మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లును రాజ్యసభ ఆమోదించి వారం గడవకుండానే ఒక దురదృష్టకరమైన ఉదంతం వెలుగులోకొచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని బెహ్రాం పూర్ మానసిక రోగుల ఆస్పత్రిలో గత ఆరునెలలుగా 65మంది రోగులను ఎలాంటి అచ్ఛాదనా లేకుండా దిగంబరంగా ఉంచుతున్నారని స్వచ్ఛంద సంస్థ ‘అంజలి’ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో ఆరోపించారు. అందుకు సంబం ధించి కొన్ని ఛాయాచిత్రాలను కూడా వారు విడుదల చేశారు. మన దేశంలో మానసిక అస్వస్థతకు గురైనవారి పట్ల ఎలాంటి అమానవీయ, నిర్లక్ష్య ధోరణులు రాజ్యమేలుతున్నాయో ఈ ఉదంతం రుజువు చేస్తున్నది.
రాజ్యసభ ఆమోదించిన బిల్లు దాదాపు మూడు దశాబ్దాలనాటి మానసిక ఆరోగ్య చట్టానికి 134 సవరణలను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించకుండా మాన సిక కుంగుబాటుగా తాజా బిల్లు గుర్తిస్తోంది. మానసిక రోగుల హక్కుల విష యంలో వివిధ దేశాల్లోని చట్టాలు అసంపూర్ణంగా ఉన్నాయని, వాటిని తక్షణం సవరించాలని 2007నాటి ఐక్యరాజ్యసమితి ఒడంబడిక సభ్య దేశాలకు నిర్దేశిం చింది. మన దేశంలో మరో ఆరేళ్లకు... అంటే 2013లోగానీ దానికి అనుగుణమైన బిల్లు రూపొందలేదు. ఆ తర్వాత రాజ్యసభ ఆమోదం పొందడానికి మరో మూడేళ్లు పట్టింది.
1987నాటి చట్టం ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అందువల్ల మానసిక రోగుల సంక్షేమం, చికిత్స వంటి అంశాల్లో అడుగడుగునా నిర్లక్ష్యం ఏర్పడుతున్నదని ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. సమితి ఒడంబడికకు అనుగుణంగా ఆ చట్టాన్ని సవరించా లని కోరుతున్నాయి. ఏమైతేనేం ఇన్నాళ్లకు ఆ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. ఈ బిల్లు చరిత్రాత్మకమైనదని దాదాపు అన్ని పక్షాల ఎంపీలు కొనియాడారు. ఇదింకా లోక్‌సభ ఆమోదం కూడా పొందవలసి ఉంది.
వలస పాలకుల కాలంలో 1912లో తొలిసారి ఉన్మాద రోగుల చట్టం తీసు కొచ్చారు. 1987లో దాని స్థానంలో మానసిక ఆరోగ్య చట్టం వచ్చింది. అయితే అంతకు ముందున్న చట్టమైనా, 1987నాటి చట్టమైనా మౌలికంగా మానసిక రోగుల చికిత్స, వారిని ఆస్పత్రిలో చేర్చుకోవడం, డిశ్చార్జి చేయడం, మానసిక చికిత్సాల యాల క్రమబద్ధీకరణ వంటి అంశాలపైనే కేంద్రీకరించాయి. మానసిక రోగుల కుండే హక్కులు, వారిపై వివక్ష ప్రదర్శించి ఆ హక్కులకు భంగం కలిగించిన సందర్భాల్లో తీసుకోదగిన చర్యలేమిటన్న విషయాల్లో ఆ రెండు చట్టాలూ మౌనం పాటించాయి.
తాజా బిల్లు అనేక అంశాల్లో మెరుగ్గానే ఉన్నా అది పట్టించుకోకుండా వదిలేసిన ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. రోగుల పేదరికం, వారిచుట్టూ ఉండే పరిసరాలు, ముఖ్యంగా వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థితిగతులు వంటి విషయాలపై ఇది దష్టి పెట్టలేదు. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసినవారిపై చర్యలకు సంబంధించిన ప్రస్తావన లేదు. అస్వస్థతపై చూపిన శ్రద్ధ, దాని నివారణ తదితరాలపై లేదు. ఒక ఇంట్లో మానసిక రోగి ఉన్నప్పుడు అలాంటివారితో వ్యవ హరించాల్సిన తీరుపై ఆ కుటుంబంలోని వారికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది.
కొన్ని సందర్భాల్లో వారికి సైతం చికిత్స అవసరం ఉంటుంది. మన సంస్కతి, సామాజిక స్థితిగతులు ఎలాంటివంటే... కుటుంబంలో ఎవరి మానసిక స్థితి అయినా సరిగాలేని పక్షంలో వారికి చికిత్స ఇప్పించడం కంటే ఆ సంగతి వెల్లడి కాకూడదని కోరుకుంటారు. వారు ఎవరి కంటా పడకూడదనుకుంటారు. మానసిక అస్వస్థత ఉన్నదని తెలిస్తే కుటుంబాన్ని ఇరుగు పొరుగు చిన్నచూపు చూస్తారని, హేళన చేస్తారని వారి భయం.
రోగులకు ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ(ఈసీటీ) ఇవ్వడం వారి శ్రేయస్సురీత్యా మంచిదికాదని, దాన్ని నిషేధించాలని అంతర్జాతీయంగా నిపుణులు చెబుతున్న మాట. బిల్లు దాని జోలికి వెళ్లలేదు. అలాగే మానసిక రోగుల సంరక్షకుల నియా మకం, వారి హక్కులు, బాధ్యత వంటి అంశాల గురించి ఇందులో లేదు. మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులకుండే హక్కులకు సంబంధించి 2014లో రూపొందిన బిల్లులో దీని ప్రస్తావన ఉంది.
ఆ బిల్లు ఇంకా పార్లమెంటు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. ఆ అంశాలను ప్రస్తుత బిల్లులో చేర్చి ఉంటే మరికాస్త సమగ్రత వచ్చేది. చట్టం అమలులో నిర్లక్ష్యం వహించినా, మానసిక రోగుల హక్కుల్ని ఉల్లంఘించినా ఆర్నెల్ల వరకూ జైలు, రూ. 10,000 వరకూ జరిమానా విధించవచ్చునని బిల్లు నిర్దేశిస్తున్నది. అయితే వీటిని అంశాలవారీగా నిర్దిష్టంగా పేర్కొని ఉంటే సబబుగా ఉండేదని ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు. అలాంటి నిర్దిష్టత ఉన్నట్టయితేనే బెంగాల్ ఆస్పత్రిలో జరిగినలాంటి ఉదంతాలను నివారించడానికి వీలవుతుంది.
అస్వస్థతకు ఎలాంటి చికిత్స అవసరమనుకుంటున్నారో రోగులు నిర్ణయించు కోవచ్చునని బిల్లు చెబుతోంది. వారు ఆ స్థితిలో లేరనుకుంటే ఆ సంగతిని నిపు ణులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. తమపట్ల అమానవీయంగా ప్రవర్తించడం, అందరితో సమంగా చూడకపోవడంవంటి అంశాల్లో ఫిర్యాదు చేసే వీలుంటుంది. మానసిక రోగులను మెట్రోలో ప్రయాణించడానికి అనుమతించబోమని ఢిల్లీ మెట్రో రైలు సంస్థ నిబంధన పెట్టడంపై మూడు నెలలక్రితం తీవ్ర విమర్శలొ చ్చాయి. తాజా బిల్లు చట్టమైతే ఇలాంటి నిబంధనలకు ఆస్కారం ఉండదు.
మన దేశంలో మానసిక రోగులు పదిమంది ఉంటే వారిలో ఒక్కరికి మాత్రమే చికిత్స లభిస్తున్నదని ఈమధ్య అంతర్జాతీయ వైద్య జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. దేశంలో దాదాపు 10 శాతంమంది జనాభా వివిధ రకాలైన మానసిక అస్వస్థతకు గురవుతున్నట్టు అది తెలిపింది. ఇందులో మానసిక కుంగుబాటు మొదలుకొని మాదకద్రవ్యాల వాడకం వరకూ ఎన్నో ఉన్నాయి.
ప్రపంచంలో మూడోవంతు మంది మానసిక రోగులు భారత, చైనాల్లో ఉన్నారు. వీరిలో మహిళలే అధికం. అభివద్ధి చెందిన దేశాల్లోని రోగుల సంఖ్యతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కానీ మన దేశంలో సగటున పది లక్షలమందికి ముగ్గురు మాత్రమే మానసిక వైద్య నిపుణులున్నారు. ఈ స్థితి మారాలి. లోక్‌సభలో చర్చకొచ్చినప్పుడైనా బిల్లులో ప్రస్తావనకు రాని కీలకాంశాలను చేర్చి దానికి మరింత సమగ్రత తీసుకురావాలి.