన్ రచించిన ‘సీత’ పుస్తకం ఆధారంగా నృత్యరూపకాన్ని ప్రదర్శించిన ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి క్రాంతి నారాయణ్, వర్ధమాన నాట్య కళాకారిణి వనజా ఉదయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉస్తాద్ ఫజల్ ఖురేషీతో పండిట్ కాళీనాథ్ మిశ్రా తబలా వాద్య కచేరీ, కేరళకు చెందిన ఇర్రంగాపురం బాబు చెండ వాద్యం, కథక్ కేంద్ర చైర్పర్సన్ ఉమా డోగ్రా ప్రదర్శించిన ‘శబరి’ నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడు తరాలకు చెందిన కథక్ నృత్య కళాకారిణులు పద్మాశర్మ, గౌరీ, తారిణి తమ అభినయాన్ని ఈ వేదికపై లయబద్ధంగా ప్రదర్శించారు. దృష్టిలోపం, ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు రంగ్ గంధ్ పేరిట ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇవి చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు!